ఆయన సత్యవంతుడు…. ఆమె సావిత్రి - Raka Lokam

ఆయన సత్యవంతుడు…. ఆమె సావిత్రి

Share This



నాలుగు గంటల హోరాహోరీ పోరాటం….

ఒంట్లో తొమ్మిది బుల్లెట్లు…

తలలో…ఛాతీలో, నడుము భాగంలో, తుంటి ఎముక దగ్గర, రెండు చేతులకు, కుడి కంట్లో తూటాలు...

పదహారు రోజులు కోమాలో…. పగలు తెలియదు… రాత్రి తెలియదు….

నెలరోజులు ఆస్పత్రిలో …మంచానికే పరిమితం….మందులే జీవితం….

ఒక కంటి చూపు శాశ్వతంగా పోయింది.


ఇంత జరిగిన తరువాత ఆ సైనికుడు ఏమంటాడో ఊహించగలరా?

“నా జీవితం దేశానికి అంకితం. నేను ఆస్పత్రిలో ఉంటే నన్ను పలకరించేందుకు ఆర్మీ చీఫ్ వచ్చారు. ఒక సైనికుడికి అంతకన్నా ఏం కావాలి?” ఇదీ అతని నోటి నుంచి వెలువడ్డ మాట!

ఆయన పేరు చేతన్ కుమార్ చీతా!

“మళ్లీ యూనిఫారం ధరించి, ఆయన పోరాటానికి సిద్ధమైన రోజే ఆయన పూర్తిగా కోలుకున్నట్టు.” ఇదీ ఆయన భార్య అన్న మాట.

ఆమె పేరు ఉమా సింగ్!!

మృత్యువు నోట కరచుకుని కబళించాలనుకుంటున్న వేళ…ఆయువును రాహువు ఆబగా తినేయాలనుకున్న వేళ…దేశం గురించి మాట్లాడేవాడు హీరో…

జీవిత భాగస్వామి రణహోమంలో సమిధగా రక్తమోడుతూ ఉన్న వేళ ఆయన మళ్లీ పోరాటంలోకి వెళ్లానుకునే భార్య నిజమైన హీరోయిన్…

ఇలాంటి రియల్ లైఫ్ హీరో, హీరోయిన్లు ఉన్నంత వరకూ కశ్మీర్ని ఎవరు కబళించగలరు?


ఫిబ్రవరి 14 న కశ్మీర్ లోయలోని బాండీపురా లోని హజ్జాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న వార్త వచ్చింది.
సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీస్, సీ ఆర్ పీ ఎఫ్ లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. హోరాహోరీగాపోరాటం జరిగింది. ఈ పోరాటంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. పదిహేనుమందికి గాయాలయ్యాయి. ఇలా గాయపడ్డ వారిలో సీఆర్ పీ ఎఫ్ 45 వ బెటాలియన్ కమాండెంట్ చేతన్ కుమార్ చీతా ఒకరు.

ఆయనను శ్రీనగర్ బేస్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన బ్రతికే ఆశలు కనిపించలేదు. అయినా ఆయనకు వారు సర్జరీ చేశారు.

ఆయన్ను హెలీకాప్టర్ లో ఢిల్లీ లోని ఆలిండియా ఇన్స్ టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ కి తీసుకువెళ్లారు.
చేతన్ చీతా కోమాలోనూ పోరాటం ఆపలేదు. మృత్యువును వెక్కిరించి నిలిచి గెలిచాడు. ఉమాసింగ్ నమ్మకం కోల్పోలేదు. ఆయన సత్యవంతుడైతే, ఆమె సావిత్రి. మరి యముడు ఓడిపోవాల్సిందే కదా!!

“ఆయన కోమాలో ఉన్నా నేను ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆయన వేళ్లు కదిలేవి. నేను నమ్మకం కోల్పోలేదు.” అంది ఆమె.

పదుల సంఖ్యలో సర్జరీలు, వందలాది ప్రొసీజర్లు చేసిన తరువాత చీతా స్పృహలోకి వచ్చాడు. ఆయనచికిత్సలో ఉండగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరన్ రిజిజులు ఆయనను పరామర్శించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితి గురించి తెలుసుకుంటూ వచ్చారు. చివరికి ఏప్రిల్ అయిదో తేదీన ఉమాసింగ్ తోడు రాగా, చేతన్ కుమార్ చీమా ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరారు.
చేతన్ చీతా, ఉమా సింగ్ – ఇవి కేవలం రెండు పేర్లు కావు.

ఇవి ఉగ్రవాదంపై భారత్ పోరాటపు ఉఛ్వాస నిశ్వాసాలు. నూట ఇరవై ఆరు కోట్ల గుండెల విజయాకాంక్షల ప్రతీకలు. పాక్ ఎన్ని పన్నాగాలు పన్నినా కశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా చేజిక్కించుకోలేకపోవడానికి కారణం ఇదిగో ఇలాంటి రియల్ లైఫ్ హీరోలే! ఈ దేశంలో అలాంటి హీరో, హీరోయిన్లకు కొదవ లేదు.

1 comment:

  1. superb sir.meeru rasina ilanti yodhula kadhalannee kalipi book theesuku randi.super hit avuthundi-yazulu

    ReplyDelete

Pages