యుగాల క్రితం ఈ రోజునే అతిథికి అన్నం పెట్టలేక కన్నీరు పెట్టుకున్న ద్రౌపదికి "కంగారు పడకు... ఈ పాత్రను నీకు ఇస్తున్నాను. ఇది అక్షయ పాత్ర. ఎంత మంది వచ్చినా వారి ఆకలి తీరుస్తుంది" అని కృష్ణుడు ఒక పాత్రను ఇచ్చాడు. తన కోసం కాక అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయడమెలా అన్నది నేర్పించాడు. ఈ రోజుల భాషలో చెప్పాలంటే ఆహారభద్రతకు తొలిపాఠం చెప్పిన రోజు ఇది.
ఈ రోజునే యుగాల క్రితం ఒక యుగాంతం అయి, కొత్త యుగారంభం జరిగింది. సత్యయుగం అంతరించి, త్రేతాయుగం మొదలైంది. దేవుడు మనిషిగా తిరిగిన రోజులు మొదలయ్యాయి. పెద్ద సామాజిక మార్పుకు బీజాంకురం పడ్డ రోజు ఇది.
యుగాల క్రితం దేవలోకంలో దేవతలు, భూలోకంలో మానవులకు ఆర్ధిక భద్రత కల్పించమని కోరుకుంటూ కుబేరుడు లక్ష్మీదేవిని పూజించింది ఈ రోజునే. ఆమె కుబేరుడి ధనాగారాన్ని నింపింది ఈ రోజునే. ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్థిక విప్లవానికి నాందీ ప్రస్తావన జరిగింది ఈ రోజునే.
యుగాల క్రితం ఈ రోజునే వ్యాసుడు మహాభారతాన్ని చెప్పుకుపోయాడు. గణేశుడు వ్రాసుకుపోయాడు. ఈ రోజునే గణేశ విద్య అంటే లిపిశాస్త్రం పుట్టింది. సమాజానికి అర్థమయ్యే భాషలో నీతి సూత్రాలను అందించేందుకు అతి గొప్ప సమాచార విప్లవం మొదలైంది ఈ రోజునే.
యుగాల క్రితం ఈ రోజునే ఆకాశమార్గంలో హాయిగా తిరుగుతున్న గంగమ్మను భువికి దించి, మృతులై ఉన్న అరవైవేల మంది సగర సుతులకు మోక్షం కల్పించారు. గంగావతరణం జరిగింది ఈ రోజునే. అంటే ప్రపంచంలో మొట్టమొదటి జలయజ్ఞం జరిగిన రోజు ఇది. ప్రపంచంలో మొట్టమొదటి నీటిపారుదల పథకం మొదలైంది ఈ రోజునే.
పేదరికం, దారిద్ర్యం, లేమితో కొట్టుమిట్టాడుతున్న కుచేలుడికి కృష్ణుడు అపర సంపదలను ఇచ్చిందీ ఈ రోజునే. ప్రపంచ చరిత్రలో అంత్యోదయ పథకం మొట్టమొదట అమలైంది ఈ రోజునే.
యుగాల క్రితం రాజులు అధికార మదంతో అంధులైపోతే, ప్రజల నుంచి పుట్టిన ఒకడు గొడ్డలితో దుర్మదాంధులను నరికేశాడు. గొడ్డలి అంటే పరశువును పట్టుకుతిరిగేవాడు కాబట్టి ఆయన పరశురాముడయ్యాడు. పరశురామ జయంతి ఈ రోజునే. ప్రజలే ప్రభువులను శాసించాలని చెప్పిన జనలోకపాలుడు పుట్టింది ఈ రోజునే. పాలన సంస్కరణలకు పునాదులు పడింది ఈ రోజునే. ప్రజాస్వామ్యం మొట్టమొదట రేకులు విచ్చుకున్నది ఈ రోజునే.
దేవభూమి ఉత్తరాంచల్ లో బదరీనాధ మందిరం తలుపులు తెరుచుకునేది ఈ రోజునే.
జగనాథ రథ నిర్మాణం మొదలయ్యేది ఈ రోజునే.
