సూర్యాపేట దగ్గర వెయ్యేళ్ల క్రితం..... - Raka Lokam
demo-image

సూర్యాపేట దగ్గర వెయ్యేళ్ల క్రితం.....

Share This



హైదరాబాద్ - విజయవాడ హైవే... రాబోయే శతాబ్దపు వేగాన్ని ఇప్పుడే రప్పిస్తున్నట్టు రయ్ రయ్ మంటున్న కార్లు... ఆధునికత ముఖానికి మేకప్ వేసినట్టు తళతళలాడుతున్న తారు రోడ్డు. మెడలో లావాటి నెక్లెస్ లాంటి రోడ్ డివైడర్....
సూర్యాపేట దగ్గర మరీ ఆధునికంగా ఉంటుంది ఈ రోడ్డు.

సరిగ్గా సూర్యాపేట దాటగానే ఎడమ వైపు ఒక రోడ్డు.... కాసేపు తాచులా తిరిగాక తారు రోడ్డు అంతమైపోయి, కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి కచ్చా రోడ్డు మొదలు.

మరో రెండు మూడు మలుపులు తిరిగే సరికి పెంకుటిళ్లు, మట్టి గోడలు... ఒక శతాబ్దం వెనక్కి...

రోడ్డు చిన్నపేగులా సన్నబడిపోతుంది. ఇంకొక శతాబ్దం వెనక్కి. పాతదనం ఫక్కున నవ్వుతుంది. ఇంకో శతాబ్దం వెనక్కి....

ఇలా వెయ్యేళ్లు వెనక్కి వెళితే ఊరికి నడిబొడ్డున కనిపిస్తుంది ఆ ఆలయం.

DSC02176

ఆలయంలో అడుగుపెడితే చాలు... కాకతీయుల కాలంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. కాకతీయ శిల్పకళా వైభవం కనిపిస్తుంది. అలనాటి కబుర్లను ఛాతీపై మోస్తున్నట్టు శిలా శాసనం ఉంటుంది. ఎత్తైన మెట్లు, దానిపై ప్రదక్షిణ మార్గం, ఆ తరువాత కాకతీయుల రాచముద్రలా ఉన్న స్తంభాలు, దశదిశలా వ్యాపించిన వారి కీర్తి లాంటి గోపురం, గర్భగృహం, గుమ్మం, అందులో శతాబ్దాల పూజల్ని సమావిష్టం చేసుకున్న లింగాకార శివుడు....

DSC02177

బయట ఎనిమిది వందలేళ్ల నాటి బావి.... ఆ ఊళ్లో అలాంటి బావులు ఎనిమిది ఉన్నాయట. ఆ ఊరి వాళ్లు ఇప్పటికీ ఆ బావుల నీళ్లే తాగుతారట.

గుడి బయట పిల్లల కేరింతలు వినిపిస్తాయి. అల్లరి చేసే ఆధునికంలా....

కానీ గుడిలో ఎనలేని నిశ్శబ్దం... మౌనం దాల్చిన అతీతంలా...

ఆ నిశ్శబ్దం చరిత్రను మరిచిపోవడం మీకలవాటేగా అని వెక్కిరించినట్టుంటుంది.

ఆ మౌనం అలసిన అమ్మలా ఉంటుంది.

DSC02178

పక్కనే కాకతీయుల త్రికూటాలయం ఉంది. మూడు వైపులా శివలింగాలు. మూడిటికీ మధ్యలో నందీశ్వరుడు ఉంటారు. ఇందులో ఒక రెండు స్తంభాలు కొడుకు పట్టించుకోకపోతే కుప్ప కూలిన తల్లిలా కొన్నేళ్ల క్రితం ఒరిగిపోయాయి. పురాతత్వ శాఖ ఆ స్తంభాలను, గుడిని మళ్లీ నిర్మించింది.

ఆ గుడి ఎరకేశ్వర స్వామి గుడి.

