1948 లో మహారాష్ట్రకి, కఠియవాడ్ కి రంజీట్రాఫీ మ్యాచ్ జరుగుతోంది. ముంబాయి తరఫున ఓ 29 ఏళ్ల ఆటగాడు ఆ ఆటలో చెలరేగాడు. ఆయన్ని అవుట్ చేసే బంతి కఠియవాడ్ బౌలర్ల దగ్గర లేదు. ఆ బ్యాట్స్ మన్ బంతులను బౌండరీకి పంపించేస్తూనే ఉన్నాడు.
అప్పటికే తొలి ఇన్నింగ్స్ లో కఠియవాడ్ 238 కి ఆలౌట్ అయిపోయింది.
మహారాష్ట్ర తొలి వికెట్ 81 కి పడింది.
ఆ బ్యాట్స్ మన్ అవుట్ కాలేదు.
రెండో వికెట్ 455 కి పడింది.
ఆ బ్యాట్స్ మన్ మాత్రం అవుట్ కాలేదు.
మూడో రోజు ఆట 587/2 తో మొదలైంది. మూడో వికెట్ పడింది.
కానీ ఆ బ్యాట్స్ మన్ మాత్రం అవుట్ కాలేదు.
ఆ బ్యాట్స్ మన్ 400 దాటేశాడు. ఫస్ట్ క్లాస్ లో అత్యధిక రన్నుల రికార్డు బ్రాడ్మన్ ది. ఆయన 452 పరుగులు చేశాడు. మన బ్యాట్స్ మెన్ ఆ రికార్డుకి చేరువగా వచ్చేశాడు.
చరిత్ర తిరగరాసే సన్నివేశం అది.
మన బ్యాట్స్ మెన్ 443 పరుగుల దగ్గరున్నాడు.
ఇంకా తొమ్మిది పరుగులే దూరం.
ప్రపంచం నివ్వెరపోవడానికి రెడీ అయింది. బద్దలవదనుకున్న రికార్డు బద్దలుకాబోతోంది. రికార్డు పుస్తకాల దుమ్ము దులిపి, ఆ రికార్డు ను కొట్టేసి, మన బ్యాట్స్ మన్ రికార్డు రాయడానికి అంతా రెడీ.
అప్పుడు రాజు గారికి కోపం వచ్చింది.
ఆయన పేరు హిజ్ హైనెస్ ఠాకూర్ సాహెబ్ ఆఫ్ రాజ్ కోట్. ఆయన మహారాజు. కఠియవాడ్ టీమ్ కి కాప్టెన్ కూడా. 'లగాన్' లో రాజుగారిలా తెల్లోళ్ల పక్కన కూచున్నా నల్లోళ్లకే మద్దతుపలికిన రాజు కాదాయన. నల్లోళ్ల టీమ్ కి కాప్టెన్ గాఉన్నా తెల్లోళ్ల రికార్డు బద్దలైతే ఎలా అన్న భయం ఆయనది.
"చాలా సేపు ఫీల్డింగ్ చేశాం. ఇకపై ఫీల్డింగ్ చేసే ఓపిక నాకింక లేదు. ఇన్నేసి రన్స్ కొట్టేశారు కదా... ఇకపై ఇన్నింగ్స్ డిక్లేర్ చేయండి" అని హుకుం జారీ చేశారు రాజుగారు.
"రాజా వారూ... ఓ తొమ్మిది రన్స్ కొట్టేశాక డిక్లేర్ చేస్తాం," అన్నారు మహారాష్ట్ర కాప్టెన్ రాజా గోఖలే.
"కుదరదు... కుదరదంతే" అన్నారు పంతం పట్టిన రాజు గారు.
ఆయన ఆలోచన వేరు. స్కోరు 912 అయింది. ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. ఎవరిమీద స్కోర్ చేశారు? కఠియవాడ్ పై. ఆ బ్యాట్స్ మన్ బ్రాడ్మన్ రికార్డు బద్దలుగొడితే ఎవరి మీద స్కోరు చేశారు? కఠియవాడ్ మీద. కఠియవాడ్ కి ఇంత అవమానమా? కాప్టెన్ మహారాజు గారికి ఇంత అప్రదిష్టా?
రాజు గారు "మాకు బోరు కొట్టి మేం మ్యాచ్ వదులుకుంటున్నాం" అని ప్రకటించి టీమ్ ను తీసుకుని ఫీల్డు వదిలేశారు.
మన బ్యాట్స్ మన్ ప్రపంచ రికార్డుకి తొమ్మిది పరుగుల దూరంలో ఆగిపోయాడు.
ఆ బ్యాట్స్ మన పేరు భావూ సాహెబ్ బాబాసాహెబ్ నింబాల్కర్. ఆయన్ను అభినందిస్తూ డాన్ బ్రాడ్మన్ లేఖ వ్రాశాడు. నా ఇన్నింగ్స్ కన్నా నీ ఇన్నింగ్సే గొప్ప అన్నాడు.
డాన్ బ్రాడ్మన్ కి ఉందీ, మహారాజుగారికి లేనిదీ ఏమిటో విడిగా చెప్పుకోనక్కర్లేదు.
ఇప్పుడు గుజరాత్ నుంచి తెల్లగడ్డం ఆయన ఒకరు రికార్డు బద్దలుగొట్టేస్తారేమోనన్న భయంతో దేశాన్ని యాభై ఏళ్లు రాజుల్లా పాలించిన హిజ్ అండ్ హెర్ హైనెస్ లు రాజ్యసభలో ఇలాగే "బోరుకొట్టి" కాలక్షేపం చేస్తున్నారు. రాజరికం ఇంకా పోలేదు మరి.
అయితే వాళ్లకి తెలియని విషయం ఒకటుంది. ఈ నింబాల్కర్ మాత్రం అంత తేలిగ్గా మైదానం వదిలే మనిషి కాడు మరి!
Good information, sir! Thanks for sharing.
ReplyDelete