పాకిస్తానీలను ఉతికి ఆరేసిన ధోబీ రామచందర్ - Raka Lokam

పాకిస్తానీలను ఉతికి ఆరేసిన ధోబీ రామచందర్

Share This


నేటి భాంబ్లా


డిసెంబర్ 18, 1947.
జమ్మూ కశ్మీర్ ను కబళించేందుకు తెగబడి చొరబడిన పాక్ మూకలను తరిమికొట్టేందుకు భారత సైన్యం ప్రాణాలొడ్డి పోరాడుతోంది.
మద్రాస్ సాపర్స్ కి చెందిన ఇంజనీర్ల దళం లెఫ్టినెంట్ ఎఫ్ డి డబ్లు ఫాలన్ నాయకత్వంలో జమ్మూకి వెళ్తోంది. పలు సైనిక వాహనాలు తరలి వెళ్తున్నాయి.
జమ్మూ కి అరవై తొమ్మిది కి.మీ దూరంలో భాంబ్లా అనే చిన్న ఊరు ఉంది.
ఆ ఊరికి చేరుకోగానే పాకిస్తానీ మూకలు ఒక్కసారిగా మన వాహనాలపై విరుచుకుపడ్డాయి. తుపాకీలు పేలడం మొదలైంది. మన సైనికులు ఎలాగోలా దాటి ముందుకు పోవడానికి ప్రయత్నించాయి.
కానీ జమ్మూ భాంబ్లా దారిలో ఉన్న వంతెన ముందు భాగాన్ని శత్రువు ధ్వంసం చేశాడు. ముందుకు వెళ్లడం కష్టం. వెనక్కి రావడమూ కష్టం. మన సైనికులు ఇరుక్కుపోయారు.
కమాండర్ ఫాలన్ వాహనాల్లో ఉన్న ఇంజనీర్లకు, వారికి సహాయకులుగా ఉన్న వారిని వంతెనను బాగుచేయమని ఆదేశాలిచ్చాడు.
తాను మరి కొందరు జవాన్లు శత్రువుపై గుళ్ల వర్షం కురిస్తామని, ఈ హోరాహోరీ మధ్యలోనే వంతెనను బాగుచేయాలని చెప్పాడు.
తూటాల వర్షంలో పనిచేయాలి. అంటే ప్రాణాల మీద ఆశవదిలేసుకోవాలి.
అప్పుడు నేనున్నానంటూ ఒక యువకుడు ముందుకురికాడు.
అతనిపేరు ధోబీ రామ్ చందర్.
ధోబీ అంటే చాకలి. రామచందర్ సైనికుల దుస్తులను ఉతికే ఉద్యోగం చేసేవాడు. అందుకే అందరూ అతడిని ధోబీ రామచందర్ అని పిలిచేవారు.రామ్ చందర్ ఇంజనీర్లకు సాయం చేస్తూ కాల్పుల మధ్యలోనే వంతెనను బాగుచేసే పనిలో నిమగ్నమయ్యాడు.
అంతలో ఒక తూటా లెఫ్టినెంట్ ఫాలన్ ఛాతీలో దిగింది. ఆయన నేలకొరిగిపోయాడు. రక్తం ధారాప్రవాహంగా కారుతోంది. ఇంజనీర్లు, సైనికుల్లో అయోమయం నెలకొంది. ఆ సమయంలో ధోబీ రామచందర్ మెరుపులా ముందుకురికి కమాండర్ తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. శత్రువుపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. సైనికులు తేరుకుని అతనికి సహాయపడ్డారు. శత్రువుపై ఎదురుదాడి చేశారు. కేవలం సైనికుల బట్టలు ఉతికే రామచందర్ అసమాన నాయకత్వాన్ని, ధైర్య సహాసాలను, విధి నిర్వహణా సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ధోబీ రామచందర్ వీరోచితంగా నిలవక పోతే మన సైనికులు పాకిస్తానీ మూకల తూటాలకు ఎరగా మారిపోయేవారు.


