మన అమరనాథుడు సలేశ్వరుడు - Raka Lokam

మన అమరనాథుడు సలేశ్వరుడు

Share This




అమరనాథుడిని చూసేందుకు కొండ ఎక్కాలి.
లింగమయ్యను చూసేందుకు లోయ దిగాలి....
అమరనాథుడిని చూసేందుకు పగలు మాత్రమే ప్రయాణించాలి.
లింగమయ్యను చూసేందుకు అర్ధరాత్రి మాత్రమే ప్రయాణించాలి.
అమరనాథ యాత్రలో సూర్యుడే మనకు తోడు.
లింగమయ్యను చూడాలంటే పున్నమి చంద్రుడే మనకు దారి దీపం.
అమరనాథ యాత్ర ఏడాదిలో నెలో నెలన్నరో మాత్రమే వీలు పడుతుంది.
లింగమయ్యను చూడాలంటే ఏడాది మొత్తంలో కేవలం మూడంటే మూడు రోజులే వీలు పడుతుంది.
అమరనాథుడి హిమ లింగం ఏర్పడి, కరిగిపోవడానికి నెల రోజులు పడుతుంది.
లింగమయ్య మాత్రం కరగడు. తరగడు. మూడు రోజులు ... కాదు కాదు .... మూడు రాత్రులు మినహాయిస్తే లింగమయ్య ఏకాంతంగా మిగిలిపోతాడు.
దర్శన కాలం అయ్యాక అమరనాథుడి దేవాలయానికి తలుపులు మూసేస్తారు.
దర్శన కాలం పూర్తయిన తరువాత కూడా దిక్కులే అంబరాలుగా... దిగంబరేశ్వర లింగమయ్య వనజీవనం గడుపుతూ ఉండిపోతాడు.
మన లింగమయ్య ఆంధ్ర అమరనాథుడు. అమరనాథయాత్రంత ఉత్సాహాన్ని, సాహసభావనని, ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది ఈ యాత్ర. ఇదే సలేశ్వరం యాత్ర. ఏడాదిలో చైత్ర పౌర్ణిమ సమయంలో కేవలం మూడు రోజుల పాటు మాత్రమే జరిగే అద్భుత యాత్ర. నిజానికిది అపూర్వ యాత్ర.
అసలు సలేశ్వరం సర్వేశ్వరం అన్న పేరుకు అపభ్రంశం అని పండితులు చెబుతారు. పదహారో శతాబ్దం నాటి శేషనాథుని శ్రీపర్వత పురాణంలో సలేశ్వరం, అక్కడి గుహాంతర్గత శివుడు, రెండు తీర్థాలు - పుష్కర తీర్థం, సర్వేశ తీర్థాల ప్రస్తావన ఉంది.



