జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్ర - Raka Lokam

జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్ర

Share This







జనసాగరం నడుమ జగన్నాథుని జయయాత్ర ను వర్ణించడానికి .....
మాటలు మూగవవుతాయి....
విశేషణాలు వెలవెలబోతాయి....
మేథస్సు అశక్తమవుతుంది.....
అభివ్యక్తి అవ్యక్తమవుతుంది......
పూరి జగన్నాథ మందిరం లో సర్వం జగన్నాథమే.....అంతా జగన్నాయకుని జగన్నాటకమే.....
గుడిలోని దేవుడు గుడిని వదిలి గుండెల్లో ప్రవేశించే మహా సంరంభమే జగన్నాథ రథయాత్ర.......
మట్టీ రాళ్ల మందిరాన్ని వదిలి మనందరి మనసు మందిరాల్లోకి మహా విష్ణువు వచ్చే మహాద్భుత దృశ్యమే జగన్నాథ రథయాత్ర.....
జనం కోసం జేజ తానే కదలి మానవ మహా సాగర తీరాన మహోదాత్త యాత్ర జరిపే మహా ఘట్టమిది.....
పతిత పావనుడు ప్రజా బాట పట్టిన పావన క్షణం ఇది......పాపాలు కడిగేసే పుణ్య ఘడియ ఇది.....

ఏడాదికొకసారి ఆషాఢ మాసాన జగన్నాథుడు, బలభద్రుడు,సుభద్ర పూరి శ్రీమందిరాన్ని వదలి....
రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి తరలి వెళ్తాడు....
అందుకే ఇది గుండీచా యాత్ర....
ఆనందోత్సవాలతో సందోహ సంరంభాలతో జరుగుతుంది....
అందుకే ఇది ఘోష యాత్ర...
తొమ్మిది రోజుల పాటు దేవదేవుడు గుడిని వదలి ఉంటాడు...
అందుకే ఇది నవదిన యాత్ర....
అయిదో శతాబ్దంలో చైనా యాత్రికుడు ఫాహియాన్‌ అబ్బురపడి చూసిన యాత్ర ఇది....
ఇంగ్లీష్‌ డిక్షనరీలోకి జగ్గరనాట్‌ అన్న పదాన్ని చేర్చిన యాత్ర ఇది.....
యుగాలుగా సాగుతున్న యాత్ర ఇది....




యాత్రలో మూడు రథాలుంటాయి...
ఎడమ వైపు జగన్నాథుడు....ఆయన రథం పేరు నందిఘోష
దీనికి పద్ధెనిమిది చక్రాలు....ఇది 23 గజాల ఎత్తు....
ఈ రథంపై అలంకరించే వస్త్రంపై ఆకుపచ్చ నామం ఉంటుంది....
కుడి వైపు బలభద్రుడు....ఆయన రథం తాళధ్వజం.... ఎత్తు 22 గజాలు...దీనికి 16 చక్రాలు....
దీనికి కప్పేది....పసుపు రంగు వస్త్రం
ఇద్దరన్నల మధ్య ముద్దుల చెల్లెలు సుభద్ర దర్పదళన అనే రథంలో....దీనికి 14 చక్రాలు....ఇది 21 గజాల ఎత్తు....

ఈ యాత్రలోని ప్రతి ఘట్టానికి ప్రత్యేకత ఉంది...
రథాన్ని తయారు చేసే ప్రక్రియను రథ ప్రతిష్ఠ అంటారు....
రథ యాత్ర మార్గాన్ని బడ దండ అంటారు....
రథాలపై రెపరెపలాడే జెండాలను పావన బానా అంటారు.
ఉత్సవ విగ్రహాలను ముందు దక్షిణ ముఖులుగా తెచ్చి సింహద్వారం దగ్గర ఉత్తర ముఖులు చేస్తారు.
రథాన్ని తయారు చేయడానికి అరవై మంది వడ్రంగులు పనిచేస్తారు...
రథంపై వేసే అలంకరణ వస్త్రాన్ని చాంద్వా అంటారు.
రథానికి పన్నెండు వందల మీటర్ల చొప్పున అలంకరణ వస్త్రాన్ని 14 మంది దర్జీలు కుడతారు.
రథంపై దారు స్తంభాలపై పెయింటింగ్‌, అలంకరణలు, దారు శిల్పాలు, వెండి, కంచు తొడుగులు ...ఇలా వివిధ రకాల అలంకరణలుంటాయి....
రథయాత్రలో వివిధ సేవలందించే వారిని దైతపతులు అంటారు. సేవలు చేసేందుకు చిన్న పిల్లల నుంచీ, పండు ముసళ్ళ దాకా వేలాది మంది శిక్షణ పొందుతారు.
రథ యాత్రకు ముందు యాత్రా మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఛెరాపహరా అంటారు....
రథాన్ని లాగడాన్ని రథ తానా అంటారు





