విమానం ఆలస్యమయ్యేలా అందరికన్నా చివర ఆయన రాలేదు.
ఆయన అందరి కన్నా ముందు విమానాశ్రయానికి వచ్చారు.
ఆయన చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండోలు, సిబ్బంది హడావిడి లేదు.
ఆయన ఒక్కరే మామూలుగా నడుచుకుంటూ వచ్చారు.
ఆయన లగేజీని మోసేవారెవరూ లేరు.
తన బ్యాగేజిని తానే మోసుకుని ఆయన వచ్చి, మామూలుగా మనందరిలాగానే క్యూలో నిలబడి టికెట్ స్టాంప్ చేయించుకున్నారు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మామూలు తరగతిలో తక్కువ ఖర్చు విమానంలో ప్రయాణం చేస్తున్నారు. మీలా... నాలా... మనందరిలా... ఆయన చాలా మామూలుగా ఉన్నారు. తానొక ముఖ్యమంత్రినన్న అహంకారం లేదు. దర్పం అసలే లేదు.
వీఐపీలందిరిలాగా తొలి వరసలో కూర్చుని హోదాను ప్రదర్శించడం వంటివి ఆయన చేయలేదు.
అందరిలాగానే ఒక వరుసను ఎంచుకుని, అందులోని ఒక సీటులో కూర్చున్నారు. ఆయన సౌకర్యం కోసం ఆయన పక్కసీటు ఖాళీగా లేదు. అందులో మామూలు ప్రయాణికుడు ఒకరు కూర్చున్నారు.
ఆయన ఒక ముఖ్యమంత్రి అన్న విషయం సగం మంది ప్రయాణికులకు తెలిసి కూడా ఉండదు. అంత సింపుల్ గా ఉన్నారాయన. విమాన సిబ్బంది సైతం ఇతరులతో ఎలా వ్యవహరించారో ఆయనతోనూ అలాగే వ్యవహరించారు. ఆయనకు ఎలాంటి ప్రత్యేక ట్రీట్ మెంటూ లేదు. ఆయన అందర్లాగానే ప్రయాణం చేశారు.
ఢిల్లీకి వెళ్తున్న ఆ ముఖ్యమంత్రిగారి వ్యవహారశైలిలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. ఎలాంటి పటాటోపమూ లేదు. ఒక రాష్ట్రానికి తానే కర్ణధారినన్న ధోరణి ఎక్కడా కనిపించలేదు.
చివరికి విమానం ఢిల్లీకి చేరింది. మామూలుగానైతే మిగతా ప్రయాణికులందరినీ ఆపి, ముందు వీఐపీగారు దిగుతారు. ఆయన దిగిన తరువాతే మనబోటి సామాన్యులకు విమానం దిగే భాగ్యం దక్కుతుంది.
కానీ ఈ ముఖ్యమంత్రి గారు దిగేందుకు తొందరపడలేదు. మిగతావారిలాగా తన సంచీని తానే భుజాన వేసుకుని నెమ్మదిగా క్యూలో కదులుతూ వెళ్లి, తనవంతు వచ్చినప్పుడు దిగారు.
హడావిడి లేదు. ఆర్భాటం లేదు... ఆడంబరం అంతకన్నా లేదు.
మామూలుగా వీఐపీలు విమానం దిగితే రన్ వే దగ్గరికి వారిని పికప్ చేసుకునేందుకు కారువస్తుంది. సిబ్బంది హడావిడి పడతారు.
కానీ ఈయన కోసం కారు, సిబ్బంది హడావిడి లేదు. అందరు యాత్రికుల లాగానే ఆయన కూడా విమానాశ్రయం వారు ఏర్పాటుచేసిన బస్సు ఎక్కి బయటకు వచ్చారు. బస్సులో కొందరు ఆయన్ను గుర్తించి, పలకరించారు. ఆయన సౌమ్యంగా, సాదరంగా మాట్లాడారు.
తమతో పాటు బస్సులో ఉన్నది ఒక ముఖ్యమంత్రి అని చాలా మందికి అప్పుడు తెలిసింది.
మామూలు షర్టు, మామూలు ఫార్మల్ ప్యాంట్, సాధారణమైన చెప్పులు, రెండు సూట్ కేసులు మోసుకుంటూ తమతో నడుస్తోంది ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరూ నమ్మలేకపోయారు.
అవినీతి, ఆశ్రితపక్షపాతం, గ్రూపు రాజకీయాలకు మారుపేరైన గోవా గంజాయివనంలో ఆయన తులసిమొక్క లాంటి వాడు. అవినీతిపై రాజీలేని పోరు సాగిస్తున్నారు. ప్రజలకు మంచి పరిపాలనను అందించడమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నారు.
ఆయన పేరు మనోహర్ పరిక్కర్.
(విమానంలో గోవా నుంచి ఢిల్లీకి మనోహర్ పరిక్కర్ తో పాటు ప్రయాణం చేసిన నెట్ వర్క్ 18 విలేఖరి కథనం ఇది. మనోహర్ పరిక్కర్ ను కలిసిన వారందరూ ఇందులో ఒక్క ముక్కా అబద్ధం కాదని చెబుతారు. తనతో మాట్లాడిన వ్యక్తి విలేఖరి అని పరిక్కర్ కి తెలియనే తెలియదు. )
Super..
ReplyDeleteur great leader i want to talk with u sir and my no +91 9553888621
ReplyDelete