పాకిస్తాన్ లో అలెగ్జాండర్ మునిమునిముని మనవళ్లు - Raka Lokam
demo-image

పాకిస్తాన్ లో అలెగ్జాండర్ మునిమునిముని మనవళ్లు

Share This

1220 లో ఒక భయంకరమైన యుద్ధంలో వాళ్లు ఓడిపోయారు.
రాజు బాల్ సింగ్ చనిపోయాడు.
ప్రజలు కకావికలైపోయారు.
విజేతలు విచ్చలవిడిగా దోచుకున్నారు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు. తమ సంస్కృతి, జీవన విధానం వదులుకోవాల్సి వచ్చింది. విజేతల సంస్కృతిని అయిష్టంగానైనా ఆలింగనం చేసుకోవాల్సి వచ్చింది. అందమైన ఆ లోయలోకి నరకం దిగొచ్చినట్టయింది.
"ఇక్కడ ఇక బతకలేం" అనుకున్నారు వాళ్లు.... అందుకే కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి చిత్రాల్ కొండలోయల్లోని బ్రిర్, బుంబురెట్, రామ్ బుర్ ప్రాంతాలకు పారిపోయాయి. సముద్రమట్టానికి దాదాపు ఏడున్నర వేల అడుగుల ఎత్తున్న కొండలోయ ముడుతల్లో దాగుండిపోయారు. మళ్లీ బయటకి రాలేదు.
బయట ప్రపంచం మారుతూ వచ్చింది. పాలకులు మారుతూ వచ్చారు. రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి, వాళ్లున్న ప్రాంతం పాకిస్తాన్ లో భాగమైపోయింది. వాళ్లకు ఇవేవీ తెలియవు. కానీ తమ సంస్కృతిని, తమదైన జీవనవిధానాన్ని మాత్రం ఎలాంటి మార్పూ లేకుండా కాపాడుకోగలిగారు. తమ దేవుళ్లని తమదైన శైలిలో పూజించుకోగలిగారు. ప్రపంచం ఇరవైయ్యవ శతాబ్దంలోకి వచ్చినా తాము మాత్రం ఎలాంటి చీకూ చింతా లేకుండా హాయిగా పదమూడో శతాబ్దంలోనే బతకగలిగారు.
1970లో మళ్లీ వాళ్లు బాహ్యప్రపంచం స్పర్శలోకి వచ్చారు.

kalash_stort


నల్లని దుస్తులు.....
మెడలో అందమైన పూసల మాలలు....
నుదుట బొట్టు ......
చేతులకు బోలెడన్ని గాజులు.....
తలపై టోపీ .....
కేశరాశికి కళ్లు మిరుమిట్లు గొలిపే పూసల అలంకారం....
సహజీవనాన్ని ప్రతిఫలించే సామూహిక నృత్యాలు ......
కలిసి చేసుకునే పండగలు......
పాటలన్నీ, వేణుగానమన్నా, డోలు దరువన్నా పడిచచ్చే స్వభావం....
ఇలా ఆటపాటలతో బతుకు గడిపేసే తత్వం ఉన్న ఆ పదమూడో శతాబ్దపు పరమ అమాయకత్వం ఇరవైయ్యవ శతాబ్దపు మతమౌఢ్య పాకిస్తాన్ పరిష్వంగంలోకి వచ్చింది.

వాయవ్య పాకిస్తాన్ లోని చిత్రాల్ ప్రాంతంలో జీవించే ఈ జాతిని కాఫిర్ కాలాశ్ అంటారు. కాలాశ్ అంటే నల్లని దుస్తులు వేసుకునే వారు అని అర్థం. మొత్తం లెక్కపెడితే వీళ్లు మూడువేల మందికి మించరు. కాలాశ్ తెగ చెక్క, కొయ్య దుంగలతో చేసుకున్న రెండంతస్తుల ఇళ్లలో కొండలోయల్లో నివసిస్తారు. పై అంతస్తులో ఒకే పెద్ద గది ఉంటుంది. అందులోనే వంటా వార్పూ, నివాసమూ ఉంటాయి. కింది అంతస్తులో ధాన్యం గోదాము, పశువుల కొట్టం ఉంటాయి. వీరి పండుగలు ప్రకృతి మార్పులతో ముడిపడి ఉంటాయి. వసంత కాలంలో చిలింజుష్త్ అనే పండుగను, సెప్టెంబర్ నెలలో ఫూల్ అనే పండుగను, డిసెంబర్ నెలలో చోవాస్ అనే పండగను జరుపుకుంటారు. ప్రతి పండుగలోనూ ఊరి పెద్దలు ఆది కాలం నుంచి ఇప్పటివరకూ కలాశ్ జాతి చరిత్రను గానం చేసి చెబుతారు. ఈ రకంగానే కాలాశ్ ల కుల చరిత్ర ఒక తరం నుంచి మరో తరంలోకి ఎనిమిది వందల ఏళ్లుగా వేదంలా ప్రవహిస్తూ వస్తోంది.