దేవుడు అన్నిటికీ మౌన సాక్షి అని రుజువు చేస్తున్నట్టు
కళ్లు మాత్రమే ఉండి...కాళ్లు చేతులు లేని విచిత్ర దారు మూర్తులు ...పూరిలో దేవతా మూర్తులు....
ఆ కళ్ళు తాను అందర్నీ సమానంగా చూస్తానని చెబుతున్నట్టుంటాయి....
ఆ సమానతా సందేశాన్ని ఇవ్వడానికే దేవుడు జనంలోకి వచ్చాడు....

అంతే కాదు....
ఇక్కడ పూరి మహారాజు జగన్నాథుని ప్రథమ సేవకుడవుతాడు.....
రథయాత్రా మార్గమంతా చీపురుతో ఊడుస్తాడు....
కళ్ళాపి జల్లుతాడు....
మంగలి ప్రసాదం తయారు చేస్తాడు....అదీ మట్టి పాత్రల్లో...
ఆ ప్రసాదమే అందరూ తినాలి...అసహ్యించుకోకూడదు...
జగన్నాథ్‌కీ భాత్‌....జగత్‌ పసారే హాత్‌.....న పూఛ్‌ జాత్‌పాత్‌ .....
జగన్నాథ ప్రసాదంలో జాతి భేదం లేదు....కుల భేదం లేదు....మత భేదం లేదు...
సంప్రదాయ భేదం లేదు....ఉపాసనా భేదం లేదు....
సర్వం జగన్నాథం....
జగన్నాథునికి అందరూ ఒక్కటే అనే సామాజిక సమరసతా సందేశాన్ని ఈ రథ యాత్ర అందిస్తుంది....
అందుకే ఇది అందరి పండుగ అయింది....
అందుకే ఇక్కడ భజనలు చేసేవారు....నృత్యాలు చేసేవారు....సేవలు చేసేవారు....
సర్వం మరిచి భక్తిపారవశ్యంలో తేలాడేవారు....
తదేకంగా నమస్కారం చేసేవారు....అందరూ కనిపిస్తారు...
నగరవాసీ, గ్రామ వాసీ, వనవాసీ కలగలిసి జగన్నాథుని సేవిస్తారు....





అంతే కాదు....రథయాత్రలో ఈ సామాజిక పరమైన అర్థమే కాదు....
ఆధ్యాత్మిక పరమైన పరమార్థమూ ఉంది....
ఆత్మానం రథం విద్ది....శరీరం రథమేవచ...
బుధ్ధింతు సారథిం విద్ది....మనా ప్రగ్రహమేవచ...
శరీరమే రథం.....రథాన్ని ఆరోమించేది ఆత్మ....
బుధ్ధి ఈ రథానికి సారథి....మనస్సే ఈ రథానికి పగ్గం....
అలా జగన్నాథ యాత్ర ఒక ఆధ్యాత్మిక యాత్ర....
ఒక మనో వికాస యాత్ర....
జీవాత్మ పరమాత్మల మహా మిలన యాత్ర....
ఆర్తితో చేతులు సాచిన భక్తుడికీ, ఆర్ద్రతతో చేతులు సాచిన భగవంతుడికీ మధ్య అనుసంధానమే ఈ జగన్నాథ రథయాత్ర...
అందుకే యుగాలుగా.....తరం తరం నిరంతరం....మానవుడున్నంతకాలం...
ఈ మహా యాత్ర కొనసాగుతూనే ఉంటుంది.....



No comments:

Post a Comment

Pages