- Raka Lokam

ఇప్పుడు వారాన్ని ఎలాగోలా నెట్టుకురానవసరం లేదు. నెట్టుందిగా.... అదే ఇంటర్ నెట్టుందిగా! ఇంటర్ నెట్ తో పిడికిట్లో ప్రపంచం. వేలి కొసలపై విశ్వబ్రహ్మాండం!! రెప్ప వేసి తెరిచే లోగా గిగా బైట్లలో సమాచారం అప్ లోడవుతోంది. పిన్ నుంచి ప్లేన్ దాకా ఊహకందని అన్ని విషయాలపైనా బోలెడంత సమాచారం మౌస్ క్లిక్ చేసినా, స్క్రీన్ ను ట్యాప్ చేసినా దొరుకుతుంది. అయితే వీటిలో కొన్ని టాప్ ఆఫ్ ది చార్ట్ విషయాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల జనం దాన్ని చదువుతారు, లైక్ చేస్తారు. షేర్ చేస్తారు. ట్వీట్ చేస్తారు. రీ ట్వీట్ చేస్తారు. ఇందులో శృంగారం తీపి, వెటకారం వగరు, చిలిపితనపు పులుపు అహంకారం కారం ... ఇలా అన్ని టేస్టులూ ఉంటాయి. ఏ ట్వీట్ ఎందుకు అందర్నీ బీట్ చేసింది? ఏ షేర్ ఫేస్ బుక్ షేర్ మార్కెట్ ను దడదడలాడించింది? ఏ వార్తపై కామెంట్ల కనకవర్షం కురిసింది? ఏ ఫోటో పై ఎన్ని లైకులు వచ్చాయి? ఆన్ లైన్ లో ట్రెండై, అలా గత ఏడు రోజుల్లో వైరల్ అయిపోయిన టాప్ ట్రెండింగ్ పోస్టులేమిటి? వేలి కొసలకు "వైరల్" ఫీవర్ తెప్పించిన బెస్టు బెస్టు పోస్టులేమిటి?


పన్నెండేళ్ల ప్రసవ వేదనః
అయ్యవారి పేరు లెన్నార్ట్ నిల్సన్. ఆయన ఓ పుష్కరకాలం పాటు, అంటే పన్నెండేళ్లుగా, చేస్తున్నది ఒకే ఒక్క పని. ఒక వీర్యకణం, అండానికి ఎలా కన్ను గీటుతుంది. ఆ రెండూ ఎలా లవ్వాడుకుంటాయి. ఆ లవ్వుకి ఫలితంగా అండం నుంచి పిండం ఎలా పుడుతుంది. ఆ పిండం బ్రహాండంగా ఎదిగి ఓ బుడ్డోడు ఎలా తయారవుతాడు - ఇదే ఆ ఫోటోగ్రాఫర్ గారి పరిశోధనాంశం. ఆయన ఓ తల్లి గర్భాన్నే తన ఫోటో స్టుడియోగా మార్చేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపుని ఎండో స్కోపీ ద్వారా ప్రవేశపెట్టి పన్నెండేళ్లుగా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఆ ఫోటోలను నెట్ లో ఎగ్జిబిషన్ పెడితే ఇక చూడండి షేర్లే షేర్లు. లైకులే లైకులు. ఈ మధ్యే ఇండియా టీవీ వెబ్ సైట్లో పెడితే అక్షరాలా 25270 కామెంట్లు. 261987 షేర్లు వచ్చేశాయి. అసలు లెన్నార్ట్ నిల్సన్ గారి వెబ్ సైట్ www.lennartnilsson.com/child_is_born.html ని ఒక సారి విజిట్ చేస్తే గుప్తగ్యాన్ అంతా గుప్పిట్లోకి వచ్చేస్తుంది. సృష్టిమూలం సూక్ష్మచిత్రం మీ కళ్ల ముందుంటుంది. లెన్నార్ట్ ఫోటోగ్రఫీకి తలతిరిగిపోక తప్పదు. తన గర్భాన్ని ఆర్ట్ స్టుడియోగా మార్చిన ఆ అజ్ఞాత అమ్మ ముందు తల వంచక తప్పదు.
(https://www.facebook.com/media/set/?set=a.886241228098838.1073741836.138762029513432&type=3)


