ఒక నడిచే చరిత్ర శాశ్వత నిద్రలోకి జారుకుంది! - Raka Lokam

ఒక నడిచే చరిత్ర శాశ్వత నిద్రలోకి జారుకుంది!

Share This
పైజామా పాతబడి చిరిగిపోతే...?

నాలుగు సంచీలు తయారు చేసుకుంటాను.
నాలుగు సంచీలు చినిగిపోతే...?
ఎనిమిది చేతి రుమాళ్లు తయారు చేసుకుంటాను.


పొదుపు చేయడం, అనవసరంగా వనరుల్ని వృథా చేయడం ఆయనకు ఏనాడూ ఇష్టం ఉండేది కాదు. ఆఖరికి అది చినిగిన పైజామా అయినా. మీరు లేఖ రాసి పంపితే, ఆ లేఖ వెనుక ఖాళీ స్థలంలోనే చిన్న చిన్న అక్షరాలతో జవాబు వ్రాసి పంపేవారు.
ఎప్పుడైనా అడిగితే "వనరులను వృథా చేయకూడదు అనేవారు." మరీ అడిగితే ... "కొత్తవి కొనలేక కాదు. నేను ఖర్చు చేసే డబ్బు నాది కాదు. సమాజానిది. నా కోసం కొనకూడదు అన్నదే నా నియమం." అనేవారు.

ఆ వ్యక్తి మధుకర్ విశ్వనాథ్ లిమయే. ఆర్ ఎస్ ఎస్ తొలితరం ప్రచారకుల్లో ఒకరు. అసొం లో ఆరెస్సెస్ చరిత్ర మధుజీ చరిత్ర వేర్వేరు కావు. రెండూ అవినాభావంగా పెనవేసుకుపోయాయి.
వనరుల విషయంలోనే కాదు. అన్ని విషయాల్లోనూ ఇదే పట్టుదల ఆయనలో అణువణువునా బ్రహాండ సమానంగా కనిపించేది.

చేసిన ఖర్చులకు లెక్కలు వ్రాయడం తప్పని సరి. ఆ విషయంలో ఎంత పట్టుదలో, భారతీయ అంకెలు రాయాలన్న విషయంలోనూ అంతే పట్టుదల ఉండేది. నేను ప్రస్తుతం వాడకంలో ఉన్న అరబిక్ అంకెల్లో లెక్కలు వ్రాస్తే ఆయన భారతీయ భాషలో వ్రాయమని పట్టుబట్టారు. నేనూ మొండిగా "హిందీ లేదా అస్సమియా అంకెల్లో కాదు తెలుగు అంకెల్లోనే వ్రాస్తాను. నాకు తెలుగు అంకెలు వ్రాయడం రాదు. నేర్చుకున్నాక రాస్తాను" అని మొండిగా వాదించాను. ఆయన ఏం మాట్లాడలేదు.
మళ్లీ కలిసినప్పుడు ఆయన ఒక పోస్టు కార్డు చేతిలో పెట్టారు.
Image result for MADHUKAR VISWANATH LIMAYE

అందులో తెలుగు అంకెలు వ్రాసి ఉన్నాయి. హైదరాబాద్ లోని ఆరెస్సెస్ కార్యకర్తల చేత తెలుగు అంకెలు రాయించుకుని లేఖ తెప్పించుకున్నారు. పట్టుదల మీద నేను తెలుగు అంకెల్లో అకౌంట్లు రాస్తే, ఆయన తన డైరీలో రాసుకున్న అంకెల సాయంతో పోల్చుకుని అకౌంట్లు సరిచేసేవారు. భారతీయత విషయంలో ఆయన పట్టుదల అది.

మధుకర్ జీ ముంబాయికి చెందిన వారు. అక్కడే బాల్యంలో ఆరెస్సెస్ లో చేరారు. ఆరెస్సెస్ ఆయనలో చేరింది. ఇక ఆయన ఆరెస్సెస్ వేరుకాదు. "ప్రేమ గలీ అతి సాంకరీ... జ్యా మే దో న సమాయ్‌" (ప్రేమమార్గం ఎంత ఇరుకంటే ఇందులో ఇద్దరికి స్థానం ఉండదు) అన్నట్లు అయిపోయారు. పాల్ఘర్ (ముంబాయి) లో కొంత కాలం ప్రచారక్ గా చేశారు. ఆ తరువాత అసొంకి వెళ్లమన్నారు.

ఆంధ్రలో తొలి ఆరెస్సెస్ శాఖ పెట్టిన దత్తాత్రేయ దండోపంత బందిష్టే గారే అసొంలోనూ తొలి శాఖకు ప్రాణం పోశారు. ఆ తరువాత 1950 లో మధుకర్ జీ ని అసొం పంపించారు. అసొమియా, బంగ్లా, హిందీ, మరాఠీ, సంస్కృతం, ఇంగ్లీష్ వంటి భాషలను ఔపోసన పట్టారు. అసొంలో ఆరెస్సెస్ ఎదుగుదలతో ఎరువుగా మారారు. హిందూసంఘటన ఊపులో ఊపిరిగా మారారు.

