పెద్ద ఏనుగు.... చిన్న గొలుసు - Raka Lokam

పెద్ద ఏనుగు.... చిన్న గొలుసు

Share This

భారీ ఏనుగు.... ఎంతో బలముంది.... టన్నుల బరువున్న వస్తువులను అవలీలగా లాగేయగలదు...
కానీ కాలికి ఇనుప గొలుసులున్నాయి. అది తొండం ఆడిస్తోంది తప్ప కదలడం లేదు.
ఏనుగుకి ఒక్క ఉదుటున గొలుసుల్ని తెంచుకునేంత బలముంది... కానీ తెంచుకోవడం లేదు.
ఇది చూసిన యువకుడికి ఆశ్చర్యం వేసింది.
"అదేమిటి? అంత బలమున్న ఏనుగును కట్టిపారేసేందుకు ఇంత చిన్న గొలుసా?" అని అడిగాడు మావటీని.
"అవును.... ఏనుగు పారిపోదు...సంకెలను తెంచుకోదు" అన్నాడు మావటి.
"అదెలా?"
"అది చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ ఇనుప గొలుసులు కాలికి బిగించి కట్టేశాం. అప్పట్లో అది చిన్నది. సంకెళ్లను తెంచుకునే బలం దానికి ఉండేది కాదు. సంకెళ్లను తెంచుకునేందుకు పదేపదే ప్రయత్నించింది. ప్రతి సారీ విఫలమైంది. ఇక ఈ సంకెళ్లను ఎప్పటికీ తెంచుకోలేను అన్న ఆలోచన దానిలో బలంగా నాటుకుంది. ఇప్పుడది పెద్దదైపోయింది. దానికి చాలా బలం ఉంది. సంకెళ్లు మాత్రం పాతవే. కానీ దాని మనసులో ఈ సంకెళ్లను నేను తెంచలేను, తప్పించుకోలేను అన్న భావం ఎంత బలంగా నాటుకుందంటే అది సంకెళ్లను తెంచుకునేందుకు అస్సలు ప్రయత్నించదు. అది ప్రయత్నించడం మానేసింది. పోరాడటం వదిలేసింది." అన్నాడు మావటీ.
యువకుడికి అర్థమైంది.
సంకెళ్ల భౌతిక బలం కన్నా, ఏనుగు మానసిక బలహీనతే అసలు బంధనం.
సమస్యల సంకెళ్లు చాలా బలహీనమైనవి.
వాటిని తెగతుంచే శక్తి ఉందని తెలుసుకోలేకపోవడమే అసలు బలహీనత.

1 comment:

Pages