ఫౌజ్ మే జానా ... దుష్మనోం సే లడ్ నా...!! - Raka Lokam

ఫౌజ్ మే జానా ... దుష్మనోం సే లడ్ నా...!!

Share This



చాలా ఏళ్ల క్రితం సంగతి.

హర్యాణాలో తెలిసిన కుటుంబంలో ఒక జవాను కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయాడు.

ఆ కుటుంబాన్ని పలకరించేందుకు వెళ్లాం.

మేం వెళ్లిన రోజు సరిగ్గా ఆ అమర జవాను చనిపోయిన పదమూడో రోజు. జవాను చనిపోవడానికి కొద్ది రోజుల ముందే భార్య ప్రసవించింది. ఆ పిల్లవాడు పుట్టి ఇరవై ఒక్క రోజులైంది. అంతా బాగుంటే వాడిని ఆ రోజు ఉయ్యాలలో వెయ్యాలి.

కొడుకు పోయిన విషాదం.... మనవడు వచ్చిన ఆనందం....

ఓ బహు విచిత్ర భావాతీత స్థితి అక్కడ బరువుగా తిష్ఠవేసింది.

ఆ ముసలి తల్లి కూర్చుని కొడుకును తలచుకుంటూ కన్నీరు తుడుచుకుంటోంది.

అదే సమయంలో ఎవరో మనవడిని తెచ్చి ఆమె పొత్తిళ్లలో పెట్టారు.

ఆ ముసలావిడ ఒక్క క్షణం ఏడుపాపింది. ఆ మనవడిని చూసింది.

గద్గద కంఠంతో.... "బేటా.... బడా హోకర్ ఫౌజ్ మే భర్తీ హోనా...కశ్మీర్ జావో... దుష్మనోం సే లడ్నా...." అంటూ ఆశీర్వదించింది.



కటికపల్లెటూరు.... ఆ ముసలామెకి అక్షరం ముక్క రాదు..... చదువుకోలేదు... కానీ పెను విషాదంలోనూ మనవడిని వీర జవాను కమ్మని ఆశీర్వదించే మనసుంది. తూటాలున్నాయని తెలిసీ ఛాతీ ఎదురొడ్డించే స్థైర్యం ఉంది. మరిన్ని విషాదాలనైనా సహిస్తాననే మనో నిబ్బరం ఉంది. నా పొలం దున్నే వాడు లేకపోయినా పరవాలేదు.... దేశం సరిహద్దు భద్రంగా ఉండాలన్న భావన ఉంది.

ఈ మధ్య హిమాచల్ కి వెళ్లినప్పుడు ధర్మశాల దగ్గర షాపూర్ లో ఒక గుడి కనిపించింది.

ఆ గుడి ఒక జవాను స్మృతిలో కట్టింది. ఫిబ్రవరి 1994 లో ఉగ్రవాదంతో పోరాడుతూ పదిహేను తూటాలకు ఛాతీ ఎదురొడ్డి మరీ ప్రాణాలు వదిలిన 23 ఏళ్ల రాయ్ సింహ్ రాణా అనే జవాను కోసం ఆయన తల్లి అయోధ్యా దేవి కట్టించిన గుడి అది. ప్రాణాలివ్వడం ఒక వీర సంస్కృతి. ఉత్తర భారతంలో, ముఖ్యంగా హర్యాణా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాంచల్, జమ్మూ, రాజస్థాన్ లలో దేశం కోసం ప్రాణాలివ్వడం ఒక సర్వోచ్చ కర్తవ్యం. మగాడు మీసం మెలేసేది అందుకే. అమ్మాయి కోరుకునేంది అలాంటి వాడినే. అయితే విజయం. లేకపోతే వీరస్వర్గం.



శాస్త్రాలు చెప్పినట్టు...

ద్వావిమౌ పురుషో లోకే సూర్యమండల భేదినో
ప్రవిరాట్ యోగయుక్తశ్చ రణేచాభిముఖే హతౌ


రెండు రకాల వ్యక్తులే సూర్య మండలాన్ని భేదించి ఊర్ధ్వ లోకాలకు వెళ్లగలుగుతారు. ఒకరు యోగ పురుషులు. రెండవ వారు యుద్ధంలో వెన్ను చూపక చనిపోయిన వారు.
ఈ వీరారాధన ఉంది కాబట్టే దేశం కాపాడబడుతోంది. దేశం రక్షింపబడుతోంది.



వీరవరుల అడుగులందున
ఒరిగిపోయే గరిక నేను...
రాజపుత్రుని ఒరల నుంచి
మెరసిపోయే ఛురిక నేను
పొలమునందు హలముదున్నగ
కరగి జారే స్వేద బింధువు
ఖడ్గక్రీడా ప్రాభవంబున
పొంగిపారే రుధిర సింధువు
కాలగర్భములో కరంగిన
నాదు పూర్వుల మినుకు నేను
దాహతప్త జనాళి కొరకు
కురియు వర్షపు చినుకు నేను



No comments:

Post a Comment

Pages