ఆ శిష్యుడి సందేహాలు అనంతం.
శిష్యుడు "గురూజీ... ఈ ప్రపంచం ఇన్ని కష్టాల మయం కదా... ఇక్కడ అనుక్షణం పోరాటమే. మనం చెప్పే మాటలు మంచివే అయినా వినేదెవరు? విన్నా స్వీకరించేదెవరు? స్వీకరించినా సారోగతం చేసుకునేవారెవరు? సారోగతం చేసుకున్నా ఆచరించే వారెవరు?" అన్నాడు.
గురువు చెట్ల ఆకులు నెమ్మదిగా కదలాడినట్టు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.
కాస్సేపాగి... "నాయనా... నాకు పరిశుభ్రమైన నీరు చెరువు నుంచి తీసుకురా" అన్నారు.
శిష్యుడు చెరువు దగ్గరకి వెళ్లాడు.
అక్కడ పిల్లలు నీళ్లలో దూకులాడుతున్నారు. నీళ్లంతా మురికి మురికిగా ఉంది.
"గురూజీ... నీళ్లు బాగా మురికిగా ఉన్నాయి."
గురువు "నాకు దాహంగా ఉంది. శుభ్రమైన నీరు తీసుకురా" అని మళ్లీ చెప్పారు.
శిష్యుడు మళ్లీ వెళ్లాడు....ఈ సారి కొందరు ఆ నీళ్లలో గేదెల్ని కడుగుతున్నారు.
కానీ శిష్యుడు కాస్సేపు అక్కడే నిలబడ్డాడు. గొల్లలు తమ గొడ్లను తీసుకువెళ్లిపోయారు. కాస్సేపటికి దుమ్ము అడుగుకి చేరింది. చెరువు నీరు పైన తేటగా, పరిశుభ్రంగా తయారైంది. శిష్యుడు ఆ నీటిని తీసుకుని గురువు గారికి ఇచ్చాడు.
"ఏం నాయనా... ఈ సారి శుభ్రమైన నీరు ఎలా దొరికింది?"
"ఈ సారీ గేదెల్ని ఆ నీళ్లలోనే కడిగారు. కానీ కాస్సేపు ఆగితే దుమ్ము, చెత్త అడుగుకి పోయి, నీరు శుభ్రంగా తయారైంది గురూజీ"
"చూశావా నాయనా.... మనుషులు ఈదులాడినా, గేదెలకు స్నానం చేయించినా కొంచెం ఓపిక పడితే దుమ్ము కిందకి వెళ్తుంది. కష్టాలు కూడా అంతే. ఇంకో సంగతి ఏమిటంటే సమాజంలో మార్పు తేవాలనుకుంటున్న మనం కాస్త ఓపిక పట్టాలి. నీరు తేటపడేదాకా ఓపికపట్టినట్టే ఓపిక పట్టాలి. అప్పుడే మనం కోరిన మార్పు వస్తుంది."
శిష్యుడు గురువు పాదాలపై ప్రణమిల్లాడు.
వ్యర్థమనేదే లేదు....
శిష్యుడు కొత్తగా ఆశ్రమంలో చేరాడు.
గురువు అతడిని పలకరించారు.
"ఎలా ఉంది నాయనా ఆశ్రమ జీవితం?"
"చాలా బాగుంది గురువు గారూ. ఒక్కటే సమస్య. రాత్రిళ్లు బాగా చలిగా ఉంది. ఉన్న దుప్పటి చినిగిపోయింది. ఒక కొత్త దుప్పటి ఇప్పించండి."
గురువుగారు శిష్యుడికి ఒక కొత్త దుప్పటిని ఇప్పించారు. కొన్నాళ్ల తరువాత శిష్యుడు మళ్లీ ఎదురుపడ్డాడు.
"ఎలా ఉంది?"
"చాలా హాయిగా ఉంది. వెచ్చగా హాయిగా నిద్ర పడుతోంది" అన్నాడు గురువుగారు.
"మరి చినిగిపోయిన దుప్పటిని ఏం చేశావు?"
"చలి రాకుండా కింద పక్క గా వేసుకుంటున్నాను."
"మరి అక్కడున్న కంబళీ ఏమైంది."
"దాన్ని కిటికీకి పరదాగా కప్పేశాను. చలి గాలి రాకుండా ఉంటుంది."
"బాగుంది. అయితే పరదా గుడ్డను ఏం చేశావు? "
"దాన్ని వంట గదిలో పొయ్యి మీద నుంచి గిన్నెలు దింపేందుకు ఉపయోగిస్తున్నాను."
"మరి అక్కడ అంతకు ముందేఉన్న మసిగుడ్డ ఏమైంది?"
"దాన్ని బూజు దులిపే కర్రకు కట్టి ఇల్లు శుభ్రం చేస్తున్నాను."
"బాగుంది. ఇంతకు ముందున్న బూజు దులిపే పీలికలేమయ్యాయి?"
"అవి ఇంకెందుకూ పనికిరాకుండా పోయాయి. అందుకే వాటిని పొయ్యిలోవేసి కాల్చేశాను. ఆ వేడి సాయంతోనే ఇవాళ్ల మీ స్నానానికి నీళ్లు కాచాను."
శెభాష్... అంటూ గురువు గారు ముందుకు సాగిపోయారు.
ప్రతి దాన్నీ చివరి వరకూ ఉపయోగించాలి. దేన్నీ వృథాగా పారేయకూడదు. దీన్నే ఈ రోజుల్లో "రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్" అంటున్నాం.
very very nice sir ..... i dont know what it is ment to others the first story made tears in my eyes , the problem iam facing becoming sad and over thinking for every stupid problem.... please to share these things with us we really require them
ReplyDelete