అవును….ఆమె ఉగ్రవాదిని చంపేసింది!!! - Raka Lokam

అవును….ఆమె ఉగ్రవాదిని చంపేసింది!!!

Share This



రావణుడు భవతీ భిక్షాందేహీ అన్నాడు……

సీత అమాయకంగా గీత దాటింది…..

ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.

కానీ ఆధునిక యుగంలో అక్కడెక్కడి నుంచో రావణాసురుడు వచ్చాడు.

“భవతి అమ్మాయి దేహీ”అన్నాడు. ఆ అమ్మాయి గీత దాటింది. వాడి చేతుల్లోని ఏకే 47ని లాక్కుంది. వాడిని కాల్చి పారేసింది. “డామిట్ కథ అడ్డం తిరిగింది,” అనుకుంటూ కుప్పకూలిపోయాడు వాడు.

ఆ రావణుడి పేరు అబూ ఒసామా. కరడు గట్టిన పాకిస్తానీ ఉగ్రవాది.

ఆ అమ్మాయి పేరు రుక్సానా కౌసర్. జమ్మూ కశ్మీర్ లో నియంత్రణ రేఖకి కేవలం 30 కిమీ దూరంలో రాజౌరీ జిల్లా ఠాణా మండీలోని అప్పర్ కైసీ దగ్గర ఉన్న శాహ్ దరా షరీఫ్ ఆమె ఊరు.

అది విజయదశమి రోజు. దేశం యావత్తూ రుక్సానా ను దుర్గాదేవి అని వేనోళ్ల పొగిడింది. విజయదశమి రోజు చచ్చిన అబూ ఒసామా ఓ ముష్కర మహిషాసురుడు.

రుక్సానా పదోతరగతి చదువుతూ ఆపేసింది. పేదరికం ఆమెను వెన్నాడుతోంది. ఆమె గుజ్జర్ తెగకు చెందిన మహిళ. జమ్మూకశ్మీర్ లో గుజ్జర్, బకర్వాల్ ల వంటి ముస్లింలను వేర్పాటువాదం పేరిట సకల సదుపాయాలను అనుభవిస్తున్న కశ్మీరీ ముస్లింలు పట్టించుకోరు. వారి బాగోగులను చూడరు. అందుకే కటిక పేదరికం గుజ్జర్ కుటుంబాలకు తప్పనిసరి తోడులా వెంట ఉంటుంది. పాకిస్తాన్ నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర ఉన్న ఇళ్లు కాబట్టి ఉగ్రవాదులు యథేచ్ఛగా అర్ధరాత్రి అపరాత్రి తలుపు తట్టుతారు. ఆకలేసింది అన్నం పెట్టమంటారు. అలిసొచ్చాం… ఆయిల్ పెట్టమంటారు. మూడొస్తే ముద్దులూ పెట్టమంటారు. ముస్లిం గుజ్జర్లకు ఉగ్రవాది అంటే భయం లేకపోయినా, వాడి చేతుల్లోని ఏకె 47 అంటే భయం. భయం భయంగా వారిని మెహమాన్ ముజాహిద్ (అతిథి ఉగ్రవాది) అని పిలుస్తారు.


అలా ఒక రాత్రి వచ్చాడు అబూ ఉసామా. అన్నంతిన్నాడు. అమ్మాయి కావాలన్నాడు. తండ్రి నూర్ హుస్సేన్, తల్లి రషీదా బేగమ్, అన్న ఐజాజ్, మేనమామ వకాలత్ హుసేన్, అత్త కుల్సుమ్ పరీ చూస్తూండగానే రుక్సానాను ఎత్తుకెళ్లిపోయాడు. నాలుగైదు రోజుల తరువాత ఇంటికి పంపించేశాడు. అది జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అబూ ఒసామా మళ్లీ వచ్చాడు. తోడుగా ఇంకో ఉగ్రవాది. తలుపు తీయకపోతే పక్కింట్లోని వకాలత్ హుస్సేన్, కుల్సుమ్ పరీలను తుపాకీ చూపి బెదిరించి, తలుపు తట్టించి, తెరిపించారు. అది సెప్టెంబర్ 27, 2009.


రుక్సానా గజగజ వణికిపోయింది. తల్లి దండ్రులు రుక్సానాను మంచం కింద దాచారు. అబూ ఒసామా ఆకలి వేరు. అది అన్నంతో తీరేదికాదు. ఆగ్రహంతో రూర్ హుస్సన్, రషీదా బేగం లను చితకబాదనారంభించాడు. వారి ఆర్తనాదాలతో గది కంపించింది.

రుక్సానా ఉండబట్టలేకపోయింది. మంచం కింద గొడ్డలి కనిపించింది. దాన్ని తీసుకుని బయటకు వచ్చింది. ఏంజరిగిందో అర్థమయ్యేలోగా అబూ ఒసామాపై లంఘించి దాడి చేసింది. నివ్వెరపోయిన వాడు తేరుకునేలోగా వాడి ఏ కె 47ను లాక్కుంది. గుళ్ల వర్షం కురిపించింది. అబూ ఒసామా రక్తం ముద్దై పడి చచ్చాడు. తోడుగా వచ్చిన రెండో ఉగ్రవాది ఒళ్లు జల్లెడలా మారిపోయింది. వాడు కుప్పకూలాడు. తల్లి తండ్రి, మామ అత్త, తమ్ముడు ఐజాజ్ మిగిలిన వారిపై దాడి చేశారు. అంతే వాళ్లు కాలికి బుద్ధి చెప్పి పరుగులు తీశారు. రుక్సానా అంతకుముందు తుపాకీ ముట్టుకోలేదు. ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలియలేదు.

ఈ వార్త వానలా, వరదలా, పెను ఉప్పెనలా వ్యాపించింది. ఊరు ఊరంతా బకాసురుడు చచ్చిన తరువాతి ఏకచక్రపురంలా సంబరాలు చేసుకుంది. రుక్సానా కౌసర్ కు దేశం నీరాజనాలు పట్టింది. ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అధినేత మణీందర్ జీత్ సింగ్ బిట్టా ఆమెకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చారు. దేశంలో వివిధ స్థానాల్లో ఆమెకు సన్మానాలు జరిగాయి. కానీ అప్పటి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు కేవలం అయిదువేలిచ్చి చేతులు దులుపుకుంది.

రుక్సానా ఇప్పుడు వివాహం చేసుకుంది. భర్త కబీర్ హుసేన్ తో కలిసి, రాజౌరీలోనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తోంది.


No comments:

Post a Comment

Pages