మహారాజా హరిసింగ్ కి అన్నీ దుర్వార్తలే వస్తున్నాయి. ఒక వైపు పూంఛ్ లో ముస్లిం సైనికులు తిరుగుబాటు చేశారు. మీర్ పూర్ ను పాకిస్తానీలు చుట్టు ముట్టారు. స్థానిక ముస్లింలు వారితో చేయి కలిపారు. మరోవైపు ముజఫరాబాద్ లో ముస్లిం తెగలకు చెందిన సాయుధ దోపిడీదారులు దొరికిన వాళ్లను దొరికినట్టు చంపుతున్నారు.
శత్రువు దగ్గరకి వచ్చేస్తున్నాడు. ఉడి, డోమెల్, బారామూలాలను దాటేస్తే తరువాత కశ్మీర్ లోయ గుండెకాయ శ్రీనగర్ కి చేరుకుంటాడు. శ్రీనగర్ చేజిక్కితే మొత్తం లోయ పాకిస్తాన్ చేజిక్కినట్టే. అందాల నందనవనం కశ్మీరం ముష్కరుల చేజిక్కినట్టే.
మహారాజు సేనాధ్యక్షుడు బ్రగేడియర్ రాజేంద్ర సింగ్ జమువాల్ ను పిలిపించాడు.
“బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్…. శత్రువు దూసుకొస్తున్నాడు. శత్రువును ఎలాగైనా ఉడి దాటనీయకూడదు. తుదకంటా పోరాడండి. చివరి వ్యక్తి వరకూ పోరాడండి.” ఇదీ ఆయన ఆదేశం.
మహారాజు కు వినయంగా నమస్కరించాడు రాజేంద్ర సింగ్. మహారాజు ఆజ్ఞ అర్థమేమిటో అతనికి తెలుసు. ఆరువేల మంది శత్రువులు… తన చేతిలో కేవలం నూటయాభై మంది. ఆయుధాలు కూడా పెద్దగా లేవు. శత్రువును నిలువరించడం అంటే ప్రాణాలపై ఆశవదులుకోవలసిందే.
కానీ మరో ఆలోచన లేకుండా సైన్యంతో బయలుదేరి వెళ్లాడు రాజేంద్ర సింగ్.
అది అక్టోబర్ 23, 1948.
జమ్మూ కశ్మీర్ భారత్ సాయం కోసం, రాజేంద్ర సింగ్ బలిదానం కోసం ఎదురుచూస్తోంది.
నూటయాభై మంది సైనికులతో ఉడి చేరుకున్నాడు రాజేంద్ర సింగ్.
అప్పటికే కోహాలా, డోమెల్ లు శత్రువు చేతికి చిక్కాయి. ఇక తరువాతి దాడి ఉడిపైనే.
తన సేనలతో రాత్రికి రాత్రి బంకర్లు నిర్మింపచేశాడు రాజేంద్ర సింగ్. ఉడి వంతెనను ధ్వంసం చేయాలి. అలా చేస్తే శత్రువు కు నదిని దాటడం కష్టమౌతుంది. అయితే వంతెనను ధ్వంసం చేస్తే అటు వైపు నుంచి వచ్చే శరణార్థులకు ఇటువైపు రావడం కష్టమౌతుంది. అందుకని చివరి వరకూ ఆగి శత్రువు దగ్గరికి వచ్చిన తరువాత వంతెనను ధ్వంసం చేయాలని నిర్ణయించాడు రాజేంద్ర సింగ్. శత్రువు అయిదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వంతెనను ధ్వసం చేయించాడు. దీనితో శత్రువు యాత్ర ఆగిపోయింది.
ఆ తరువాత శత్రువుతో భీకరంగా పోరాడారు డోగ్రా సైనికులు. దాదాపు మూడు రోజుల పాటు వారు శత్రువును నిలువరించారు
సాధనాలు తక్కువ. సైనికులు తక్కువ. కానీ రాజేంద్ర సింగ్ సాహసోపేట ప్రయత్నాల వల్ల నాలుగు రోజుల పాటూ పాక్ ముష్కరులు ముందుకు సాగలేకపోయారు. చివరికి బునియార్ వద్ద బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన అలాంటి పరిస్థితిలోనూ తన సైనికులను బారాముల్లా వైపు వెళ్లి, అక్కడ మిగతా డోగ్రా సేనలతో కలిసి పోరాడమని ఆదేశించాడు. ఆయన సహచరుడు ఖజాన్ సింగ్ ఆయనను మోసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
కానీ తనను మోసుకువెళ్తే సైనికులు వేగంగా వెళ్లలేరు. కాబట్టి తనను వదిలేసి వెళ్లమని ఆయన ఆదేశించాడు. తమ నేతను సైనికులు బునియార్ వద్ద ఒక కల్వర్ట్ వద్ద వదలి వెళ్లిపోయారు. రాజేంద్ర సింగ్ ను చూడటం అదే చివరి సారి.
ఒక సర్వ సేనాని సమరాంగణంలో స్వయంగా నాయకత్వం వహించి పోరాడటం అత్యంత అరుదు. రాజేంద్ర సింగ్ చేసిన నిరుపమాన త్యాగం వల్ల పాక్ ముష్కరులు శ్రీనగర్ చేరుకోలేకపోయారు. నాలుగు రోజుల పాటు వారిని ఆయన నిలువరించారు. 26 అక్టోబర్ న జమ్మూ కశ్మీర్ మహారాజు భారత్ లో తన రాజ్యాన్ని విలీనం చేస్తూ సంతకం చేశారు. 27 అక్టోబర్ నాడు భారత సేనలు శ్రీనగర్ విమానాశ్రయంలో దిగాయి. పాక్ సేనలను చావుదెబ్బ తీశాయి.
రాజేంద్ర సింగ్ అసమాన త్యాగం వల్ల శ్రీనగర్ లోయను రక్షించడం సాధ్యమైంది. ఆయన పోరాటం భారత దేశ చిత్రపటంలో కశ్మీరును కలికితురాయి చేసింది. ఆయన సాహసోపేత పోరాటాన్ని జాతి కృతజ్ఞతతో మహావీర చక్ర ఇచ్చి గౌరవించుకుంది. దేశ చరిత్రలోని తొలి మహావీర చక్ర ఆయనకే దక్కింది.
జమ్మూ నడిబొడ్డున రాజేంద్ర సింగ్ విగ్రహం త్యాగం గాథలను మరచిపోవద్దని మరీమరీ చెబుతుంది.
ఆయన పుట్టిన ఊరు బగూనా తన పేరును రాజేందర్ పురా గా మార్చుకుంది.
వీరుడు మరణించడు లే…
వీరుడు మరణించడులే…
కవితలలో నిలుస్తాడు.
కవికలముల గెలుస్తాడు.
జనగళములు జయఘోషగ
జగతిని జీవిస్తాడు.
ప్రతి రక్తపు బొట్టు నుంచి
తానే ప్రభవిస్తాడు.
ఇతిహాసపు ఘట్టముగా
ఘనప్రేణనిస్తాడు.
తనయుని త్యాగమె తల్లికి
తనపరిచయమౌతుంది.
తరతరాల చరితగా
నరనరాన నిండుతుంది.
Sudhakar Garu wrote very nice. Good part is pottery is also entering
ReplyDeleteSudhakar garu, very good post. More information about dedicated sacrifice.
ReplyDelete