అపరాధ పరిశోధన - Raka Lokam

అపరాధ పరిశోధన

Share This

ష్ముయెల్ జైగీల్ బోమ్ చిన్నప్పుడు అందర్లాగానే మామూలుగా పెరిగాడు.
ఆడుకున్నాడు... పాడుకున్నాడు... అల్లరి చేశాడు... పరుగులు తీశాడు.....
తాతయ్యలు గారాబం చేశారు....
అక్కయ్యలు ఎత్తుకుని తిప్పారు....
అమ్మ గోరుముద్దలు తినిపించింది....
నాన్న మిఠాయీలు కొని తెచ్చేవాడు...

యువకుడయ్యేసరికి సమస్యలు మొదలయ్యాయి.
అతను పెరిగిన పోలండ్ లోని వార్సా పట్టణం మారిపోయింది.
భవనాలు, రోడ్లు మారలేదు... మనుషులు మారిపోయారు....
ఆకాశం మారలేదు... ఆకాశంపై రెండో ప్రపంచ యుద్ధమేఘాలు అలుముకున్నాయి.
యూదు గా పుట్టినందుకు వార్సా ఇంట్లోంచి ఘెట్టోకి తరలింపబడ్డాడు....తోటి యూదులందరితో పాటు....
అది 1940.

ఘెట్టోలో కొరడాదెబ్బలు... కరెంటు షాకులు.... రేప్ లు... కాల్పులు... నిత్యకృత్యమయ్యాయి. ఒక్కొక్కరూ యూదులైన పాపానికి పిట్టల్లా రాలిపోతున్నారు. హిట్లర్ సేనలు ఇక చంపలేక అలసిపోతే అంటువ్యాధులు, మహమ్మారులు డ్యూటీ ఎక్కేవి.....
చావు... చావు... చావు....
ఎటుచూసినా చావులే....


చావుల్ని చూసినకొద్దీ జైగీల్ బోమ్ లో బతకాలన్న పట్టుదల పెరిగింది.
బతకాలి... పారిపోవాలి...
తన కోసం కాదు.... తన వాళ్లు చావకుండా కాపాడటం కోసం...
హిట్లర్ యమదూతలే కాదు... ఈ ప్రపంచంలో ఎందరో మంచివాళ్లున్నారు... వాళ్లకి ఈ అమానుషం గురించి తెలియదు... వాళ్లందరికీ వార్సా ఘెట్టో నరకయాతనల గురించి చెప్పాలి. వాళ్లని మేల్కొలపాలి. యూదు జాతిని కాపాడేందుకు వాళ్లందరి మద్దతునూ కోరాలి....


చివరికి 1941 లో ఎలాగోలా వార్సా ఘెట్టో నుంచి జైగీల్ బోమ్ పారిపోయాడు. యూదువ్యతిరేకుల నరకయాతనకి శరీరం అప్పటికే అస్థిపంజరమైపోయింది. కానీ ఆశ అతడిని బతికించింది. యూరప్, ఇంగ్లండ్, అమెరికా ప్రజలకు నిజం చెప్పాలి. వాళ్లకు నరమేథం తాలూకు నిజం తెలియాలి... ఇదే అతని ఆశ... ధ్యాస....

జైగీల్ బోమ్ అమెరికాకి వెళ్లాడు... అమెరికన్లకు చెప్పాడు.
ఇంగ్లండ్ వెళ్లాడు... ఇంగ్లీషు ప్రజలకు చెప్పాడు...
దేశదేశాల సర్కార్లకు చెప్పాడు. దేశాధినేతలకు టెలిగ్రామ్ లు పంపించాడు.
కానీ "మంచి" వాళ్లు మాటలు విన్నారు. ఊరుకున్నారు. టెలిగ్రామ్ లు చదివారు... చెత్తబుట్టలో పారేశారు.
రాయబార కార్యాలయాల తలుపుతట్టాడు. వాళ్లు మాటలన్నీ విని, కప్పుడు కాఫీ ఇచ్చి పంపించేశారు.
జైగీల్ బోమ్ పట్టువీడలేదు. అయిదు వేల నుంచి అయిదుగురి వరకూ సభికులెంతమంది అన్న దానితో సంబంధం లేకుండా ప్రతిరోజూ సభలు నిర్వహించేవాడు. సమావేశాలను సంబోధించేవాడు.
అందరూ విన్నారు.
అయ్యోపాపం అన్నారు.
సానుభూతి కట్టలు దాటిపొంగింది.
సహాయం మాత్రం నాలుక చివరే ఆగిపోయింది.

మే 12, 1943.
జైగీల్ బోమ్ కి అర్థమైపోయింది. మంచివాళ్లు మరీ "మంచి"వాళ్లని...
"ప్చ్ .... ప్చ్ ...."లు తప్ప వాళ్ల దగ్గర ఇంకేమీ లేదని.
ఒకప్పుడు చావుల్ని చూసీ చూసి బతకాలన్న పట్టుదల పెరిగింది.
ఇప్పుడు మంచివాళ్ల "మంచిదనపు" బతుకుని చూసీ చూసీ చావాలన్న పట్టుదల పెరిగింది.

అందుకే జైగీల్ బోమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. "స్వేచ్ఛా ప్రపంచపు నిష్క్రియత" ను నిరసిస్తూ లేఖను వ్రాసిపెట్టి ఆఖరి ఊపిరితో ఛీత్కరించి, చీదరించి మరీ వెళ్లిపోయాడు. ఆ లేఖ యూదు పోరాట చరిత్రలో అమర సాహిత్యమై నిలిచిపోయింది.
ఇప్పటికీ వార్సాలో జైగీల్ బామ్ స్మృతి చిహ్నం ఉంది.
వేదిక ముక్కముక్కలుగా ఉంటుంది.....
పగిలిన జైగీల్ బామ్ గుండెలా....


విషాదం ఏమిటంటే క్రూరాతిక్రూరమైన నాజీల చేతల వల్ల జైగీల్ బామ్ చనిపోలేదు.
మంచాతిమంచివాళ్ల చేతగానితనం వల్ల చనిపోయాడు.

No comments:

Post a Comment

Pages