బిటెక్ హిస్టోరియన్ !! - Raka Lokam

బిటెక్ హిస్టోరియన్ !!

Share This



పుణె అంటే....
సాఫ్ట్ వేర్ రాజధాని....
ముంబాయి దాకా పరుచుకున్న పరిశ్రమల రహదారి...
ఖడక్ వాస్లా, ఖిర్కీల్లో విస్తరించిన సైనిక కంటోన్మెంట్లు...
సింబయాసిస్, ఎం ఐ టీ ల్లాంటి మహా విద్యా సంస్థలు...
నిజంగా నాకివేవీ గుర్తుకు రాలేదు.
పుణె అంటే ...
శివాజీ బాల్యం గడిచిన చోటు...
షాయిస్తఖాన్ వేళ్లు శివఛత్రపతి నరికేసిన చోటు....
పీష్వాలు మదమెక్కిన మొగల్ లకు ముకుతాడు వేసిన చోటు....
శనివార్ వాడ నుంచి దండు వెళ్లిన మరాఠాలు అఫ్గనిస్తాన్ లోని అటక్ పై భగవాపతాకం ఎగరేసిన ఘట్టం పుట్టిన చోటు ...
కేసరిలా స్వరాజ్యం నా జన్మహక్కని తిలక్ గర్జించిన చోటు....
చాఫేకర్ సోదరులు బ్రిటిష్ వాడిపై కొదమ సింహాలై లంఘించిన చోటు....
నాకు ఇవే గుర్తుకు వచ్చాయి.


పుణెలో ఒక్క రోజు ఉంటాను. ఒక వర్క్ షాపులో ప్రసంగించాలి. కానీ కాసింతైనా సమయం తీసుకుని నాకు పుణెలోని చరిత్రాత్మక ప్రాంతాలను కొన్నింటినైనా చూపిస్తారా అని నిర్వాహకులను అడిగాను.
వారు సరేనన్నారు. ఆదివారం ఉదయమే నేను రెడీ అయ్యేసరికి నల్లగా, బక్కగా, మోకాళ్లు దాటిన పూల పూల కుర్తాధారి అయిన కుర్రాడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ కుర్రాడు నా గైడు.
అతను నాకు పుణె గ్రామ దేవత కస్బా గణపతి గుడిని, పీష్వాలు పాలించిన శనివార్ వాడా కోటను, పీష్వాలు కోట బయటకు వచ్చేందుకు ఏర్పాటైన గణేశ్ ద్వార్ ను, చతుర మరాఠా రాజకీయ దురంధరుడు నానా ఫడ్నవీస్ ఇంటిని, పీష్వాల కాలం నాటి నుంచి కోట ఎదురుగానే నివాసముంటున్న బినీవాలేల దేవిడీని, తిలక్ కే రాజకీయ గురువైన మహర్షి అత్రే ఇంటిని, శివాజీ బాల్యం గడిపిన లాల్ మహల్ ని నాకు చూపించాడు.
ఇవన్నీ పుణె చరిత్రకు సజీవ సాక్ష్యాలు. శివాజీ, జిజాబాయి, దాదాజీ కొండదేవ్, బాజీ రావు పీష్వా, సవాయ్ మాధవరావు, నానా ఫడ్నవీస్ వంటి మరాఠా మహాయోధుల మహత్కార్యాలను చూసి పులకించిన ప్రాంతాలివి.
అడుగడుగునా మహారాష్ట్ర మహోజ్వల చరిత్రకు అద్దం పడతాయి ఇవి.


కానీ వీటన్నిటికన్నా నాకు నల్లగా, బక్కగా, మోకాళ్లు దాటిన పూల పూల కుర్తాధారి అయిన ఆ కుర్రాడే తెగ నచ్చేశాడు.