అదంతా పాత మాట. ఇప్పుడు సర్వేశ్వరుడు చెంచుల నోట సలేశ్వరుడయ్యాడు. అదీ పలకలేని వాళ్లు లింగమయ్య అన్నారు. భక్తుడు ఏ పేర పిలిస్తే ఆ పేరిటే దేవుడు పలుకుతాడు. చెంచులే ఆ దేవుడికి ప్రమథగణాలై కాపాడుకుంటున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా మన్ననూరు అటవీ ప్రాంతంలో మన్ననూర్ చెక్ పోస్టు వరకూ వెళ్లాలి. రాత్రి 9 గంటలకి మన్ననూరు చెక్ పోస్టు మూసుకుపోతుంది. మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు తెరుచుకుంటుంది. మన్ననూరు నుంచి ముందుకు పోతే ఫర్హాబాద్ వస్తుంది. ఫర్హాబాద్ నుంచి ప్రయాణం చేస్తూంటే దారి పొడవునా దట్టమైన చెట్లు, ఎనిమిది అడుగుల ఎత్తున్న పాముపుట్టలు, అగాధాల లోయలు, ఎత్తైన కొండలు దర్శనమిస్తూ ఉంటాయి. ఎర్రమట్టి కచ్చా రోడ్డులో ప్రయాణం చేశాక దేవాలయం నడక దారి వస్తుంది. అక్కడ వాహనాలు ఆగిపోవాల్సిందే.
ఆ తరువాతే మొదలవుతుంది అసలు యాత్ర.
పైన పండు వెన్నెల, పక్కనే తోడుగా పర్వతాల మాలిక, అక్కడక్కడా పలకరించే జలపాతాలు, గలగలపారే జలతారుల్లాంటి ప్రవాహాల జలతరంగ ధ్వనులు, అప్పుడప్పుడూ మేమున్నామంటూ అడవి జంతువుల అల్లరి కేకలు, వీటన్నిటి మధ్య చీమల బారులా వేలాది మంది శ్రద్ధాళువులు...
కళ్లలో చూడబోయే సలేశ్వరుడి అవ్యక్త రూపం...
మనసులో అద్భుత భావనలు.....
నోట శంభో హరహర మంత్రం....
ఒక విచిత్ర వాతావరణం ఎల్లెడలా నిండిపోతుంది.
జాబిల్లి వెలుగులు ఆకుల మీద, కొండల మీద పడి మిలమిల మెరిసి, గలగల మురిసి కిందకు జాలువారి వెన్నెల నదిలా, వన్నెల నిధిలా మారుతున్న వైనం చూస్తే వనమే విభూది రాసుకుంటోందా అనిపిస్తుంది.
గంటన్నర పాటు ఎగుడు దిగుడు లోయలో, బండరాళ్ల మధ్య, కర్ర ఊతంతో నడుస్తూ నడుస్తూ ప్రయాణించాలి.



జారిపడితే....
భయం లేదు. జీవనాథుడున్నాడు.
అడవి జంతువు దాడి చేస్తే...
భయం లేదు. భూతనాథుడున్నాడు.
అనుకోని అనారోగ్యమేదైనా వస్తే ...
భయం లేదు. మృత్యుంజయ మహాశివుడున్నాడు.
గంటన్నర ప్రయాణం తరువాత లోయ అడుగున ఒక అద్భుత లోకం సాక్షాత్కరిస్తుంది. ఆకాశం నుంచి రెండు వందల మీటర్ల లోతుకు పాలధార పడుతున్నట్టు అద్భుతమైన జలపాతం కనిపిస్తుంది. దాని కింద వృద్ధులు సైతం పిల్లలై కేరింతలు కొడుతూంటారు. ప్రయాణం చేసి బండరాళ్లపై సేదతీరుతున్న భక్తులు కనిపిస్తారు. జలపాతానికి పక్కనే గుహలో సలేశ్వరుడు కొలువై ఉంటాడు. భక్తులు బారులు తీరి వెళ్లి భగవంతుడిని దర్శించుకుంటారు.
ఆ వాతావరణం ఎలాంటిదంటే దేవుడిని ఏం కోరుకోవాలో గుర్తుకు రాదు. కార్లు, భవనాలు ఇవ్వమని అడిగేందుకు నోరు రాదు. పరమేశ్వరుడు, ప్రకృతి సమాగమిస్తున్న ఆ చోట మనసు మూగదైపోతుంది. మాట అవ్యక్తమౌతుంది.
మళ్లీ తిరుగు ప్రయాణంలో ఆ అలౌకిక దృశ్యమే మళ్లీ మళ్లీ కళ్లముందు బొమ్మకడుతుంది. జలధార, శివలీల మనసులో నిండిపోతాయి. ఎలా తిరిగి వచ్చామో, ఎలా రణగొణధ్వనుల మామూలు ప్రపంచంలోకి వచ్చామో తెలియదు. మళ్లీ సలేశ్వరుడిని ఎప్పుడు దర్శించుకుందామా అన్న తహతహ మిగిలిపోతుంది. ఏడాది పాటు సలేశ్వరం యాత్ర అనుభూతులు చెప్పుకునేందుకు ఉండిపోతాయి.


No comments:

Post a Comment

Pages