ఓ మై గాడెస్!
ఓ మై గాడ్ సినిమా చూశారా? అందులో ఓ ఫ్యాషనబుల్ సన్యాసిని లిప్ స్టిక్ పెదాలతో పరమపదం గురించి చెబుతుంది. అదిగో ... సరిగ్గా అలాంటి సన్యాసినే మన సుఖ్విందర్ కౌర్ ఉరఫ్ రాధే మా! ఆమెను పూజించ దలచుకున్న భక్తుడు ఆమెను ఎత్తుకోవాల్సిందే. ఆలింగనమే ఆమె ఇచ్చే ఆశీర్వాదం. ఆ పని చేస్తున్నప్పుడు ఆమె చేతిలోని త్రిశూలం గుచ్చుకోకుండా జాగ్రత్త పడటం భక్తుల బాధ్యతే. సదరు రాధేమా రహస్య జీవితాన్ని రాహుల్ మహాజన్ బయటపెట్టేశాడు. ఇంతకీ ఈ రాహుల్ మహాజన్ ఎవరనుకుంటున్నారా? కాషాయ బీజేపీనేత ప్రమోద్ మహాజన్ పుత్రుడు. రాధేమా రంగు బయటపెట్టిన మరో వ్యక్తి కూడా పరివార్ వీరుడే. విశ్వహిందూ పరిషత్ నేత సురీందర్ సింగ్ ఆమె ఫోన్ సంభాషణల్ని బయటపెట్టాడు. ఆకలేస్తే అన్నం పెట్టాల్సిన రాధే మా మూడొస్తే ముద్దులు పెట్టేలా ఉన్న ఫోటోలు, దానిపై ట్విట్టర్ లో జోకులు, కేకలు వైరల్ ఫీవర్ లా వ్యాపిస్తున్నాయి.
(http://scroll.in/article/747811/radhe-maa-becomes-the-red-hot-favourite-of-twitter-jokesters)



సత్యం శివం సుందరం
ఈ వారం ఇండియాకి బిగ్గెస్ ట్రెండింగ్ కహానీ ఇదే. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్్ కు అధినేత. హెచ్ సీ ఎల్ కి శివనాడార్ అధినేత. ఇప్పుడు గూగుల్ కి సుందర్ పిచై అధినేత. ముగ్గురూ భారతీయులు. ఈ త్రిమూర్తులకు ముమ్మూర్తులా సత్యం, శివం , సుందరం అన్న పేరు పెట్టేసి, ముగ్గురి ఫోటోల కొల్లాజ్ ను సోషల్ మీడియాకెక్కించేశారు భారతీయులు. కొందరు 'రసజ్ఞులకు' సత్యం శివం సుందరం అనగానే నీటిలో తడిసిన జీనత్ అమన్ గుర్తుకొచ్చినా, ఇండియా ఐటీ ప్రపంచాన్ని ఏలేస్తోందని ఆనంద పడిపోయారు. సత్యం, శివం సుందరం ఈ వారం భారతీయులకు ఎంతో ఆనందాన్నిచ్చారు. కలాం విదేశాలకు వెళ్లనందుకు అభినందించిన వారే సుందర్ పిచై విదేశాలకు వెళ్లినందుకు అభినందిస్తున్నారని కూడా ఒకరిద్దరు కామెంట్ చేశారు.


మురికి వాడల ముత్యం
ముంబాయి మురికివాడల్లో ఉండే ఓ పదిహేనేళ్ల అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఇంత చిన్న వయసులో పెళ్లేమిటి అని పోరాడింది. తల్లిదండ్రులు "దండం దశగుణం భవేత్" అని లాఠీకి పని చెప్పారు. "ఇలా అయితే ఇంట్లోంచి పారిపోతాను. పోలీసులకు అన్నీ చెప్పేస్తా"నని బెదిరించింది. తల్లిదండ్రులు ఆమెను ముంబాయి నుంచి బీహార్ కి తీసుకెళ్లి ఇద్దరు పిల్లల తండ్రికి రెండో పెళ్లాంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగానే పోరాడింది. ఆఖరికి హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్వచ్ఛంద సంస్థ ఆ అమ్మాయికి తోడు నిలిచింది. ఈ అమ్మాయి కథ ఇప్పుడు ఇంటర్ నెట్ ని ఏలుతోంది. 62575 లైక్ లు, 1365 కామెంట్లు, 4846 షేర్లు ఈ అమ్మాయి కథను ఇంటర్ నెట్ ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాయి. ఆమె కి నెట్ జగత్తు బాసటగా నిలిచింది.
http://khabar.ndtv.com/news/zara-hatke/this-mumbai-woman-refused-to-marry-at-15-her-storys-gone-viral-1206901