ఒక్కో చోటకు తీసుకెళ్లాక, ఆ నల్లబ్బాయి ఒక్కసారి నడుస్తున్న చరిత్రగా మారిపోయేవాడు. మరాఠా యోధుల వీర గాథలు చెప్పేటప్పుడు కళ్లల్లో వెలుగు... పతన కాలపు వ్యథను చెప్పేటప్పుడు విషాదం.... బచావ్ బచావ్ అంటూ పారిపోతున్న షాయిస్తఖాన్ పరుగు గురించి చెప్పేటప్పుడు వ్యంగ్యం, కఠిన పరిస్థితుల్లో మంత్రాంగం నెరపిన నానా ఫడ్నవీస్ కథ చెప్పేటప్పుడు వివేకం...ఇవన్నిటినీ అభినయిస్తూ... అనునయిస్తూ...అన్వయిస్తూ... అవేశపడుతూ... ఆ కుర్రాడు వివరించాడు. తేదీలను అలవోకగా చెప్పేస్తున్నాడు. దూరాలను అతి తేలిక గా వివరించేస్తున్నాడు.

నేను ఒక్క ప్రశ్న అడిగితే పది మాటలు చెబుతున్నాడు. వాకింగ్ విజ్ఞానకోశంలా కనిపించాడు.


1857 కి వందేళ్ళ ముందు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే తెల్లోళ్లను తెల్లబోయేలా చేశాడు. ఆయన రచనల గురించి చెప్పాడు ఆ కుర్రాడు. థియోసాఫిక్ సొసైటీలో అనీబిసెంట్ మిత్రుడైన నారాయణ్ సదాశివ్ మరాఠే జర్మన్ రాజు సందేశాన్ని, ఆయన భారత్ లో విప్లవం కోసం ఇచ్చిన వజ్రాలను తిలక్ కి ఇచ్చాడు. తిలక్ సందేశాన్ని తీసుకున్నాడు. కానీ వజ్రాలు వద్దన్నాడు. స్వరాజ్యాన్ని విదేశీ ధనంతో సాధించడం తనకు ఇష్టం లేదని అన్నాడు. ఆ గాథను చెబుతూ ఆ కుర్రాడి కళ్లు చెమర్చాయి. భావూ రంగారీ భవన్ గురించి చెబుతూ ఆ రోజుల్లోకి వెళ్లిపోయాడు ఈ రోజుల కుర్రాడు. భావూ రంగారీ అనే ఈ వ్యాపారి తిలక్ తో కలిసి తొలి సామూహిక గణేశోత్సవాన్ని నిర్వహించాడు. వినాయకుడుని యుద్ధ మూర్తిగా తయారు చేసి ప్రజలను బ్రిటిష్ వ్యతిరేక యుద్దోన్ముఖులు చేశాడాయన.

నేను ఆ కుర్రాడిని అడిగాను.
"నువ్వేం చదువుతున్నావు?"
"బి టెక్."
"నువ్వు హిస్టరీ స్టూడెంటువనుకున్నాను."
"చరిత్ర నా అభిమాన విషయం. చరిత్రంటే నాకు ప్రాణం."
"మరి ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నావు?"
"ఇంజనీరింగ్ వృత్తి కోసం. చరిత్ర నా ప్రవృత్తి"
"ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నావు?"
"నా గురువు గారు మోహన్ షేటే. ఆయన ఇతిహాస్ ప్రేమీ మండల్ అనే సంస్థను నడుపుతున్నారు. అక్కడంతా ఉచితం. చరిత్ర పై ప్రసంగాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. చారిత్రిక స్థలాల సందర్శనకార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నేను గత ఆరేళ్లుగా ఇతిహాస్ ప్రేమీ మండల్ సభ్యుడిని." అన్నాడా కుర్రాడు.