DSC02181

కొంత దూరంలోనే శివ వైష్ణవ అభేదం కథను చెబుతూ చెన్నకేశవ స్వామి గుడి. ఆ పక్కనే నామేశ్వరాలయం. నామేశ్వరాలయంలోనూ ఇదే దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అదే శతాబ్దాల నాటి శ్వాస మన నిర్లక్ష్యపు మౌనాన్ని చీలుస్తుంది.
సూర్యాపేటకు అయిదు కి.మీ దూరంలో చరిత్రను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ఆ ఊరిపేరు పిల్లల మర్రి. కాకతీయుల నాటి గుడుల్లో నేటికీ ఘంటాశంఖనాదాలు, ధూపదీప హారతులున్నాయి. పూజలు, పునస్కారాలు కొనసాగుతున్నాయి. కాకతీయులు అంతరించిన అయిదు దశాబ్దాలకు కాకతీయుల వారసులు హరిహర, బుక్కరాయలు స్థాపించిన విజయ నగర సామ్రాజ్యంలో రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడిగా వెలుగొందిన పిల్లలమర్రి పినవీరభద్రుడు ఈ ఊరి వాడే. వాణి నా రాణి అన్న కవి ఆయన.

DSC02184

గుడిలో చారిత్రిక స్తంభాలపై విగ్రహాలు విధ్వంసం అయి కనిపిస్తాయి. ఇదేదో ఖిల్జీలు, తుగ్లక్ ల దురాగతం అనుకునేరు. ఆ గుడిలో గుప్తనిధులున్నాయని కొందరు ప్రబుద్ధులు చేసిన నిర్వాకం అది. వీళ్లు ఖిల్జీల కన్నా ఖలులు. తుగ్లక్ ల కన్నా దుష్టులు. వాళ్లకేం దొరికిందో తెలియదు కానీ, మనకు పోయింది మాత్రం అపారం.

రుద్రమాంబా భద్రకాళీ రోచనోజ్వల రోచులను, అలనాటి వీరుల కదన కాహళి కహకహధ్వనులను మన కోసం వదిలేసి పసిడి రెక్కలు విసిరి పారిపోయిన కాలం జాడలు వెతుక్కునేందుకు ఈ సారి విజయవాడ వెళ్తూంటేనో, హైదరాబాద్ కి వస్తూంటేనో ఒక్కసారి పిల్లలమర్రికి రండి. అక్కడ శతాబ్దాల చరిత్ర మీకోసం శబరిలా ఎదురుచూస్తోంది!!

DSC02196

DSC02185
DSC02186
DSC02188
DSC02190
DSC02192
DSC02195
DSC02196
Comment Using!!

8 comments:

  1. blogger_logo_round_35

    sir, namaskaar iam Ansarpasha from khammam
    near by suryapet atabout 40km there is an other sivalayam also old @ kusumanchi.., soon iwill sent u pics

    ReplyDelete
    Replies
    1. blogger_logo_round_35

      Waiting for the pics..... send info about the temples also... eager to know....

      Delete
  2. blogger_logo_round_35

    ఇలాంటి అద్భుతాలు మన దేశం లో ఎన్నో ఎన్నెన్నో!

    ReplyDelete
  3. M2U00885-7

    chakkagaa parichayam chesaaru.. mana charitra meeda manam visesha krushi cheyyalsina avasaaraanni idi etthi chooputhondi..

    ReplyDelete
  4. mvr%25252Bsharma%25252Bphoto%25252B111
  5. blogger_logo_round_35

    రకా గారు ఇలాంటి గుడే అచ్చుగుద్దినట్టు సూర్యాపేట దగ్గర్లొనే ఇంకోటి ఉంది నాగులపహడ్ అన్నారం గ్రామంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పక్కనే ...
    గుడి నిర్మాణ శైలి 100 కి 100 అచ్చుగుద్దినట్టు ఉంది అండి నేను తరచూ వెల్టుంటా ... గుప్త నిధుల పేరుతో ఆలయాన్ని‌మొత్తం సర్వ నాశనం చేసారు ..వీలు కుదిరినప్పుడల్లా వెల్లి అక్కడ బాధతో కాసేపు కూర్చొని రావడం అలవాటి ఐంది

    ReplyDelete

Pages