మోహన్ నాథ్ గోస్వామి కేవలం జీతం కోసమే జీవితాన్నిచ్చాడా? - Raka Lokam

మోహన్ నాథ్ గోస్వామి కేవలం జీతం కోసమే జీవితాన్నిచ్చాడా?

Share This



జమ్మూ కశ్మీర్ నేల అడుగడుగునా ఒక వీరగాథ విత్తనమై మొలకెత్తింది. నాగాలాండ్ నుంచి ద్వారక దాకా, నైనిటాల్ నుంచి నాగపట్నం దాకా వేలాది వీరులు తమ తుది రక్త బిందువులతో కుంకుమపువ్వుకు రంగులద్దారు. తమ ఆఖరి ఊపిరితో చినార్ చెట్లకు చిరుగాలుల్ని అందించారు. ఒక్కొక్క వీరుడిదీ ఒక్కొక్క కథ.
కాసుల కోసం, కాసింత జీతం కోసం సైనికుడు ఉగ్రవాదంతో పోరాడతాడని అనుకుంటే అంతకన్నా పొరబాటు లేదు. జీతమే కావాలంటే బస్తాలు మోసే జీవితమూ దొరుకుతుంది. కానీ కశ్మీర్ లోయలో శత్రువుతో పోరాడాలంటే కాసిని డబ్బులు కాదు. కర్తవ్య భావన కావాలి.

ఉత్తరాఖండ్ లోని నైనితాల్ జిల్లా. ఆ జిల్లాలో బిందుఖట్టా లాల్ కువా పంచాయతీ. అందులో ఇందిరానగర్ గ్రామం. అక్కడ ఇనుపనరాలు, ఉక్కుకండరాల ఒక కుర్రాడు. పేరు మోహన్ నాథ్ గోస్వామి.

ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా మోహన్ సైన్యంలో చేరాలనే కోరుకున్నాడు. నాన్న కూడా సైన్యంలో పనిచేశాడు. మోహన్ పారాచూట్ రెజిమెంట్ లోని 9 వ బెటాలియన్ కి చెందినవాడు. కానీ కశ్మీర్ లోయను పట్టిపీడిస్తున్న మతోన్మాద పాక్ ఉగ్ర మిడుతల దండును చంపేందుకు ఎలీట్ పారా కమాండ్ స్పెషల్ ఫోర్సెస్ లో ఏరి కోరి, పంతం పట్టి మరీ చేరాడు. చేరితే చేరాడు. చెప్పిన పని చేస్తే చాలు కదా. కానీ మోహన్ శత్రువుపై సింహంలా లంఘించి దూకడానికి ఎప్పుడూ ముందుండేవాడు. “ఈ ఆపరేషన్ లో నేను భాగస్వామినవుతాను. నన్ను చేర్చుకొండి” అని ముందుకురికేవాడు.

2015 సెప్టెంబర్.

కశ్మీర్ లోయ హంద్వారాలోని ఖుర్ మార్ లో లష్కర్ ఉగ్రవాదులు ఉన్నారన్న వార్త వచ్చింది. మోహన్ ఉడుకు రక్తం పోరు కోసం మారాం చేసింది. కమాండోలతో కలిసి వెళ్లి ముగ్గురు ముష్కరుల్ని చంపి తుపాకీ ఆకలి తీర్చాడు. అది ఆగస్టు 23.

ఈ ఆపరేషన్ పూర్తయి ఆయుధాలను శుభ్రం చేసుకునే లోపు కశ్మీర్ లోయలోని రఫియా బాద్ లో ఉగ్రవాదుల పై ఆపరేషన్ మొదలైంది. “నేనూ వస్తా” అని పోటీ పడి మరీ పోరుకు బయలుదేరాడు మోహన్. ఆగస్టు 26, 27 లలో మరో ముగ్గురు పాక్ లష్కర్ ముష్కరుల్ని పట్టిపల్లార్చాడు. ఇందులో పాకిస్తాన్ లోని ముజఫర్ గఢ్ కి చెందిన లష్కర్ నేత సజ్జాద్ అహ్మద్ అలియాస్ అబూ ఒబేదుల్లా అనే ఉగ్రవాదిని పట్టుకున్నారు.

