"ఆవంచ గణపతిం భజే" - Raka Lokam

"ఆవంచ గణపతిం భజే"

Share This

చుట్టూ పొలాలు.... పత్తి, జొన్న కోతలు పూర్తై బోసిపోయి ఉన్నాయి.
ఊరికి దూరంగా ....ఒక పెద్ద బండరాయి...
దాదాపు ఇరవై అయిదు అడుగుల ఎత్తు....
ఇరవైమూడు అడుగుల వెడల్పు....
కాస్త దగ్గరగా వెళితే....
అది బండరాయి కాదు.... ఏదో విగ్రహం.... రెండు పెద్దపెద్ద కళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంకాస్త దగ్గరకు వెళ్తే ....తొండం, రెండు దంతాలు... ఒకటి విరిగిపోయిన దంతం...బాన పొట్ట... పొట్టకు నాగబంధం.... ఒక చేతిలో మోదకం....
సందేహం లేదు... గణేశుడే....


దగ్గరకు వెళ్లి చూస్తే మిగిలిన కొద్దిపాటి సందేహమూ పటాపంచలైపోతుంది.
ఇంత పెద్ద రాతి గణేశుడా?
ఒంటరిగా... పొలాల మధ్య పడున్నాడా?
గుడి లేదు... దీపం లేదు... పూజ లేదు.... ఏమిటీ విచిత్రం....?
మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామ శివార్లలో పొలాల మధ్య ఒంటరిగా కొలువై ఉన్నాడు ఆ గణేశుడు. ఆవంచ గ్రామస్తులంతా ఆ గణేశుడిని గుండు గణేశుడంటారు. కానీ ఎవరూ వచ్చి దీపం వెలిగించరు. ఏడాదికోసారి వినాయకచవితి రోజు మాత్రం కొబ్బరికాయలు పగలగొట్టి గణేశ్ జీ జై చెప్పి వెళ్లిపోతారు. ఆ ఊరి ఎంపీటీసీ పార్వతమ్మ ఎన్నికల ప్రచారం ఈ గుండు గణేశుడి ముందు కొబ్బరికాయ కొట్టే మొదలుపెట్టిందిట. ఆమె గెలిచింది. గణేశుడు మాత్రం సగటు భారతీయ ఓటరులా ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు.
ఇది పార్వతమ్మ తప్పో, ఆవంచ గ్రామస్తుల తప్పోకాదు.... ఆ గణేశుడు క్రీ.శ 1140 నుంచి ఆలాగే పొలాల మధ్య నిలుచున్నాడు.
పశ్చిమచాళుక్యుల పదవుల కొట్లాట పుణ్యమా అని అలాగే ఉండిపోయాడు. ఈ రోజు గుల్బర్గా అని మనం పిలుచుకునే కాల్బుర్గికి పదకొండో శతాబ్దంలో పశ్చిమ చాళుక్య ప్రభువు విక్రమాదిత్యుడు రాజుగా ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సోమేశ్వరుడు. రెండో వాడు తైలాపుడు. విక్రమాదిత్యుడు తైలాపుడిని తెలగాణ్యం (నేటి తెలంగాణ) పాలకుడిగా పంపించాడు. తైలాపుడు కందూరు రాజధానిగా పాలించేవాడు. ఆ తరువాత క్రీ.శ 1113 లో తన రాజధానిని ఆవంచకు మార్చుకున్నాడు.
బాదామి చాళుక్యుల రాజధాని వాతాపిలో 30 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పూ ఉన్న రాతి గణేశ విగ్రహం ఉండేది. ఆ గణేశుడిని తలచుకునే శ్యామశాస్త్రి "వాతాపి గణపతిం భజే" అని కీర్తన వ్రాశాడు. అలాంటి ఏకశిలా గణేశుడిని తయారు చేయాలని తైలాపుడు సంకల్పించాడు.


శిల్పులు పని మొదలుపెట్టారు. గణేశుడు దాదాపు తయారయ్యాడు. అది 1140.
అదే ఏడాది విక్రమాదిత్యుడు చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు తైలాపుడు తరలివెళ్లాడు.
అంత్యక్రియల్లోనే రాచపదవి కోసం సోమేశ్వరుడూ, తైలాపుడూ కత్తులు దూసుకున్నారు. పదవిపోరు చాలా కాలమే సాగింది. అంతటా అరాచకం ప్రబలింది. అస్థిరత్వం రాజ్యమేలింది.
ఆ తరువాత కొద్ది కాలానికే మాలిక్ కాఫుర్, ఖిల్జీ, తుగ్లక్కులు దక్షిణాదిపై దండయాత్రలు చేశారు.
రాజులు పోయారు.
నవాబులు వచ్చారు.
శతాబ్దాలు గడిచిపోయాయి.
ఆవంచ రాజధాని నుంచి కుగ్రామమైపోయింది. చరిత్ర ఆనవాళ్లు క్రమేపీ కనుమరుగైపోయాయి. రాజాస్థానాలు పొలాలయ్యాయి. ఆవంచ తైలాపుడి రాచ పట్టణం నుంచి పాలమూరు లేబర్ క్యాంపుగా మారింది.
శతాబ్దాలుగా గుండుగణేశుడు పొలంలో అలాగే పడున్నాడు.
ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు టీవీల పుణ్యమా అని గుండుగణేశుడు వార్తల్లోకి వచ్చాడు.


ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు వచ్చారు. వెళ్లారు.... కంచి నుంచి ఆగమ పండితులూ వచ్చారు. వెళ్లారు.
అతిపెద్ద గణేశుడి విగ్రహం చెక్కించాలన్న తైలాపుడి అహంకారం ఆవిరైపోయింది. అతిపెద్ద గణేశుడిని పూజించాలన్న ప్రజల మమకారం గెలుస్తుందా?
రాజు తైలాపుడి తప్పిదాన్ని 900 ఏళ్ల తరువాత ప్రజలు ఇప్పటికైనా సరిదిద్దుతారా?
తన గతాన్ని తాను మరిచిపోయిన ఆవంచ ఆత్మవిస్మృతి పొరలను ఎప్పటికైనా తొలగించుకుంటుందా?
అందరి విఘ్నాలనూ తొలగించే గణేశుడికే పట్టిన విఘ్నాలను ఇప్పటికైనా తొలగించగలుగుతామా?
ఇంత పెద్ద గణేశుడికి అంత పెద్ద గుడి ఇప్పటికైనా కట్టుకోగలుగుతామా?
"వాతాపి గణపతిం భజే" లా మనం "ఆవంచ గణపతిం భజే" అని ఎప్పటికైనా పాడుకోగలుగుతామా?

1 comment:

Pages