బృందావనంలో శ్రీకృష్ణుడి చరణ దర్శనం అయ్యేది ఈ రోజునే.
సింహాచలంలో వరాహ నరసింహుడికి చందనోత్సవం అయ్యేది ఈ రోజునే.
ఇన్నిన్ని గొప్ప పనులు జరిగాయి కాబట్టే ఈ రోజు అక్షయమని అంటారు. ఈ రోజు సూర్య, చంద్రులు సమాన ప్రకాశంతో వెలుగొందుతారు. అందుకే ఇది అక్షయ తృతీయ పండుగ రోజైంది. ఉత్తరాదిలో దీన్నే అఖ్ఖా తీజ్ అంటారు.
ఆహారభద్రతను మరిచిపోయాం.
సామాజిక విప్లవాన్ని మరిచిపోయాం.
ప్రజాస్వామ్యాన్ని మరిచిపోయాం.
సమాచార విప్లవాన్ని మరిచిపోయాం.
నీటిపారుదలను మరిచిపోయాం.
అంత్యోదయను మరిచిపోయాం.
అందరికోసం వచ్చిన ఆర్ధిక విప్లవాన్ని మరిచిపోయాం.
అక్షయ తృతీయ అంటే ఒక్క బంగారం పోగేసుకోవడం మాత్రమే ఎలా గుర్తుండిపోయింది చెప్మా.......
(అన్నట్టు పదిహేనేళ్ల క్రితం వరకూ తెలుగువాళ్లకి అక్షయ తృతీయ అంటే తెలియదు. తెలిసినా ఆ రోజున అప్పు చేసైనా సరే బంగారం కొనితీరాలని తెలియదు. తెలుగువాళ్లకి అక్షయ తృతీయ నాడు బంగారం కొనితీరాలన్న అలవాటును చేయించింది మహ్మద్ ఖాన్ జ్యూయెలర్స్ అనే సంస్థ అన్నది ఎందరికి తెలుసు?)
Excellent article, thanks for posting this.
ReplyDeleteThanks very much for liking this write up.
ReplyDeleteSudhakar garu,
ReplyDeletean excellent link up with the past. Many may not know about so much importance of the day. thank you for a good posting.
Really good. An article to be read aloud to improve diction. durmadandhulu, ardhika viplavam, antyodayam...eenaati telugu TV ankharimanulu ee post pyki chadivithe...intlo navvula jalle....chala bagundi sir.
ReplyDeleteRaka Namaskaram
ReplyDeletevery good information. Due to lake of such information people blindly following such issues. It should be publicized.
Raka Namaskaram
ReplyDeletevery good information. Due to lake of such information people blindly following such issues. It should be publicized.
నమస్కారం సార్,
ReplyDeleteదినం అక్షయం... జేబులో డబ్బులు క్షయం చాలా చాలా బాగుంది. సత్యయుగం నుంచి నేటి వరకు ఆక్షయ తృతీయ గొప్పదనాన్ని చక్కగా తెలియ చేశారు. మీరు రాసిన గొప్ప గొప్ప సందర్బాలు నాకు ఏవి తెలియవు కానీ బంగారం కొనితీరాలన్న
అలవాటును చేయించింది మహ్మద్ ఖాన్ జ్యూయెలర్స్ అన్న విషయం మాత్రం తెలుసు. ఎందుకంటే గుంటూరులో మహ్మద్ ఖాన్ జ్యూయెలర్స్ ఆక్షయ తృతీయ గురించి ప్రకటించిన రోజు మీడియా సమావేశంలో నేను కూడా ఉన్నాను. మహ్మద్ ఖాన్
జ్యూయెలర్స్ సంస్థలో మూడో తరం వారసులు పెత్హనంలో ఈ సంప్రదాయం ప్రారంభించారు. దాన్ని ఆ తరవాత అందరు అనుసరించి ఉతరాదికి చెందిన దీన్ని ఇక్కడ ప్రచారం చేసి తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. dvsubbarao
Dhanyavaadaalu Subba Rao Garu
ReplyDelete