సెప్టెంబర్ 3 న కుప్వాడా లోని హఫ్రుడా అడవుల్లో మళల్ఈ ఆపరేషన్ మొదలైంది. కశ్మీరంలో కలుపు మొక్కల ఏరివేత మొదలైంది. మళ్లీ మోహన్ నేను సైతం అంటూ ముందుకొచ్చాడు. సైనికులు ముందుకు సాగుతూంటే శత్రువు మాటు వేసి దెబ్బ తీశాడు. శత్రువుతో భీకరమైన యుద్ధం జరిగింది.

రాత్రి ఎనిమిదిన్నర.


మన జవాన్లు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్తం ధారగా కారుతోంది. వాళ్లను తక్షణం ఫైరింగ్ ఏరియా నుంచి సురక్షితంగా తరలించాలి. అదేం సామాన్యమైన పని కాదు. తూటాలు తోడేళ్లలా వేటాడతాయి. వాటి మధ్యనే ప్రాణాలకు తెగించి వాళ్లను తరలించాలి. మన మోహన్ ముందుకొచ్చాడు.

గాయపడ్డ జవాన్లను తరలిస్తూనే తన తుపాకీతో ఒక ఉగ్రవాదిని కుప్పకూల్చాడు. ముందుకు సాగుతూంటే తొడకు శత్రువు తూటా తలిగింది. కానీ మోహన్ లెక్క చేయలేదు. మరో ఉగ్రవాదిని చంపి, ఇంకొకడిని తీవ్రంగా గాయపరిచాడు. అంతలో రెండో తూటా అతనికి తగిలింది. అది తాకింది కడుపులో. కానీ అతను ముందుకురికి ఇంకో ఉగ్రవాదిని అతి దగ్గర నుంచి కాల్చి పారేశాడు.

కొంచెం సేపటికే రక్త స్రావంతో మోహన్ కుప్పకూలిపోయాడు. కానీ నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ఇద్దరు గాయపడి భద్రతా బలగాలకు చిక్కారు. గాయపడ్డ ముగ్గురు భారతీయ జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు.

మోహన్ ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన ఈ పోరాటంలో పది రోజుల్లో పదకొండు మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. మోహన్ ప్రాణం అనంత వాయువుల్లో కలిసినా కశ్మీర్ సరిహద్దుల్లోనే ఎక్కడో ఒక చోట శత్రువు చొరబడకుండా పహరా కాస్తూనే ఉంది. మోహన్ వీరోచిత పోరాటాన్ని దేశం కృతజ్ఞతతో స్మరించుకుంది. అంతిమ యాత్రకు వేలాదిగా తరలి వచ్చారు. కోట్లాది భారతీయులకు కోరుకున్నా దక్కని గౌరవం అతనికి దక్కింది. త్రివర్ణ పతకం అతని శవ పేటికను తీరని శోకంతో, ఆగని దుఃఖంతో “నా బిడ్డా” అంటూ వాటేసుకుంది.

మోహన్ ను మరణానంతరం అశోకచక్ర వరించింది. కాదు కాదు… ఆతడి సాహసోపేత వీరోచిత గాధను వరించి తరించింది.

అక్కడక్కడా మొరుగుతున్న సైంధవుల మూకలు చెబుతున్నట్టు సైనికుడు కేవలం నాలుగు జీతం రాళ్ల కోసమే పంచప్రాణాలను వదిలేసుకుంటాడా? ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, భార్యా పిల్లలను సైతం మరచి తూటాతో తుదిభేటీకి అశోకచక్ర అనే ఒక చిన్న గుడ్డముక్క, ఒక లోహం బిళ్ల కోసమే పరుగులు తీస్తాడా?

2 comments:

Pages