ఒక పద్మభూషణ్ తో రెండు రోజులు - Raka Lokam

ఒక పద్మభూషణ్ తో రెండు రోజులు

Share This





"నీకు పద్మభూషణ్ పొందిన వ్యక్తిని కలిసే భాగ్యాన్ని కల్పిస్తున్నాను. ఆయన సుప్రసిద్ధ ఆర్కియాలజిస్టు. ఒకరోజు తేజ్ పూర్ లో ఉంటారు. ఆయన్ని బాగా చూసుకో. ఒక చరిత్ర ప్రొఫెసర్ ఆయనతో ఉండి తేజపూర్ లోని పురావస్తు కట్టడాలన్నీ చూపించేలా ఏర్పాటు చేయి."
ఇదీ నాకు వచ్చిన ఆదేశం.
అది 1985.
అప్పట్లో నేను అస్సాంలోని తేజపూర్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా పనిచేస్తున్న రోజులు.
మరి ఆయన్ని గుర్తు పట్టడం ఎలా?
"చింపిరి జుట్టు, భుజాన రెండు మూడు బ్యాగులు, చేతిలో పుస్తకాలు, పెన్ను, ముక్కునుంచి జారిపోతున్న కళ్లద్దాలు, ఉల్టాపుల్టాగా గుండీలు పెట్టుకున్న చొక్కా, జిప్పు పెట్టుకోవడం మరచిన ప్యాంటు.... కానీ ముఖంలో ఏదో తెలియని వెలుగు....అరుణాచల్ రాజధాని ఈటానగర్ నుంచి వచ్చే బస్సునుంచి దిగిన వారిలో ఇలాంటి వారెవరైనా ఉంటే ఆయనే మన పద్మభూషణ్ " ఇవీ నాకు అందిన క్లూలు.
అనుకున్న రోజున ఆయన వచ్చారు. గుర్తించడం ఏమీ కష్టం కాలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన వివరణ అక్షరాలా సత్యం. ఆయన్ని రిక్షాలో ఆర్ ఎస్ ఎస్ కార్యాలయానికి తీసుకువచ్చాను.
క్షణాల్లో ఆయన తయారైపోయారు.
ఆయన కోసం తారాప్రసాద్ సైకియా అనే హిస్టరీ ప్రొఫెసర్ గారి ఇంట్లో టిఫిన్ ఏర్పాటు చేయించాను.... ఆయన కారులోనే గుప్త యుగం నాటి డా పర్బతీయా ద్వారబంధం, ప్రాచీన మందిరం, హటకేశ్వర మందిరం, మహాభైరవ మందిరం, అగ్నిగఢ్, హజారపుఖురీ వంటి చారిత్రిక ప్రదేశాల సందర్శనకు ఏర్పాటు చేశాను.
మన పద్మభూషణ్ గారు ఒక రకమైన ఉన్మాదంలో ఉన్నట్టు అనిపించింది. మన మధ్యే ఉన్నా మనతో లేరన్నట్టు ఉంది ఆయన ప్రవర్తన. ఒక క్షణం పసిపిల్లాడిలా... మరో క్షణం వెర్రిబాగుల వాడిలా... ఇంకో క్షణం దారి తప్పిన వాడిలా... ఆయన కనిపించారు.
ఆయన ఆకారాన్ని చూడగానే తారాప్రసాద్ సైకియా ముఖం చిట్లించారు. కానీ ముందుగానే బేరం ఒప్పుకున్నారు. కాబట్టి చేసేదేమీ లేక ఆయన్ని కారులో తీసుకువెళ్లారు. దారిలో తారాప్రసాద్ సైకియా అస్సాం చరిత్ర గురించి, తేజ్ పూర్ ఐతిహ్యాన్ని గురించి ఇంగ్లీషులో చెబుతున్నారు. మన ఆర్కియాలజిస్టు "మీపిల్లలెందరు? ఏం చదువుతున్నారు?" వంటి ప్రశ్నలను హిందీలో వేస్తున్నారు.
ఈయన నిజంగానే పద్మభూషణ్ గ్రహీతేనా అని నాకు అనుమానం వచ్చేసింది. అది పెనుభూతమైపోయింది.
