జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఫలితాలు చెప్పే పాఠాలేమిటి? - Raka Lokam

జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఫలితాలు చెప్పే పాఠాలేమిటి?

Share This



జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఏం చెబుతున్నాయి? మొట్టమొదటగా - బిజెపి దేశవ్యాప్తంగా ఒక బలీయ శక్తిగా ఎదుగుతోంది. దాని బలం నానాటికీ పెరుగుతోంది. రెండో పాఠం - భారత దేశం క్రమేపీ కాంగ్రెస్ కనుమరుగవుతోంది. ఎన్నికలు జరిగిన రెండుచోట్లా కాంగ్రెస్ మూడో స్థానం లేదా నాలుగో స్థానానికి పరిమితమైపోయింది.

కాశ్మీరులో బిజెపి 2008 ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య రెండింతల కన్నా ఎక్కువై 25 కి చేరింది. జమ్మూ లోయలో పార్టీ భారీ ఆధిక్యతను కనబరిచింది. వోట్ల శాతం లోనూ బిజెపికి 23.3 శాతం ఓట్లు వచ్చాయి. సీట్లు ఎక్కువగా గెలుచుకున్నా ప్రొగ్రెసివ్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ)కి 23 శాతం ఓట్లే వచ్చాయి. అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మూడో స్థానంలో ఉంటే కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది. జార్ఖండ్ లోనూ బిజెపి బలం 2009 లో 18 సీట్లు. ఈ సారి దాని బలం 41 కి పెరిగింది. వోట్ల శాతం విషయంలోనూ బిజెపికి 31 శాతం ఓట్లు వచ్చాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా 23 శాతం వోట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కేవలం ఆరు సీట్లతో అయిదో స్థానంలో ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ శక్తులే బిజెపికి ముఖ్య ప్రత్యర్థులుగా నిలిచాయి. కాంగ్రెస్ ఎక్కడా సోదిలోకి లేకుండా పోయింది. ఇంతకు ముందు ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యాణాల్లో ఇదే జరిగింది. కాంగ్రెస్ ఓట్లు, సీట్లు పడిపోయాయి.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రెండు బలీయమైన పార్టీలుంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలో కి రావడం కష్టం. ఉదాహరణకి తమిళనాడునే తీసుకుందాం. 1967 లో అన్నాదురై నాయకత్వంలో డీఎంకె ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఉత్తరప్రదేశ్ లో 1989 తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. బీహార్ లో, ఒడిశాలో, బెంగాల్ లో, త్రిపురలో ఇదే పరిస్థితి.

ప్రస్తుతం దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ 9 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. కర్నాటక, కేరళ, అస్సాంలను మినహాయిస్తే మిగతావన్నీ నాగాలాండ్, మిజోరాం వంటి బుల్లి రాష్ట్రాలే. కాబట్టి దేశం కాంగ్రెస్ ముక్త భారతదేశంగా మారిపోతోంది.


జార్ఖండ్ - అతుకుల బొంత సర్కార్లకు రాంరాం
జార్ఖండ్ ఎన్నికలు ప్రజలు అతుకుల బొంత సర్కార్లు, గతుకుల గుంటల రోడ్లతో పూర్తిగా విసిగిపోయారని రుజువు చేస్తున్నాయి. 2000 లో జార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి గత పధ్నాలుగేళ్లలో 9 ప్రభుత్వాలు మారాయి. మూడు సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటువడింది. కొత్తగా ఏర్పడ్డ మూడురాష్ట్రాల్లో అన్నిటికన్నా వెనుకబడ్డ రాష్ట్రంగా జార్ఖండ్ మిగిలిపోయింది. పధ్నాలుగేళ్లలో తొలిసారి పూర్తి మెజారిటీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం అక్కడి ప్రజాకాంక్షలకు అద్దం పడుతోంది.


