ఒక యుద్ధం.... ఒక ఎడబాటు.... ఒక గుడి.... - Raka Lokam

ఒక యుద్ధం.... ఒక ఎడబాటు.... ఒక గుడి....

Share This


ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది....
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు... ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు....
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె....
"మార్టిన్.... ఐ మిస్ యూ మార్టిన్.... ఐ మిస్ యూ సో మచ్ డియర్"
కళ్లల్లో నీళ్లు తిరిగాయి....కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది....

సాయంత్రం....
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు...
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది....
వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది....

ఉన్నట్టుండి......
గణ గణ గణ గణ .....
గణ గణ గణ గణ......
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది....
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె....
దూరంగా ఒక శిధిల దేవాలయం.... అందులోనుంచి హారతి దీపాల వెలుగు....ధూపాల పొగ....ఘంటారావం....
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది. గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది....

లోపల వైద్యనాథ మహాదేవ శివుడు....లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.....
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.... ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి....
ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.....కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది....
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు..."మేమ్ సాబ్....తీర్థం తీసుకొండి...."
"ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు"
ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది...
"మేమ్ సాబ్... కంగారు పడకండి... బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు... ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి... అంతా మంచే జరుగుతుంది." అన్నాడు....

ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది...."ఓం నమశ్శివాయ.... ఓం నమశ్శివాయ..." మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు... ఇంకో ధ్యానం లేదు.... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ....
ఒకటి ... రెండు .... మూడు ..... నాలుగు .... అయిదు .....
రోజులు గడిచిపోతున్నాయి...
"ఓం నమశ్శివాయ.... ఓం నమశ్శివాయ..."
పదకొండో రోజు.... రోజు రోజంతా పంచాక్షరిని జపించింది...సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు .... "మేమ్ సాబ్ ... మేమ్ సాబ్... సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై... సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై..." అని పరిగెత్తుకుంటూ వచ్చాడు....ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది....
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది.... కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది....
"డియర్....
గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే... ఆహారమూ తక్కువే.... వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు.... ఇక మా పని అయిపోయిందనుకున్నాను.... ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు... నేను భయంతో కళ్లు మూసుకున్నాను... ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు...
అంతలో అద్భుతం జరిగిపోయింది....
ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు... ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు....ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు... చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది.. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది.... ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు....వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు.... ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు...
ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్..."

* * *

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండమీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు..
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది....

No comments:

Post a Comment

Pages