బల్దేవ్ సడక్ నామా, సుర్జిత్ పాటర్, జస్వీందర్, దర్శన్ భుట్టర్, చమన్ లాల్, ఆత్మ జిత్, గురుబచన్ భుల్లర్, అజ్మేర్ ఔలఖ్, వర్యం సంధు, మంగ్లేశ్ డబ్రాలు, గులామ్ నబీ ఖయాల్, శివదాస్, జీఎన్ రంగనాథరావు, రాజేశ్ జోషీ, అశోక్ వాజ్ పేయీ, హర్దేవ్ చౌహాన్, దిలీప్ కౌర్ తివానా ... ఈ పేర్లెప్పుడైనా విన్నారా?
వీళ్లంతా ఇప్పుడు వార్తల్లో వ్యక్తులు. తమాషా ఏమిటంటే వీరి గురించి తెల్లారితే తెగ వార్తలు రాస్తున్న వారికి కూడా వీరు రచయితలన్న సంగతి తెలియకపోవచ్చు. తెలిసినా వారు రాసిన రెండేసి రచనల పేర్లు చెప్పమంటే చెప్పలేకపోవచ్చు. ఒక వేళ చెప్పగలిగినా వాటిని ఖచ్చితంగా చదివి ఉండకపోవచ్చు.
ఈ రచయితలందరూ కర్నాటకలో ప్రొఫెసర్ కాల్బుర్గి, ముంబాయిలో ధాబోల్కర్, పుణెలో పన్సరే అనే ముగ్గురు హేతువాదులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ తమకు సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేశారు. కొందరు పద్మ అవార్డులను కూడా తిరిగి ఇచ్చేశారు. ముగ్గురు హేతువాదుల హత్యను ఎవరూ సమర్థించరు. నిజానికి ప్రజాస్వామ్యంతో వాదం, వివాదం, సంవాదం అవిభాజ్య అంతర్భాగాలు. వాదం, వివాదం, సంవాదం అభిప్రాయ భేదాలున్నప్పటికీ కలిసి కూర్చుని చర్చించే అవకాశాలనిస్తాయి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. కాబట్టి రాజకీయ వ్యతిరేకుల హత్యలను ఖండించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి.
అయితే ఈ రచయితలకు గత ఏడాదిన్నరలో (కేంద్రంలో మోదీ పాలన ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పటికీ) 19 మంది ఆరెస్సెస్ కార్యకర్తలను కేరళలో కేవలం అభిప్రాయ భేదాల కారణంగా కమ్యూనిస్టులు హత్య చేసింది అసహిష్ణుతగా కనిపించలేదా? వారికి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అనిపించలేదా? బెంగాల్ లో మూడు దశాబ్దాలు కమ్యూనిస్టులు హత్యా రాజకీయాలు చేసింది కనిపించలేదా? ఆ సమయంలో అవార్డులు తీసుకుంటున్నప్పుడు వారి ఆత్మసాక్షి నొచ్చుకోలేదా? ఇంత మంది చనిపోయినప్పుడు నొప్పి పుట్టనిది ఇప్పుడు మాత్రమే సెలెక్టివ్ నొప్పి పుడితే దాన్ని కైకేయి తలనొప్పిగా మాత్రమే భావించాల్సి ఉంటుంది.
నిజానికి ధాబోల్కర్ హత్యకు గురైంది 2013 లో, పన్సరే చనిపోయింది గతేడాది. అప్పుడు వీరెవరికీ నొప్పి కలగకపోవడం విడ్డూరం.
నెహ్రూ మేనకోడలు, రచయిత్రి నయన్ తారా సెహగల్ కూడా అవార్డును తిరిగి ఇచ్చిన వారిలో ఉన్నారు. ఆమెకు అవార్డు ఇచ్చింది 1986 లో. అంతకు రెండేళ్ల ముందు ఢిల్లీలో సిక్ఖుల ఊచకోత జరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇస్తూంటే ఆమెకు మనస్సాక్షి అడ్డం రాలేదు. 1987, 1989 లో మీరట్, భాగల్పూర్ లో భారీగా మతకలహాలు జరిగాయి. వారి మనస్సాక్షి మేల్కొనలేదు. 1990 లో కాశ్మీరీ పండితులను కాశ్మీరు లోయ నుంచి తరిమి కొట్టేశారు. లక్షలాది మంది ప్రాణాలరచేత పెట్టుకుని పారిపోయి వచ్చారు. ఆమె మనస్సాక్షి గురక ఆగలేదు. భారతీయ సంస్కృతికి ఈ హత్యల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని ఆమె నమ్మారా? లేక కాంగ్రెస్ ఏం చేసినా ఒప్పే అని భావించి "అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టింది కొత్త కుండ" అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా?