గుప్తయుగం నాటి డా పర్వతియా మందిరం తాలూకు అవశేషాల దగ్గరికి తీసుకువెళ్లాం. అక్కడ గుప్త యుగం నాటి మందిరం తాలూకు ద్వారబంధం ఒకటి చెక్కు చెదరకుండా ఉంది. తారాప్రసాద్ సైకియా తాను తయారుచేసుకున్న విస్తృత రిపోర్టు చదివి, ఆ ద్వార బంధం గురించి వివరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అంతలో మన పద్మభూషణ్ గారు మంత్రముగ్ధుడిలా కారు దిగేసి నడుచుకుంటూ అవశేషాల వైపు కదలిపోయారు.
ఆయన నోటి నుంచి దండకంలా ఆ గుప్త యుగ చిహ్నాల వర్ణన వెలువడుతోంది.
తారాప్రసాద్ సైకియా నా చేయిని హఠాత్తుగా వెనక్కి లాగాడు.
ఆయన కళ్లు సంభ్రమంతో పెద్దవైపోయాయి.
చేతులు వణుకుతున్నాయి.
"ఇదిగో చూడు..." అంటూ తన నోట్ నాకు అందించాడు.
ఆశ్చర్యం. ఆ నోట్ లో ఉన్న వాక్యాలనే, అదే వరుసలో, అదే వివరణతో ఆర్కియాలజిస్టు గారు చెబుతూ వెళ్తున్నారు.
"ఈయన సామాన్యుడు కాడు... మహా పండితుడు..." అన్నాడు తారాప్రసాద్ అదో రకమైన తన్మయత్వంతో. అంతే ఆయన తన నోటును మడిచి కారులో పారేశాడు. చేతులు కట్టుకుని ఆయన వెనుక శిష్యుడిలా నడిచాడు.
ఆర్కియాలజిస్టు గారు సంచీలోనుంచి తన కెమెరాను తీసి కట్టడాల ఫోటోలు తీస్తున్నారు. ఆ కెమెరా అప్పట్లో అత్యాధునిక కెమెరా. దేశంలో ఒక వంద రెండొందల మంది దగ్గరే అలాంటి కెమెరా ఉంటుంది.
ఆర్కియాలజిస్టు గారు ఏవేవో చెబుతూనే ఉన్నారు. గుప్త యుగపు కట్టడాల ప్రత్యేకతల గురించి వివరిస్తూనే ఉన్నారు.
ఆ తరువాత దగ్గర్లోనే కేతకీబారీ ప్రాంతంలో ఉన్న హటకేశ్వర మందిరం దగ్గరికి తీసుకువెళ్లాం. పధ్నాలుగు అడుగుల భారీ శివలింగం అది.
మన పద్మభూషణ్ గారు సంచీలోనుంచి పెన్ను, స్క్రాప్ బుక్ తీసి ఆ శివలింగం బొమ్మ, గుడి బొమ్మ క్షణాల్లో గీసేశారు. ఆ గీత చూస్తే ఆయనెంత గొప్ప చిత్రకారుడో అర్థమైపోతుంది.
"మీరు బొమ్మల్ని బాగా వేస్తారు" అన్నాడు తారాప్రసాద్ సంభ్రమాశ్చర్యాలతో.
"నేను పారిస్ లో ఆర్కియాలజీ కోర్సు చేసేందుకు వెళ్లినప్పుడు రోజూ సాయంత్రం టూరిస్టుల బొమ్మలు గీసి డబ్బు సంపాదించేవాడిని. దాంతోనే చదువుకున్నాను." అన్నారు ఆర్కియాలజిస్టుగారు చాలా మామూలుగా.
"అంటే మీరు పారిస్ వెళ్లారా?" ఉండబట్టలేక అడిగేశాను.
"నేను ప్రపంచమంతా తిరిగాను. నేను వెళ్లని దేశం లేదు" అన్నారాయన.
మరోసారి షాక్ తిన్నాం.
తారాప్రసాద్ ఆయనకు పూర్తిగా సరెండరైపోయారు.
రాత్రి ఒకే గదిలో ఆర్కియాలజిస్టు, నేను పడుకున్నాం. ఆయన ఆర్యద్రవిడ సిద్ధాంతం, దాశరాజ్ఞ యుద్ధం వంటి ఎన్నెన్నో చారిత్రిక ఘట్టాల గురించి అలా అలా అలవోకగా చెబుతూనే ఉన్నారు. ఆయన జ్ఞానం ముందు పూర్తిగా తలవంచాను.

