వీళ్లు లోకసభకి మాత్రమే ఓటర్లు... అసెంబ్లీకి కాదు..... - Raka Lokam

వీళ్లు లోకసభకి మాత్రమే ఓటర్లు... అసెంబ్లీకి కాదు.....

Share This



అరవై ఏడేళ్లుగా ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశం తప్ప మరో దేశం లేకుండా ఉంటూ కూడా ఈ దేశ పౌరులు కాకుండా ఎవరైనా ఉండగలరా? హిందువులైన పాపానికి పాకిస్తాన్ నుంచి ప్రాణాలరచేత పట్టుకుని భారత్ కి శరణార్థులుగా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పౌరసత్వం లేకుండా ఎవరైనా ఉంటారా?

ఏ రాష్ట్రంలో ఒక వర్గం ప్రజలకు సొంత ఇళ్లు కట్టుకునే హక్కు లేదు? ప్రభుత్వం కట్టి ఇచ్చిన తాత్కాలిక ఇళ్లలోనే తరాలు గడిపేస్తున్నవారెక్కడైనా ఉంటారా? ఇళ్లకు ఆరు దశాబ్దాలుగా కనీసం ఒక పెంకునో, ఒక ఇటుకనో కూడా మార్చే హక్కు లేకుండా ఆ గుడిసెల్లోనే తాత్కాలికంగా నివసిస్తున్న వారు అసలెక్కడైనా ఉంటారా?

లోకసభకు ఓటువేసే హక్కు ఉండి, రాష్ట్ర అసెంబ్లీకి మాత్రం ఓటు హక్కు వేసే అవకాశం లేని ప్రజలు ఈ దేశంలో ఉన్నారా?

ఉంటారు. అలాంటి వాళ్లను చూడాలంటే మీరు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లాలి. దేశ విభజన తరువాత పాకిస్తాన్ లో బతుకు దుర్భరమై అక్కడ నుంచి ప్రాణాలరచేత పెట్టుకుని పారిపోయి వచ్చిన వారికి జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి హక్కులూ లేవు. వారికి ఢిల్లీలో ఉద్యోగాలు దొరుకుతాయి. దేశమంతా ఉద్యోగాలుంటాయి. కానీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఉద్యోగాల్లేవు. వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ లేదా డబ్ల్యు పి ఆర్ అన్న ముద్దు పేరుతో జమ్మూలో నివసిస్తున్న రెండు లక్షల మందికి స్థానికత లేని కారణంగా ఎలాంటి హక్కులూ లేవు.

అప్పట్లో సియాల్ కోట్ నుంచి పారిపోయి 5764 కుటుంబాలు జమ్మూకి వచ్చాయి. జమ్మూలో మత ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో వారు పంజాబ్ కు పయనమయ్యారు. పంజాబ్ జమ్మూ సరిహద్దులోని లఖన్ పూర్ దగ్గర వారిని అప్పటి ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఆపివేశాడు. మీకు అన్ని వసతులూ కల్పిస్తామని, స్థానికులుగా గుర్తిస్తామని వాగ్దానం చేశాడు. ఆయన మాటలు నమ్మి వారు జమ్మూలో ఉండిపోయారు. ఆ తరువాత షేక్ మాట మార్చాడు. తరువాత సర్కార్లు వారిని జమ్మూ కాశ్మీర్ స్థానికులుగా గుర్తించలేదు. ఆర్టికల్ 370 ని అడ్డం పెట్టుకుని వారికి ఎలాంటి హక్కులూ లేకుండా చేశాయి. వారికి గుడిసెల్లాంటి ఇళ్లు కట్టించాయి. కానీ వాటిపై వారికి ఎలాంటి హక్కూ లేదు. వారికి ఆ ఇళ్లను మరమ్మత్తు చేసుకునే అధికారం లేదు. ఇళ్లు కారుతున్నా, గోడలు పడిపోతున్నా వాటిలోనే ఉండాలి. వారికి స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాలుండవు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని బతకాలి. భూమి కొనుక్కునే హక్కులేదు. ఇల్లు కట్టుకునే హక్కు లేదు. నాటి 5764 కుటుంబాలు ఇప్పుడు 25460 కుటుంబాలయ్యాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్ధుల సంఖ్య దాదాపు రెండు లక్షలైంది. వీరు కఠువా, సాంబా, జమ్మూల్లో ఎక్కువగా నివసిస్తూంటారు.

వీరికి లోకసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వారు స్థానికులు కారు. ఆర్టికల్ 370 ప్రకారం వారు ఓటు వేయడానికి వీల్లేదు.


విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా వస్తే వారికి అరవై ఏడు సంవత్సరాలు కాశ్మీర్ లో లేకున్నా అన్ని హక్కులూ సంక్రమిస్తాయి. ఓటు హక్కు ఉంటుంది. భూమి కొనుక్కునే హక్కు ఉంటుంది. కానీ అరవై ఏడేళ్లుగా నివసిస్తున్న వారికి మాత్రం ఎలాంటి హక్కులూ లేవు. ఎందుకంటే వారి వద్ద పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ లేదు. ఇది ఒకప్పుడు తెలంగాణలో నిజాం హయాంలో ఉండే ముల్కీ వంటిది. ముల్కీని సుప్రీం కోర్టు కొట్టేసింది. కానీ జమ్మూకాశ్మీర్ లో పీ ఆర్ సీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇంకా విషాదం ఏమిటంటే జమ్మూ కాశ్మీరులో సర్కారు పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం పంజాబ్ నుంచి వచ్చిన వారికి జమ్మూలో భూములు కొనుక్కునేందుకు అనుమతిస్తోంది. కానీ ఈ హక్కులేవీ పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు వర్తించవు. ఆఖరికి బంగ్లాదేశీ అక్రమ చొరబాటు దారులకు పౌరసత్వం లభిస్తోంది. కానీ వీరికి ఏమీ దక్కడం లేదు.

అలా సియాల్ కోట్ నుంచి శరణార్థులుగా వచ్చిన ఒక కుటుంబం షేక్ అబ్దుల్లా మాట వినకుండా పంజాబ్ కి వెళ్లిపోయింది. ఆ కుటుంబంలోనే పుట్టిన మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. తొమ్మిదేళ్లు పాలించారు. అదే సియాల్ కోట్ కి చెందిన మిగతా వారు జమ్మూ ప్రాంతంలో ఉండిపోయారు. ప్రధానమంత్రి సంగతి దేవుడెరుగు. కనీసం ఓటు కూడా వేయలేకపోతున్నారు.

బహుశః ఆర్టికల్ 370 ని సమర్ధించేవారికి రెండు లక్షల మంది కన్నీటి గాథ వినిపించదేమో. వాళ్ల కష్టాలు కనిపించవేమో!!


1 comment:

  1. wasn't that intolerance???????????????????????????????????????????????????????????????????????????????????????????

    ReplyDelete

Pages