జమ్మూకాశ్మీర్ - జనం బిజెపితోనే
ఇక జమ్మూ కాశ్మీరులో ఫలితాలు ఊహించినవే. ఆ రాష్ట్రంలో నియోజకవర్గాల కూర్పు కాశ్మీరు లోయకు బాగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయాలపై కాశ్మీరు లోయ ఆధిపత్యం ఆచంద్ర తారార్కం ఉండేలా నియోజకవర్గాల విభజన జరిగింది. కేవలం అయిదు శాతం భూభాగం ఉన్న కాశ్మీరు లోయలో 46 సీట్లున్నాయి. మొత్తం 87 నియోజకవర్గాల్లో 46 కాంగ్రెస్ లోయలోనే ఉన్నాయి. 21.63 శాతం భూభాగం ఉన్న జమ్మూకి 37 సీట్లే ఉన్నాయి. కాశ్మీరులోని షోపియాన్, కుల్ గామ్, పుల్వామా జిల్లాల్లోని గురేజ్, కర్నా, ఖన్యార్, హబ్బాకడల్ నియోకవర్గాల మొత్తం ఓట్లు 50 వేలకు మించవు. గురేజ్ లో మొత్తం ఓట్లు 17554. కర్నాలో 32,794 వోట్లు ఉన్నాయి. అదే జమ్మూలోని గాంధీ నగర్ లో 1.66, 132 వోట్లు, రాజౌరీలో 1.12 లక్షలు, జమ్మూ వెస్ట్ లో 1.51 లక్షల వోట్లు ఉన్నాయి. లేహ్ నియోజకవర్గంలోనూ 67,736 ఓట్లున్నాయి. ఇది షేక్ అబ్దుల్లా కాలంలో మొదలైన కుట్ర. ఆ తరువాత వివిధ కాశ్మీరీ లోయ పార్టలు ఈ కుట్రను కొనసాగిస్తూ వచ్చాయి.

37.50 లక్షల వోట్లున్న కాశ్మీరు లోయకు 46 సీట్లు, 33.10 లక్షల ఓట్లున్న జమ్మూకి 37 సీట్లు ఉండటం వేర్పాటువాద శక్తులు చేసిన కుట్ర ఫలితమే. లడాఖ్ లో 1.60 లక్ష మంది ఓటర్లున్నారు. నాలుగు సీట్లున్నాయి. లడాఖ్ లోని జన్ స్కార్ సీటు నుంచి హిందువు లేదా బౌద్ధులు గెలవకుండా ముస్లిం మెజారిటీ తాలూకాలైన లాంఘర్ ట్సే, బార్టూ, బార్సూలను కార్గిల్ నుంచి తీసుకవచ్చి కలిపారు. జమ్మూ లోయలోని పూంఛ్ హవేలీ, కాలాకోట్, రాజౌరీ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా జనాభా కూడికలు, తీసివేతలు, నియోజకవర్గ రూపురేఖలను మార్చి హిందువులు గెలవకుండా చేశారు. ఈ కుట్ర అర్థమైతే తప్ప జమ్మూకాశ్మీరు ఫలితాల వాస్తవాలను గమనించలేము. అందుకే ఎక్కువ వోట్లు వచ్చిన బిజెపి కి తక్కువ సీట్లు, తక్కువ వోట్లు వచ్చిన పీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అయినప్పటికీ పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్సులకు మెజార్టీ రాలేదు. ఈ నాడు రాష్ట్రంలో బిజెపి లేకుండా ప్రభుత్వం నడవడం కష్టం. బిజెపి కాశ్మీరు లోయలోనూ అభ్యర్థులను పోటీకి దింపి, ఫరవాలేదనిపించుకుంది. రాబోయే రోజుల్లో పార్టీ కాశ్మీరీల మనసులను చూరగొని, బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు, ఈ మధ్యే జరిగిన మహారాష్ట్ర, హర్యాణాల ఎన్నికలు ఇంకో విషయాన్ని కూడా చెబుతున్నాయి. అదేమిటంటే రాజకీయ పార్టీలు ఎన్నికల టైమ్ లోనే మేల్కొంటే సరిపోదు. తమ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల నోట్లో నానాలి. ఓటర్ల నమోదు నుంచి ఓటర్లను చైతన్య పరచడం వరకూ అన్ని స్థాయిల్లో కార్యకర్తల కృషి ఆధారంగా పార్టీ పనిచేస్తూ ఎదగాలి. అలా చేయలేని పార్టీలకు ఇక మనుగడ ఉండబోదు. అలా చేసింది కాబట్టే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించగలిగింది. తమాషా ఏమిటంటే నాలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి తన ముఖ్యమంత్రి ఎవరో ముందుగా ప్రకటించలేదు. అయినా విజయం సాధించింది. దీని వెనుక జాతీయ స్థాయిలో మోదీ ఇమేజీ ఎంత కారణమో క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల నిరంతర కృషి కూడా అంతే కారణం. రాజకీయపార్టీలన్నీ ఈ అసలు పాఠాన్ని నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదు.

No comments:

Post a Comment

Pages