నేను ఏమీ మాట్లాడలేదు.
"నిన్న సింహగఢ్ కోటలో (పుణెకి 60 కిమీ దూరంలో ఉంటుంది) కోటలపై ఒక జాగరణ జరిగింది. రాత్రి ఒంటి గంట దాకా అక్కడ పాల్గొన్నాను. ఆనాటి దుస్తులు ధరించి, ఆ నాటి చారిత్రిక ఘట్టాలను అభినయించాం. రాత్రంతా కార్యక్రమం జరిగింది. కానీ మీరు వస్తున్నారని నేను రాత్రి పుణెకి వచ్చేశాను," అన్నాడు.
అంటే రాత్రి ఒంటిగంటకి బయలుదేరి, ఏ రెండు మూడింటికో ఇంటికి వచ్చి, ఓ రెండు మూడు గంటలు పడుకుని, మళ్లీ నాకోసం వచ్చేశాడన్నమాట.
"మీరు వస్తున్నారని, మీకు చరిత్ర అంటే ఇష్టమని తెలిసి, నేను మీకు పుణె చరిత్ర చెప్పేందుకు వచ్చేశాను. ఖాళీ సమయాల్లో సందర్శకులకు పుణె కథ చెప్పడమే నా హాబీ." అన్నాడు.
"ఇలా చేస్తే నీకు డబ్బేమైనా ఇస్తారా?"
"నాకు డబ్బక్కర్లేదు. నా సొంత డబ్బు ఖర్చు చేసైనా నేను ఈ పనిని చేస్తూంటాను." అన్నాడు ఆ కుర్రాడు.


భవిష్యత్తు కి చరిత్ర వెలుగులే బాట చూపిస్తాయంటారు. ప్రాచీన చరిత్రను, అర్వాచీన బి టెక్ ను మేళవించిన ఆ కుర్రాడు నాకు వివేకానందుడు చెప్పిన ఈస్టర్న్ స్పిరిట్యువలిజం, వెస్టర్న్ డైనమిజంల మేలు కలయికలా కనిపించాడు.
పుణెలో నేను చూసిన చరిత్రాత్మకమైన వస్తువు ఆ నల్లగా, బక్కగా, మోకాళ్లు దాటిన పూల పూల కుర్తాధారి అయిన ఆ కుర్రాడే! ఆ కుర్రాడి పేరు ప్రణవ్ సదర్ జోషీ.

కానీ కనిపించే ప్రణవ్ సదర్ జోషీలో నాకు ఇంకో వ్యక్తి కనిపించాడు....

ఆయన ప్రణవ్ సదర్ జోషీలను తయారు చేస్తున్న మోహన్ షేటే కనిపించాడు.


(చిత్రాల వివరణ - 1) పుణె గ్రామదేవత కస్బా గణపతి దేవాలయంలోపలి దారు నిర్మిత భవనం, 2) కస్బా గణపతి దేవాలయం ముందు భాగం 3) శివాజీ బాల్యాన్ని గడిపిన లాల్ మహల్ లో ఒక మరాఠా యోధుని విగ్రహం, 4) లాల్ మహల్ లోని ద్వారపాలకుడు 5) నా హీరో ప్రణవ్ సదర్ జోషీ 6) లాల్ మహల్ లో జిజా మాత విగ్రహం ౭) జిజా మాత బంగారు నాగలితో శివాజీ చేత పొలం దున్నిస్తున్న దృశ్యం 8) లాల్ మహల్ 9) నానా ఫడ్నవీస్ నివసించిన భవనం 10) బినీవాలేలు ఇప్పటికీ నివసిస్తున్న భవనం 11) మహర్షి అత్రే నివసించిన భవనం 12) పుణే శనివార్ వాడ గణేశ్ ద్వార్ 13) శనివార్ వాడ కోట 14) శనివార్ వాడ సింహద్వారం. )

3 comments:

  1. ఇదంతా చదివేక నేటి యువతరానికి కెరియర్ పేరుతో ఎంత అమూల్యమైన దానిని అందకుండా చేస్తున్నామో అర్థం అవుతోంది. ఈ విషయంలో జోషీ అతని గురువుగారు చాలా అభినందనీయులు.

    ReplyDelete
  2. GOOD REMINDER OF OUR GREAT HISTORY

    ReplyDelete
  3. Really wonderful Rakhaji. Meeru oka spurthi Kendram. Mee akkaiahgaa abhimanam andukovadam adrushtam. Ian thinking to visit Pune. I wl take the address of that little master.

    ReplyDelete

Pages