***
మరుసటి రోజు ఆయన నాతో అన్నారు...
"డా పర్వతియా నుంచి దూరంగా కొన్ని కొండలు కనిపించాయి. ఆ కొండలు నన్ను పిలిచినట్టనిపించింది. అక్కడేదో తప్పక దొరుకుతుంది. ఇవాళ్ల అక్కడికి వెళ్దాం."
ఆ రోజు తారా ప్రసాద్ సైకియా ఉండరు. ఆయన కారూ అందుబాటులో ఉండదు.
"ఫరవాలేదు ... రెండు సైకిళ్లు ఏర్పాటు చేయి. మనిద్దరం వెళ్దాం" అన్నారాయన.
పద్మభూషణ్ అవార్డీ... ప్రపంచ ప్రఖ్యాత ఆర్కియాలజిస్టు...
అయినా ఆయన సైకిలు తొక్కారు. 75 ఏళ్ల మనిషి... అయినా అమ్మా అబ్బా అనలేదు.
అసలేమిటీ మనిషి?
ఈయనకు కారు, సైకిలు సమానమే.
నిన్న ఎలా నవ్వుతూ ఉన్నారో... ఇప్పుడూ అలాగే నవ్వుతున్నారు....
కొండ ఎక్కే ముందు సైకిల్ తెలిసిన వాళ్లింట్లోపెట్టేందుకు వెళ్లాం. ఆ ఇంట్లో కాలేజీలో చదివే అమ్మాయి ఉంది. ఆమె మాకు టీ పెట్టి ఇచ్చింది. ఆమె టీ తెచ్చేవరకూ ఈయన ఏదో రాసుకుంటున్నారు.
"నువ్వు మాకు టీ ఇచ్చావు. మరి నీక్కూడా నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా " అంటూ ఒక కాగితం ఆమెకు ఇచ్చారు.
ఆ అమ్మాయి ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేసింది. నోరు అలాగే తెరుచుకుని ఉండిపోయింది. ఈ సంఘటన జరిగి దాదాపు 30 ఏళ్లయినా ఆ ఆశ్చర్యం కట్టలు తెంచుకున్న ఆ అమ్మాయి ముఖం నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది. ఏమిటా అని నేనూ ఆ కాగితంలోకి తొంగి చూశాను.
అది ఆ అమ్మాయి స్కెచ్. స్కెచ్ పెన్ తో వేసింది. పెన్సిలు, షేడ్లు ఏమీ లేకుండా మామూలు గీతలు... కానీ అద్భుతమైన బొమ్మ....
బొమ్మ అమ్మాయిలా ఉంది...
కాదు కాదు అమ్మాయి ఆ బొమ్మలా ఉంది.....
నేనూ ఆ చిత్రకళా నైపుణ్యానికి నోరెళ్లబెట్టాను.
ఆయన టీ తాగే సరికి అయిదారుగురు అమ్మాయిలు బిలబిలమంటూ వచ్చారు. నా బొమ్మ కూడా వేయమన్నారు. ఆయన ఓపిగ్గా వారి పేర్లు, ఏం చదువుతున్నారు వంటి వివరాలు అడుగుతూ బొమ్మలు వేసిచ్చారు.
"మన కళలు, నైపుణ్యాలు సమాజాన్ని మనతో మమేకం చేసుకునేందుకు ఉపయోగపడాలి" అన్నారాయన. ఆయనకు మనసులోనే నమస్కరించాను.

