శోభా సింగ్ కి భగత్సింగ్ అవార్డు వస్తుందా? - Raka Lokam

శోభా సింగ్ కి భగత్సింగ్ అవార్డు వస్తుందా?

Share This



అనగనగా ఓ షాదీ లాల్. ఓ శోభా సింగ్. స్వాతంత్ర్యోద్యమంలో వీళ్లది ఓ విలక్షణ పాత్ర! వీళ్లు ఉద్యమాలు చేయలేదు. పోరాటాలు చేయలేదు.
వీళ్లు చేసిందల్లా ఒక్కటే.


స్వాతంత్ర్య సమరయోధులు భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. వీళ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్లులుగా వ్యవహరించారు. వీళ్ల సాక్ష్యం వల్లే భగత్సింగ్, రాజగురు, సుఖదేవ్ లు ఉరి కంబం ఎక్కారు.

అప్పట్లో వీళ్లపై ఎంత జనాగ్రహం ఉండేదంటే షాదీలాల్ చనిపోతే ఆయన సొంత గ్రామంలో శవంపై కప్పే గుడ్డను అమ్మడానికి సైతం వ్యాపారులు ఇష్టపడలేదు. ఇరుగు పొరుగు గ్రామాల వ్యాపారులూ సిద్ధం కాలేదు. దాంతో ఆయన కుమారులు ఢిల్లీకి వచ్చి దాన్ని కొనుక్కువెళ్లాల్సి వచ్చింది. షాదీలాల్ కి నలుగురైదుగురు బిడ్డలుండేవారు కాబట్టి శవాన్ని మోసేందుకు ఎవరూ రాకపోయినా వాళ్లే ఎలాగోలా కాటికి తీసుకెళ్లారు.

షాదీ లాల్, శోభాసింగ్ లు చరిత్రలో అనామకులుగా నిలిచిపోయారు అనుకుంటున్నారా? ఆగండాగండి. కథలో అక్కడే ట్విస్టుంది. బతుకు బ్రహ్మపుత్ర లాంటిది. ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పలేం. కాలం మారుతుంది. మరుపును తెస్తుంది.

షాదీలాల్ అనామకుడిగా చచ్చినా, బ్రిటిషర్లు ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ లో ఆయనకు ఒక షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చారు. షామ్లీలో ఒక ఫ్యాక్టరీ, ఒక డిస్టిలరీ ఇచ్చారు. ఆయన సంతానం వాటిని నడుపుకున్నారు. రూపాయికి పాపాయిలు పుట్టించారు. పాపాయిల్ని పెంచి పెద్ద చేశారు. వాళ్లూ వాళ్ల బిజినెస్సు గుల్జారుగా ఉన్నాయి.


శోభా సింగ్ కథ మరింత విచిత్రం.

ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. 1978 వరకూ బ్రతికారు. ఆయన కుమారుడు జర్నలిస్టు అయ్యాడు. ఆయన పేరు కుశ్వంత్ సింగ్. సదరు కుశ్వంత్ సింగ్ తన రచనలతో నెహ్రూ కుటుంబానికి చేరువయ్యాడు. ఆయన జీవిత చరిత్ర వ్రాసుకున్నాడు. అందులో తండ్రిని స్వాతంత్ర్య సమర యోధుడిగా కీర్తించాడు. శోభాసింగ్ స్మారక ప్రసంగాలు ఏర్పాటు చేశాడు. లబ్ధ ప్రతిష్ఠులు ఎందరో దానిలో పాల్గొన్నారు. భగత్సింగ్ కి ఏడాది కోసారి కూడా దండ వేయని చాలా మంది రాజకీయులు ప్రతి ఏడాదీ తప్పనిసరిగా శోభా సింగ్ కు దండేసి, గర్వంగా ఫోటోలు దిగారు. ఆఖరికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని విండ్సర్ ప్యాలెస్ కి సర్ శోభా సింగ్ రోడ్ పేరు పెట్టమని స్వయంగా సిఫార్సు చేశారు. అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఏదో ఒక రోజు సర్ శోభా సింగ్ పేరిట భవనం పేరు మారిపోతుంది.

భగత్ సింగ్ తల్లి విద్యావతి అనామకురాలిగా బతికింది. పేదరికంలో మగ్గింది. ఆయన వారసులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. షాదీ లాల్ గురించి మనకు ఇప్పుడు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ శోభాసింగ్ కి ఏ దో ఒక రోజు భగత్సింగ్ పురస్కారం తప్పక లభిస్తుందన్న నమ్మకం నాకుంది.


రామచంద్ర కహగయే సియా సే
ఐసా కలియుగ్ ఆయేగా
హంస చునేగా దానా తిన్ కా
కవ్వా మోతీ ఖాయేగా

(కలియుగంలో హంస గడ్డీ గాదం తింటుంది. కాకులు ముత్యాలు మెక్కుతాయి. ఈ సంగతి సీతమ్మవారికి రాముడు అప్పుడే చెప్పాడు)


3 comments:

  1. Thank you Sudhakar garu for posting good information

    ReplyDelete
  2. Sudhakerji you brought to our notice how disgracefull episodes happen when we forget to remember and register the sacrifices of greatmen in an appropriate way.You have a good insight into the details.Wish we all learn out of it.Dhanyavad for posting such informatiaon.
    Shekar sangh

    ReplyDelete

Pages