అసలు మేక పెంపుడు జంతువెలా అయింది?
దీని వెనక చాలా పెద్ద కథ ఉంది.
ఒకప్పుడు అన్ని వన్యజంతువుల్లాగానే మేక కూడా ధన్య జంతువు. హాయిగా అడవుల్లో తిరుగాడుతూ ఉండేది. పచ్చిక మేసేది. లేలేత చిగురాకుల్ని నమిలేది.
ఒకనాడు వసంత వేళల చిగురాకుల లేత వాసన మేక ముక్కుకి వచ్చి తగిలింది. దానికి లాలాజలం ఊరింది. ఒక పొదలో దూరి ఆకుల్ని తెగ మేయసాగింది. మంచి భోజనం దొరికేసరికి పరిసరాల్ని మరిచిపోయింది.
అంతలో హఠాత్తుగా పులి గర్జన వినిపించింది.
"ఎవరది? ఏం చేస్తున్నారు?"
మేకకు వణుకు వచ్చేసింది.
నేను స్లా (ఆకులు) తింటున్నాను అనబోయి ఖ్లా (పులిని) తింటున్నాను అనేసింది.
పులి పొదలోకి కోపంగా చూసింది. పొదలోకి లంఘించి దూకబోయింది. కానీ ఆకుల మాటు నుంచి మేక గడ్డం అటు ఇటూ కదులుతూ కనిపించింది.
"బాబోయ్ ... ఇదేదో బలమైన జంతువు" అనుకుని పరుగు తీసింది. అక్కడినుంచి గుహలోనుంచి బయటికి వస్తే ఒట్టు. వచ్చినా నక్కి నక్కి వచ్చి, క్షణాల్లో నీళ్లు తాగి, ఓ చిట్టి జంతువుని నోట కరచుకుని గుహలోకి పరుగో పరుగు.
అయితే ఇంత జరిగినా మేకకు సంతృప్తి లేదు. బతికిపోయామన్న సంతోషం లేదు. భగవంతుడి దయ పట్ల కృతజ్ఞత లేదు.
ఎప్పుడూ ఏడుపే....
"దేవుడా నన్నింత బలహీనంగా ఎందుకు పుట్టించావు? నా అంత బలహీనుడు ఎవరూ లేరు. నన్ను నేను కాపాడుకోవడానికి కోరలను ఇవ్వలేదు. కొమ్ములను ఇచ్చినా వాటికి వాడి లేదు. ఏనుగుల్లా దంతాలూ తొండం లేదు. పులిలా గోళ్లు, పంజా లేదు. కోతిలా కొమ్మచ్చి ఆడలేను. పక్షిలా ఎగరలేను. చిన్న కుక్క పిల్ల కూడా నా పీక నొక్కి చంపగలదు..." ఇదే వరస...
ఓ రోజు వింత జంతువు భయంతో నక్కి నక్కి వెళ్తున్న పులికి ఈ గోడు వినిపించింది. బండరాయి మాటు నుంచి చూస్తే అదే మేకగడ్డం... అదే కదలిక...
దానికి తనపై తనకు సిగ్గు వేసింది. "ఇన్నాళ్లూ ఈ మేకను చూసినేను భయపడ్డానా? ఛీ .... ఇదేం బతుకు?" అని ఒక్క ఉదుటున మేకపై లంఘించి దూకింది. పీక కొరికి చంపేసింది. అప్పట్నుంచీ పులి మళ్లీ గర్జించింది. "నేనే రాజును" అని ప్రకటించుకుంది. దొరికిన మేకను దొరికినట్టు చంపడం మొదలుపెట్టింది. దాంతో పులి వేటనుంచి తప్పించుకునేందుకు మేకలు మనిషి దగ్గరికి వచ్చాయి. మేకకి పులి బాధ తప్పింది. కానీ మనిషి వాత పడింది.
మనిషి గడ్డైతే వేస్తున్నాడు కానీ గుంజకి కట్టేస్తున్నాడు.
పాక అయితే వేసి ఇచ్చాడు కాని, ఆకలేస్తే కోసుకు తినేస్తున్నాడు.
అల్లరి వేస్తే తోకకి టపాకాయలు కట్టేస్తున్నాడు.
మేక అడవిలోకి వెళ్లలేదు.
మనిషి వదిలిపెట్టడు.
అదీ మేక కథ.
మనందరం మేకలమే. కానీ మేకపోతు గాంభీర్యమైనా నటించాలి తప్ప "మే... మే..." అంటే సమస్యల పులులు పీక నొక్కేస్తాయి లేకపోతే పీకకు తాడు వేసి బిగిస్తాయి.
ఇంకో విషయం...
ఇది మేఘాలయలోని ఖాసీ తెగ జానపద కథ.
ఎంత గొప్ప కథ... ఎంత గొప్ప నీతి.....?
జానపదం నిజంగా జాణపదం....కాదంటారా?
ఇంకో రెండు విషయాలను కూడా మనం నేర్చుకున్నాం....
అవే స్లా ... ఖ్లా.....
చేతులుకాలాక "స్లా" ను పట్టుకుంటే లాభం లేదు.
అడవికి వెళ్లాక "ఖ్లా" అంటే భయపడకూడదు....
(ఫోటోలన్నీ మేఘాలయలోని ఖాసీ హిల్స్ అందాలు. ఫోటోలు ఆ అందాల్ని కొండని అద్దంలో కొంచెంగా చూపినట్టే చూపిస్తున్నాయి. రియాలిటీ ఇంకా బాగుంటుంది)
"మనందరం మేకలమే. కానీ మేకపోతు గాంభీర్యమైనా నటించాలి తప్ప "మే... మే..." అంటే సమస్యల పులులు పీక నొక్కేస్తాయి లేకపోతే పీకకు తాడు వేసి బిగిస్తాయి." ...... Excellent article..
ReplyDelete