మొక్క వచ్చి చెట్టును వెక్కిరించింది!! - Raka Lokam

మొక్క వచ్చి చెట్టును వెక్కిరించింది!!

Share This



వానలు మొదలయ్యాయి. నేలలో చిన్న విత్తనం నీరు తగలగానే మేల్కొంది. మొలకెత్తింది. మొలకెత్తడం ఏమిటి... చరచరా పాకింది. బిరబిరా ఎదిగింది. తీగ పచ్చని ఆకులతో పరపరా అల్లుకుపోయింది.
వారం పది రోజుల్లో చెట్టు చుట్టూ తీగ పెనవేసుకుపోయింది. చెట్టు కనిపించనంతగా కమ్ముకుపోయింది.
కాండం కనిపించడం లేదు. కొమ్మలు కనిపించడం లేదు.
తీగ ఎదుగుతూనే ఉంది.
తీగ గర్వంగా చెట్టుతో అంది. "నువ్వూ ఉన్నావు. ఎందుకు? నన్ను చూడు ఎలా ఎదుగుతున్నానో. క్షణాల్లో అలా అలా అల్లుకుపోయాను."
చెట్టు మాట్లాడలేదు.
తీగ మరింత గర్వంగా "ఎదగడం అంటే ఏమిటో నన్నుచూసి నేర్చుకో." అంది.
చెట్టు మాట్లాడలేదు.


తీగ అహంకారం పెరిగిపోయింది. అది అవాకులు చెవాకుల రూపంలో బయటకి వచ్చింది. అట్టహాసాలు, వికటాట్టహాసాల రూపంలో వినిపించింది.
చెట్టు మాట్లాడలేదు.
వానలు ఆగిపోయాయి. నేలలో తేమ ఆవిరైపోయింది. తీగ వేళ్లకు లోతు లేదు. నీరందడం లేదు. ఆకులకు ఆశచచ్చింది. ఊపిరందడం లేదు.
ఆకులు రాలిపోయాయి.
తీగ రెండ్రోజుల్లో ఎండిపోయింది.
కళకళలాడిన తీగ ఆఖరి శ్వాసలతో విలవిలలాడసాగింది.

"ప్రతి జూన్ జులైలో ఎలా వానలు పడగానే తీగలు ఎదుగుతాయి. అక్టోబర్ నవంబర్ వచ్చే సరికి అవి ఎండిపోతాయి. రెండొందల యాభై ఏళ్లుగా ఇదే చూస్తున్నాను. వేళ్లకు లోతు ఉండదు. కాండానికి బలం ఉండదు. కొద్ది గంటల పాటు నీరు లేకుండా బతక లేవు. కాసింత ఎండకు తాళలేవు. పుబ్బలో పుట్టి మఖలో చచ్చిపోతాయి. అయినా ఇంత మిడిసిపాటు ఎందుకో." అనుకుంది ఆ చెట్టు జాలిగా.....



No comments:

Post a Comment

Pages