kalash-children



చిత్రాల్ లోయ హిందూకుశ్ పర్వతమాలికల్లో ఉంటుంది. ఉత్తర, దక్షిణ, పశ్చిమాల్లో అఫ్గనిస్తాన్ చిత్రాల్ లోయను అదుముకుని ఉంటుంది. వఖాన్ కారిడార్ అనే చిన్న భూభాగం చిత్రాల్ ను రష్యా నుంచి, హుంజా ప్రాంతం చైనా నుంచి వేరుగా ఉంచుతాయి. ఈ హిందూకుశ్ పర్వతసానుల నుంచే క్రీస్తుపూర్వం 387 లో మహాయోధుడు అలెగ్జాండర్ తన సేనావాహినులతో సహా మన దేశానికి వచ్చాడు. ఈ కొండలోయలు ఒకప్పుడు అలెగ్జాండర్ పదఘట్టనలతో ప్రతిధ్వనించాయి. పురుషోత్తముడితో యుద్ధం చేసి, తిరిగి వెళ్తూండగా అలసిపోయిన కొందరు గ్రీకు సైనికులు కొందరు ఇక్కడే ఉండిపోయారు. వారు స్థానిక మహిళలను వివాహం చేసుకున్నారు. ఇక్కడి సంస్కృతితో మమేకమైపోయారు. ఇక్కడి వారైపోయారు. వారి సంతతే కాలాశ్ లు. గ్రీకుశిల్పం లాంటి అందం, గ్రీకువారి నీలికళ్లు ఇప్పటికీ కాలాశ్ ల గతానికి నిదర్శనాలుగా నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు గ్రీస్ కాలాశ్ ల భాషకు లిపిని తయారు చేయడంలో, వారిని ఆన్ లైన్ డిక్షనరీ తయారుచేయడంలో, వారి సంస్కృతిని కాపాడటంలో నిమగ్నమైంది. కొందరు గ్రీక్ శాస్త్రవేత్తలు కాలాశ్ తెగ ప్రజలతో కలిసి జీవించి, వారిపై అధ్యయనాలు చేస్తున్నారు కూడా.

ఇప్పుడు కాలాశ్ లు పాకిస్తానీ టూరిజంకి మ్యూజియం పీసులు. వాళ్లను, వారి నాట్యాలను, జీవన శైలిని మార్కెట్ చేసుకుని విదేశీ టూరిస్టులకు పాకిస్తాన్ గాలం వేస్తోంది. చిత్రాల్ లోయ చిత్రాలను చూసేందుకు రమ్మని ఊరిస్తోంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ను ఏలుతున్న తాలిబానీ మతమౌఢ్యం కాలాశ్ ల పాలిటి కాళరాత్రిగా మారింది.

మధ్యయుగపు మహోన్మాద యుద్ధాలను, మన యుగపు మతోన్మాద యత్నాలను గడ్డిపరకల్లా తలొంచుకుని భరించి, తమ ఉనికిని, జీవన శైలిని కాపాడుకున్న చిట్టి తెగ కాలాశ్......
హిందూకుశ్ పర్వతసానువుల్లో ప్రళయ పర్జన్యంలా శతాబ్దాలు సాగిన దాడులను తట్టుకుని మరీ తమవైన విశ్వాసాలను నిలబెట్టుకున్న బుల్లి జాతి కాలాశ్.......
ప్రపంచమనే అందమైన పూదోటలో గరికపూల అందం గరికపూలదే. వైవిధ్యమే ఈ జగత్తుకు నుదుటి బొట్టు, పాపిట సింధూరం. జీవ వైవిధ్యాన్ని, భావవైవిధ్యాన్ని కాపాడగలగడమే మానవాళి పరిణితిని నిదర్శనం. గరికపూవుల్లాంటి కాలాశ్ తెగ మనుగడ కొనసాగేలా చూడటం వైవిధ్యాన్ని కోరుకునే విశ్వమానవులందరి బాధ్యత... ఏమంటారు?

kalash7
Comment Using!!

6 comments:

  1. blogger_logo_round_35

    Awesome Story......!! I dont know how you got this story but its really worth to read it and its really interesting Sir.

    Keep posting this kind of posts.

    ReplyDelete
  2. blogger_logo_round_35

    There is a blog called Pakistani Hindu Post... Do read it ... you'll get info about Hindus in Pakistan.

    ReplyDelete
  3. Avadhani

    Sudhakar garu, the perspectives you have is excellent

    ReplyDelete
  4. blogger_logo_round_35

    Really a worth readig information. Nerrated in a gr8 way.

    ReplyDelete
  5. bapuji.kss

    Dear Rakaji,

    Excellent Story...

    Bapujee

    ReplyDelete
  6. blogger_logo_round_35

    ఇది అద్భుతమైన కధనం. సనాతనమైన భారత సాంస్కృతిక మూలాల్లో మిగిలిన ఒక అందమైన శాఖ ఆ తెగ. చదువుతుంటే మనసు పులకాంకిత మౌతోంది.
    శ్రీ రామచంద్ర మూర్తి, పొన్నపల్లి.

    ReplyDelete

Pages