ధోబీ రామచందర్ తూటాకు ఒకరు, ఇద్దరు, ముగ్గురు … ఇలా ఆరుగురు శత్రువులు నేలకూలారు. ఈ దాడితో శత్రువులు పలాయనం చిత్తగించారు. రామ్ చందర్ అంతటితో ఆగలేదు. తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారకస్థితిలో ఉన్న కమాండర్ ను భుజానికి ఎత్తుకుని ఎనిమిది కిలో మీటర్లు పరుగుపెట్టి ఆస్పత్రికి చేర్చాడు. ఆ అధికారి ప్రాణాలను కాపాడాడు.
పెద్దగా సైనిక శిక్షణ లేని ధోబీ రామచందర్ చూపిన అసమాన ధైర్య పరాక్రమాలను గుర్తించిన భారతప్రభుత్వం ఆయనకు మహావీర చక్రను ప్రదానం చేసింది.పంజాబ్ ప్రభుత్వం ధోబీ రామచందర్ కు భూమిని ఇస్తానని వాగ్దానం చేసింది. కానీ తరువాత మాట మరిచిపోయింది. ధోబీ రామ్ చందర్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అధికారులను వేడుకున్నాడు. కానీ భూమి ఆయనకు దక్కలేదు. కశ్మీర్ ను కాపాడిన మహాయోధుడికి ఇస్తామని వాగ్దానం చేసిన భూమిని సైతం అధికారులు ఇవ్వలేదు. యాభై ఏళ్ల పాటు ఎదురు చూపులు చూసి చూసి ధోబీ రామ్ చందర్ 1998 లో చనిపోయాడు. ఆయన భార్య తారాదేవి భూమి కోసం పోరాడుతూనే ఉంది. ఆమెకిప్పుడు 75 ఏళ్ళు.
విషాదం ఏమిటంటే మహావీర చక్ర మహాయోధుడి కుటుంబానికి ఇప్పుడు వచ్చేది నెలకు అయిదు వేల రూపాయలు మాత్రమే. దానితోనే కటికపేదరికంలో మగ్గుతూ ఆమె కాలం వెళ్ల దీస్తోంది. అదే అధికారులు కశ్మీర్ లో భారత వ్యతిరేక నినాదాలిచ్చి, ఉద్యమాలు చేస్తున్న వేర్పాటువాద నేతలకు పెన్షన్లు, ఆర్ధిక సదుపాయాలు, ఉచిత వైద్యం, అడగకుండానే పాస్ పోర్టులు ఇలా అన్నిటినీ సమకూరుస్తోంది. వారు భారత వ్యతిరేక విషాన్ని విరజిమ్ముతున్నా సకల సౌకర్యాలను సమకూరుస్తోంది. కానీ దేశం కోసం ప్రాణాలను లెక్కించకుండా పోరాడిన ధోబీ రామచందర్ కుటుంబానికి ఎలాంటి సాయమూ చేయడం లేదు. ఇంతకన్నా విషాదం ఏమిటంటే జాతి అనుక్షణం గుర్తుంచుకోవాల్సిన ధోబీ రామచందర్ ఫోటో సైతం లభ్యం కావడం లేదు. ఆయన గురించి దేశంలో ఎవరికీ తెలియదు. జమ్మూ కశ్మీర్ ను కాపాడుకునే పోరాటంలో ప్రాణాలకు లెక్కించని పౌరుష వీరుడైన ధోబీ రామచందర్ లాంటి అజ్ఞాత వీర జవాన్లను తలచుకునేవారు కూడా లేరు.

2 comments:

  1. At least now the BJP Government at Centre can respond if it feels the responsibility

    ReplyDelete
  2. Sudhakarji is doing immense service to those unsung and unweapt but great sons of our motherland.Hope that the present rulers will act at least now even though belatedly!

    ReplyDelete

Pages