ఆయన నగావ్ లో శాఖ నడిపిస్తూంటే ఒక పిల్లవాడితో పేచీ వచ్చింది. వాడు ఇంటికి వెళ్లి బాబాయితో ఫిర్యాదు చేశాడు. ఆయన అగ్గిమీద గుగ్గిలమై తుపాకీ తీసుకొచ్చి మధుకర్ జీ ని కాల్చేసేందుకు వచ్చారు.

కానీ మధుకర్ జీ తో నాలుగు నిమిషాలు మాట్లాడాక తుపాకీ పక్కన పెట్టారు. ఆ గడ్డిలోనే కొన్ని గంటలు కూర్చుని మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ వ్యక్తి తరువాత అసొం ప్రాంతానికి తొలి ప్రాంతీయ కార్యవాహ అయ్యారు. ఆయనే శ్రీ భూమిదేవ్ గోస్వామి.
అసొంలో పనిచేయడం అంటే ముళ్ల బాట లాంటిది. సవాళ్లు, సమస్యలు, ఇడుములు ఇక్కట్ల మద్య పని పడుతూ లేస్తూ సాగింది. అనేకానేక ఆరోపణలు, విమర్శల మద్య సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లారు మధుకర్ జీ. మేథావులు, పండితులు, రాజకీయ నేతలతో ఆయన ఆ స్థాయిలో చర్చలు చేసేవారు. అందరికీ కలిసే వారు. ఇళ్లలో కుటుంబ సభ్యులలో ఒకరైపోయి వ్యవహరించేవారు. ఆయన సంచీలో ఎప్పుడూ పిప్పర్ మింట్లు ఉండేవి. ఆయన వచ్చారంటే సరి పిల్లలు బిలబిలమంటూ పోగయ్యేవారు. వారందరితో ఆయన ఆడిపాడి, చివరికి చాక్లెట్లు ఇచ్చేవారు. ఇది ఎంత అలవాటయ్యిందంటే ఆయన ఒక ఇంటికి వెళితే మూడు నాలుగు తరాల వారు చాక్లెట్ల కోసం చేతులు చాచేవారు. ఎందుకంటే నాన్నమ్మ, అమ్మ, కూతురు, కూతురు కూతురికి కూడా మధుకర్ జీ అంటే 'చాక్లెట్ మామ'. పేరులో ఉన్న తీపినే ఆయన అందరికీ జీవితాంతం పంచారు... పేరులోనే ఉన్న మాధూకర వృత్తిలోనే జీవితమంతా 'తరుతల శయ్య, కరతల భిక్ష' అన్నట్టు గడిపారు.

ఆరెస్సెస్ అసొం ప్రాంత బౌద్ధిక ప్రముఖ్‌ గా, ప్రాంత సహ ప్రచారక్ గా, క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్ గా ఆయన జీవితమంతా సేవలందించారు. ఆయన జీవితమూ ఒక తపస్సుగా సాగింది. చివరి దాకా సైకిలే ఆయన వాహనం. స్నేహమే ఆయన సాధనం.
ఆయన వ్రాసిన ఖట్టీ మీఠీ యాదే పుస్తకానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అవార్డునిచ్చింది. దాన్ని ఆయన అటల్ బిహారీ వాజ్ పేయీ చేతుల మీదుగా స్వీకరించారు. మై హోం ఇండియా ఆయనకు వన్ ఇండియా అవార్డునిచ్చి తనను తాను సత్కరించింది. ఆయన అనేక పుస్తకాలను రచించారు. జాతీయ వాద పత్రిక ఆలోక్ ను ప్రారంభించారు.

గత కొన్నేళ్లుగా మధుకర్ జీ చలికాలం ముంబాయిలో, వేసవి కాలం అసొంలో గడిపేవారు. 91 ఏళ్ల వయసులో నవంబర్ 5 న ముంబాయి ఆరెస్సెస్ కార్యాలయంలో ఆయన తనువు చాలించారు. అసొం ఒక నడిచే ఎన్ సైక్లోపీడియాను, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సమర యానంలో ప్రతి అడుగును అనుభవించి, పలవరించి, నడిచే చరిత్రగా నిలిచిన వ్యక్తి వెళ్లిపోయారు.

ఆయనతో కలిసి పని చేసిన లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులకు ఇప్పుడు ఆయన జ్ఞానాన్నిచ్చే ఒక జ్ఞాపకం గా అయిపోయారు.

పతత్వేష కాయో నమస్తే నమస్తే అన్న ప్రార్థనలో ప్రతి అక్షరాన్ని పలవరించి, అనుసరించి, తరించారు మథుకర్ లిమయే.


కర్మశీలి ధన్య జీవీ.... 

జయము నీదేలే... 
జయము నీదేలే...

No comments:

Post a Comment

Pages