ఫోటోషాప్ అందాలు!!
అందానికినిజమైన నిర్వచనం ఏమిటి? బ్యూటీ అంటే ప్రపంచంలో ఎవడి కొలతలు వాడివే. ఒక్కో కల్చర్ వీ ఒక్కో లెక్క. ప్రతి లెక్కకీ ఓ తిక్కుంటుంది. అదేమిటో కనుక్కోవాలని ఎస్తర్ హోనిగ్ అనే బొద్దుగుమ్మ బయలుదేరింది. ప్రపంచంలోని వివిధ దేశాలకీ తన ఫోటో పంపించి, వారి వారి సాంస్కృతిక నేపథ్యం ప్రకారం అందగత్తె ఎలా ఉండాలో ఫోటోషాప్ చేయమంది. ఆ ఫోటోషాప్ చిత్రాలు చూస్తే ఆమె కళ్లు తిరిగిపోయాయి. ఆ వివరాలేమిటో http://www.buzzfeed.com/lorynbrantz/perceptions-of-perfection-across-borders#.lpBRwGv7l ని క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. ఈ పోస్టును ఇప్పటికే 2272569 మంది షేర్ చేశారు.

వెక్కిరింతలు వేయి రకాలు!
ఎదుటి మనిషికి కోపం తెప్పించాలంటే ఏం చేయాలి? వెక్కిరించాలి. వెవ్వెవ్వె అనాలి. అంతే కోపం తన్నుకువచ్చేస్తుంది. అలా కోపం తెప్పించే 26 వెక్కిరింత పద్ధతులను ఒకే చోట మన సౌకర్యం కోసం పోగు చేశారు రచయిత అంకుశ బహుగుణ. మెన్ ఎక్స్ పీ లోని ఈ కథనం పట్టుమని పది రోజుల్లో పేస్ బుక్ లో 15 వేలు, ట్విట్టర్ లో 13 వేలు, గూగుల్ హాంగౌట్ లో దాదాపు మూడు వేల మంది షేర్ చేశారు. ఈ షేర్ ఖాన్ ను మీరూ చూడాలంటే http://www.mensxp.com/special-features/today/27099-26-most-hilarious-ways-to-insult-someone.htmlని క్లిక్ చేయండి.


రాహుల్ గాంధీ ప్రసంగ పాఠం!!
రాహుల్ గాంధీ ని ఆటపట్టించే వారు ట్విట్టర్ లో కోకొల్లలు. ఒక వ్యక్తి మాటలను వేళాకోళం చేసి, వెటకారం చేసే ప్రక్రియలను ట్విట్టర్ భాషలో ట్రోలింగ్ అంటారు. ఈ మధ్య ఆయన లోకసభలో లలిత్ గేట్ పై మాట్లాడినప్పుడు ఆయన ప్రసంగం నోట్స్ ను ఓ కొంటె ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. ఆయన హిందీ ప్రసంగాన్ని ఇంగ్లీషు లిపిలో రాసుకున్నారు. అమ్మ సోనియా కూడా ఇదే చేసేది. దాంతో ఆ ఫోటో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇది పెద్ద వార్త కాకపోయినా, సోషల్ మీడియాకి మాత్రం సంచలనమే. చారానా వార్తకు, బారానా కామెంట్లు, ట్రోల్స్, వ్యంగ్యాలు గుప్పించి మంచి స్పైసీ టాపిక్ ను తయారు చేశారు. ఇవన్నీ పప్పు ది డఫర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ టాపిక్ గా చెలామణీ అయ్యాయి.
#pappu the duffer


నగ్న సత్యం
సోషల్ మీడియా గురించి చెబితే ఒక మహిళా మణి గురించి మాత్రం తప్పక చెప్పాలి. ఆమె కిమ్ కర్దషియాన్. ఆమె సోషల్ మీడియా సామ్రాజ్ఞి. ప్రతి రోజూ పతాకశీర్షికలో ఉండటం ఎలాగో తెలిసిన వ్యక్తి. ఈ మధ్య తాను గర్భవతినని ఆమె పోస్టు చేశారు. అయితే ఆమెది ఫేక్ ప్రెగ్నన్సీ అని కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. నిజమేమిటో చెబుతాను చూడండి అని ప్రతి సవాలు విసిరింది. ఆమె ఏదో మెడికల్ రిపోర్టులు నెట్ లో పెడుతుందనుకున్నారు. కానీ కిమ్ తనదైన శైలిలో నగ్నంగా ఫోటోదిగి దాన్ని సోషల్ మీడియా సైట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. చూసుకొండెహె అని సవాలు విసిరింది. ఈ నగ్నసత్యం తో కిమ్మమ్మ అందరినీ కిమ్మనకుండా చేసేసింది. http://www.foodworldnews.com/articles/31757/20150812/kim-kardashian-instagram-kanye-west-s-wife-defends-pregnant-belly-pic-amid-fda-controversy-%E2%80%93-naya-rivera-copycats-photos.htm


published in Sakshi daily on August 17, 2015

2 comments:

Pages