***

ఆయన ఓపిగ్గా కొండపైకి ఎక్కారు. గంటల పాటు తిరిగారు. ఏవేవో కుండ పెంకులు వెతికి ఇవన్నీ పాత రాతియుగం నాటివని వివరించారు.
ఆశ్చర్యం...
చిన్న పిల్లల దగ్గర చిన్నపిల్లాడు...
పండితుల దగ్గర మహాపండితుడు...
ఆర్కియాలజీ ప్రస్తావన వస్తే అపర ఋషి...
ఆరెస్సెస్ ప్రస్తావన వస్తే అత్యంత వినమ్రుడు...
తనదంటూ ఏమీ లేదు... అందరూ తన వాళ్లన భావన...
అన్నీ ఉన్నా తొణకని నిండుకుండ...
ఆయన పట్ల నా గౌరవం క్షణక్షణానికి పెరిగిపోతోంది.

***

ఆ రాత్రి నేను హోటల్ లో భోజనం చేద్దామన్నాను.
"హోటల్ ఎందుకు> మనమే వండుకుందాం"
"నాకు వంట రాదు"
"నేను వండుతాను...."
ప్రపంచాన్నంతా తన పాదాల ముందు మోకరిల్లచేసుకునే ఆ ప్రఖ్యాత ఆర్కియాలజిస్టు నాకు ఖిచిడీ వండిపెట్టారు. కూరలు తరుగుతూ మన చరిత్రపై ఆంగ్లేయుల కుట్ర నుంచి మార్క్సిస్టుల మోసం దాకా ఎన్నో వివరాలు చెప్పారు.
ఖిచిడీ మహాద్భుతంగా వచ్చింది.
"మనకు అత్యంత పవిత్రమైన నదుల్లో గంగ, యమున, సరస్వతి ఉంది. ఆ సరస్వతి వేద కాలపు నది. అదిప్పుడు లుప్తమైపోయింది. దాన్ని పునరుద్ధరించేందుకు సాటిలైట్ ఇమేజరీతో ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నాం. అది సఫలమైతే గుజరాత్, రాజస్థాన్ లోని కరువు పీడిత ప్రాంతాలు కూడా సస్యశ్యామలమైపోతాయి." అన్నారాయన.
ఆయన ఒక భవిష్యద్రష్ట లాగా కనిపించారు నాకు.
"రేపు మీరెక్కడికి వెళ్తారు"
"నేను గువహటి వెళ్తాను. అక్కడ నుంచి నా సొంత ఊరు ఉజ్జైన్ వెళ్తాను. అక్కడ నుంచి వారం తరువాత సింగపూర్ వెళ్తాను. అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యప్రసంగం చేయాలి"
ఆయన మరుసటి రోజు వెళ్లిపోయారు.

***

ఒక వారం పది రోజుల తరువాత వార్త వచ్చింది.
సింగపూర్ లో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాక రాత్రి ఆయనకు గుండె పోటు వచ్చింది. క్షణాల్లో అంతా అయిపోయింది.

***

నాతో సైకిల్ పై తిరిగి, నాకు ఖిచిడీ వండిపెట్టి, అమ్మాయిల బొమ్మలు గీసి, చిరునవ్వు చెదరనీయకుండా రెండు రోజులు గడిపిన ఆ వ్యక్తి పద్మభూషణ్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్. ప్రపంచ ప్రఖ్యాత భీమబేట్కా రాక్ పెయింటింగ్స్ ను కనుగొన్న వ్యక్తి ఆయన. భారతీయ ఇతిహాససంకలన సమితి, సంస్కార భారతి వంటి సంస్థలకు అధ్యక్షుడుగా పనిచేసిన మహా శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఆయన.
అపారజ్ఞానం, అద్భుత భక్తి, అసమాన వైరాగ్యాల కలబోతగా వాకణ్ కర్ జీ నాకు కనిపించారు. నాలోని అన్ని నైపుణ్యాలకూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘమే కారణం అని అత్యంత వినమ్రంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. ఆయన తన ఇంటిని సంస్కార భారతికి రాసి ఇచ్చేశారు. అంతటి సమర్పణా భావం ఆయనది.
ఎమర్జెన్సీ లో ఆర్ ఎస్ ఎస్ పై నిషేధం ఉన్న సమయంలో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఆయనకు ఆర్ ఎస్ ఎస్ వ్యతిరేక పచ్చి నియంత ఇందిరాగాంధీ పద్మశ్రీ నిచ్చింది.
ఆ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆయన ఆర్ ఎస్ ఎస్ నల్ల టోపీని వేసుకువెళ్లారు. నియంతను సైతం వెక్కిరించగలిగే మొండిధైర్యం ఆయనది.




***

అన్నట్టు...
ఇప్పుడిప్పుడే సరస్వతీ నది మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. రాజస్థాన్ లో అది ఇప్పుడు చిన్న కాలువలా ప్రవహిస్తోంది. వాకణ్ కర్ జీ చెప్పినట్టు త్వరలో రాజస్థాన్ ఎడారి సస్యశ్యామలం అయి తీరుతుంది.

6 comments:

  1. మీ అనుభవం అద్భుతం...మీ వర్ణన అసమానం... వ్యాసం మొదలు పెట్టిన దగ్గరినుంచీ ఆద్యంతమూ ఉత్సుకతతో చదివించారు... ఎప్పటికైనా నిండుకుండ తొణకదు.. పద్మ భూషణుడైనా...మీరైనా!!!!..

    ReplyDelete
  2. Thanks sir... for all your encouragement and kind words. I watched both the videos that you had made - on Bhongir and the other one. They were very good. By the way, your voiceover was good. Regards


    Raka

    ReplyDelete
  3. Excellent write up thanks for letting us know about a legend. This blog is very inspiring keep writing such nice articles.

    ReplyDelete
  4. excellent sudhakar garu,we really feel like dwarfs when we get to know about this kind of people

    ReplyDelete
  5. What an amazing way of explaining things..Marvelous!

    ReplyDelete

Pages