కైలాసం....
విష్ణుమూర్తి, శివుడు ఏవో సుదీర్ఘ మంతనాల్లో ఉన్నారు.
బయట గరుత్మంతుడు, నంది కూర్చుని ఉన్నారు.
"కైలాసం నిజంగా మనోహరం...ఇక్కడకు చేరుకోవడం ఎన్నో జన్మాల పుణ్యం తప్ప మరేమీ కాదు," అనుకున్నాడు గరుత్మంతుడు. అంతలో అతనికి కైలాస శిఖరి ప్రవేశ ద్వారం పై ఓ బుల్లిపిట్ట కనిపించింది. దాన్ని చూసి ఇంత చిన్న పిట్ట .... చిట్టిచిట్టి రెక్కల చిన్ని పిట్ట.... ఈ కైలాసం కొండ శిఖరంపైకి చేరడానికి ఎంత కష్టపడి ఉంటుందో కదా...." అనుకున్నాడు. దాని పట్ల గరుత్మంతుడి ప్రేమ వెల్లువెత్తింది....
అంతల్లో కైలాసం మెట్లు ఎక్కుతూ యముడు కనిపించాడు. యముడి కళ్లు ఆ బుల్లిపిట్టపై పడ్డాయి.
యముడి కళ్లలో ఆశ్చర్యం...పక్షి కళ్లలో భయం
ఈ రెండూ గరుత్మంతుడి కళ్లలో పడ్డాయి.
అంటే యముడు ఆ పిట్ట ప్రాణాలను తనతో తీసుకెళ్తాడా? ఇంత కష్టపడి కైలాసం చేరుకున్న పక్షికి అంతలోనే అన్నీ అయిపోతున్నాయా? గరుత్మంతుడి మనసు మనసులో లేదు.
"ఓ గంటలో కలుసుకుందాములే" అనుకున్నాడు యముడు ఆ పక్షికేసి అదోలా చూస్తూ.... ఆ తరువాత ఆయన శివకేశవులను కలుసుకునేందుకు లోపలికి వెళ్లిపోయాడు.
యముడు బయటకు వచ్చేలోగా పక్షిని వీలైనంత దూరం తీసుకెళ్లాలి.
ఎలా? ఎలా? ఎలా?
గరుత్మంతుడికి ఆలోచన వచ్చింది. " యముడు వచ్చేలోగా సుదూర వింధ్య పర్వత శ్రేణులపై ఈ పక్షిని నేను ఎత్తుకెళ్లి దిగబెట్టి వస్తాను. అప్పుడు ఇది బతికిపోతుంది," అనుకున్నాడు.
గరుత్మంతుడు తన రెక్కల మధ్య అతి జాగ్రత్తగా పొదివిపట్టుకుని, వెచ్చదనాన్ని కల్పిస్తూ ఆ పిట్టను వింధ్యపర్వతం తీసుకెళ్లి అక్కడ దిగబెట్టాడు. ఆ తరువాత మళ్లీ కైలాసానికి వచ్చేశాడు.
ఓ అల్పప్రాణికి ప్రాణదానం చేసిన తృప్తి గరుత్మంతుడి ముఖంలో తొణికిసలాడింది.
అంతలో యముడు బయటకు వచ్చాడు.
"యమధర్మరాజా! ఇందాక బుల్లిపిట్టని అదోరకంగా చూశావెందుకు?" అని అడిగాడు.
"ఆశ్చర్యం కదూ... నేను కొంచెం సేపట్లో దాన్ని వింధ్య పర్వతాల్లో కలుసుకోవాలి. అక్కడ దాని ప్రాణాలు తీయాలి. ఎక్కడి కైలాసం, ఎక్కడి వింధ్య.... ఈ అల్పప్రాణి అంత దూరం ఎలా వెళ్తుందో కదా అని జాలిపడ్డాను. అందుకే దాన్ని అలా చూశాను," అన్నాడు యముడు.
గరుత్మంతుడి నోట మాట రాలేదు. ఆ బుల్లి పిట్టని తన చేతులతో తానే స్వయంగా మరణవేదిపై వదిలి వచ్చాడా?
ఓ అల్పప్రాణి ప్రాణం తీసిన బాధ గరుత్మంతుడి ముఖంలో పొరలు పొరలై కదలాడింది.
ఇంతకీ గరుత్మంతుడు ఆ బుల్లిపిట్టకి ప్రాణం పోశాడా... ప్రాణం తీశాడా?
మోక్షం ఇచ్చాడు!
ReplyDelete