అవార్డును తిరిగి ఇచ్చేసిన వారిలో అశోక్ వాజ్ పేయీ ఒకరు. ఆయన కమ్యూనిస్టు భావాలు జగమెరిగిన సత్యం. ఆయకు 1994 లో అవార్డు వచ్చింది. బాబ్రీ కట్టడం కూలిన రెండేళ్లకు ఆయనలోని సెక్యులరిస్టు సిగ్గులేకుండా సాహిత్య అకాడమీ అవార్డు ఎలా తీసుకోగలిగారు? కాబట్టి వీరందరి సెక్యులరిజం "సమయానుకూలముగా ప్లేట్లు మార్చబడును" అన్న సిద్ధాంతాన్ని పాటిస్తుందన్న మాట. వీరందరి ఆత్మసాక్షి అవసరార్థం బజ్జుంటుంది. అవసరమైతే మేల్కొంటుంది.
నిజానికి పన్సరే, ధాబోల్కర్ హత్యల వెనుక సనాతన్ సంస్థ అనే సంస్థ హస్తం ఉందని భావిస్తున్నారు. దానికి ఆరెస్సెస్ బిజెపిలకు సంబంధం లేదు. ఆ సంస్థ వీటిని వ్యతిరేకిస్తుంది కూడా. పైగా సనాతన్ సంస్థ విషయంలోనూ ఇప్పటి వరకూ రూఢిగా ఏమీ ఋజువు కాలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతలోనే సదరు సాహిత్యవేత్తలంతా అవార్డులను తిరిగి ఇచ్చేయడం వెనుక ఉన్న "భావమేమి తిరుమలేశ" అని అడగాల్సి వస్తోంది.
ఇంకో విషయం కూడా ఉంది. అసలు సాహిత్య అకాడమీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది స్వతంత్ర సంస్థ దీని నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వపు ప్రభావం ఏమీ ఉండదు. అయినా వీరు ఆ అవార్డులను ఎందుకు తిరిగి ఇచ్చివేస్తున్నట్టు? కైకేయి ఏడుపు సరే... వెనకున్న మంధర ఎవరు? రాలిపోతున్న కమ్యూనిజమా, పగతో కాలిపోతున్న కాంగ్రెస్సా?
well-said sir ..
ReplyDeletesrinivasa rao avvaru
అయ్యా,ఒకసారి ఇప్పటి సమయ సందర్భాలు చూడండి - అంతా అర్ధమవుతుంది!బీహారు రెండో వరస యెన్నికల్ని ప్రభావితం చెయ్యడమే ఈ హడావిడికి మూలకారణం!
ReplyDeletevery correct sir... But, I am sure their machinations would be defeated lock stock and barrel
Deleteమరి ఆనాటి నుండి నేటి వరకు సాహిత్య అకాడమీ పురస్కారం వల్ల వాళ్ళు పొందిన లాభాలు కూడా వడ్డీ తో సహా, పెనాల్టీ తో సహా తిరిగి ఇవ్వాలి కదా? ఇవ్వడం లేదు. ఒకాయన అన్నట్టు ఇది ఫ్రీగా సినిమా చూసి మళ్ళీ టిక్కెట్టు వాపస్ ఇచ్చి తుమ్మ తుతుల్ల అన్నట్లు గా ఈ దగాకోరు ల వ్యవహారం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు తమ వారికి ఇచ్చుకున్న భారత రత్న బిరుదులూ కూడా వాపస్ ఇస్తే సత్యం గెలుస్తుంది.
ReplyDelete