ఇక్కడున్నావా శివయ్యా!! - Raka Lokam

ఇక్కడున్నావా శివయ్యా!!

Share This





కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది
త్రేతా యుగానికి వచ్చే సరికి ఒక కాలు అవిటిదైపోయింది.
ద్వాపరానికి వచ్చే సరికి రెండో కాలూ పోయి, రెండు కాళ్లే మిగిలాయి.
కలియుగంలో ధర్మం ఒంటికాలు కుంటిదైపోయింది.
ఉన్న నాలుగో కాలూ ఊడిపోతే .....
కల్పాంతం వస్తుంది. ప్రళయం వస్తుంది. సర్వం నాశనమైపోతుంది.
కాబట్టి ఆ ఒక్కకాలునైనా కాపాడుకోవాలి.
ఈ నిజాన్నే చెబుతుంది హరిశ్చంద్రగఢ్ శివలింగం.
* * *
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా....అందులోనే సహ్యాద్రి కనుమల కొండ ముడుతల్లో పాము పడగ విప్పినట్టు ఉంటుంది కొంకణ కడా కోన. అక్కడే ఒక కోన పేరు తారామతి కోన. ఇంకో కోన పేరు రోహితాస్య కోన. హరిశ్చంద్రుడు, ఆయన భార్య, ఆయన కొడుకు పేర్లు ఇవి.
కాలచూరి రాజుల కాలంలోనే అంటే ఆరో శతాబ్దంలోనే అక్కడ హరిశ్చంద్రగఢ్ కోటను నిర్మించారు. హరిశ్చందగఢ్ కోట నిండా అద్భుతాలే. ఎన్నెన్నో గుహలున్నాయి. అవి ఎక్కడెక్కడికో పోతాయి. గుహల్లో అద్భుతమైన గుడులున్నాయి. దేవీదేవతలున్నారు. తాంత్రికులు, సిద్ధులు ఈ గుహల్లోనే తంత్ర రహస్యాల చిక్కుముడులు విప్పారు. మూలాధారం నుంచి సహస్రారం దాకా కుండలినికి సరసర పాములా పరుగులెత్తించి ఈ గుహ చీకట్లలోనే తమ మనోనేత్రాలు తెరుచుకున్నారు.



ఇలాంటిదే ఒక రహస్యాల గుహ ఉంది. హరిశ్చందగఢ్ లో ఉన్న హరిశ్చంద్రేశ్వర మందిరానికి వెళ్లే మెట్లు ఎక్కుతుంటే మనకు ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహలోపలకి వెళ్తే అక్కడ అదేదో లోకంలా, అతీంద్రియంగా, ఒక పెద్ద మండపం కనిపిస్తుంది.
బండరాళ్లే పైకప్పు....
గండ శిలలే గోడలు....
సన్నని చిన్ని చిన్ని కుహరాలు....
కింద నీలి రంగులో నీరు....
ఆ నీటి మధ్య ఒక చిన్న మండపం.
ఆ మండపంలో నిశ్చల ధ్యానం చేస్తున్నట్టు అయిదడుగుల శివలింగం.
వింత వెలుగులు, నీటి తరంగాల ప్రతిబింబాలు శివుడిపై పడుతూ విచిత్రానుభూతిని కలిగిస్తాయి. మనసు మరో లోకంలోకి వెళ్లిపోతుంది.
గుహ గర్భంలో శివుడుంటాడు... వెళ్లిన జీవుడుంటాడు.
నిశ్చలమైన నీటిలో వారిద్దరి నీడలు జీవుడిలో ఐక్యమైపోయినట్టు, అద్వితీయమైపోయినట్టు, అద్వైతమైపోయినట్టు కనిపిస్తాయి.
ఆ నీళ్లలో అడుగు పెట్టలేం. అంత చల్లగా ఉంటాయి. దూరం నుంచే శివుడు కనిపిస్తూంటాడు. కానీ శివలింగాన్ని చేరుకోలేం. దైవత్వాన్ని చేరుకోవడం ఎంత కష్టమో చెబుతున్నట్టు కంటికి చిక్కినా, చేతికి దొరకనట్టుంటాడు శివుడు.
అప్పుడు శివుడిపైన ఉన్న మండపంపై మన దృష్టి పోతుంది.



నాలుగు స్తంభాలు.......
ఒక స్తంభం పూర్తిగా పోయింది. గతించిన కృతయుగంలా......
రెండో స్తంభం ముప్పాతిక భాగమే మిగిలింది. కింద భాగం పోయింది. గడచిపోయిన త్రేతాయుగంలా.....
మూడో స్తంభం ఒక వంతే మిగిలి మొండిగా కప్పునుంచి వేలాడుతూ ఉంటుంది. కనుమరుగైన ద్వాపరయుగంలా.....
నాలుగో స్తంభం ఒక్కటే మిగిలి ఉంది. కలియుగంలా....
ఆ నాలుగో స్తంభం పగిలిపోతే ప్రళయం వస్తుందని, ప్రపంచం అంతమౌతుందని నమ్మకం.
ఆ స్తంభానికే నోరుంటే ....
మనకు నిజమైన చెవులుంటే .....
మనకు ఒంటి స్తంభం సందేశం వినిపిస్తుంది....
"ధర్మో రక్షతి రక్షితః"
(ధర్మాన్ని కాపాడండి.... అది మిమ్మల్ని కాపాడుతుంది)




No comments:

Post a Comment

Pages