మెదక్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది చరిత్రాత్మక మెదక్ చర్చి. మెదక్ పట్టణంలోనే మరో చారిత్రిక కట్టడం ఉంది. అదే మెదక్ కోట....శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మెదక్ కోట భిన్న సంస్కృతులు, భిన్న చారిత్రిక ఘట్టాలకూ వేదిక...కాకతీయులు, ఢిల్లీ సుల్తాన్లు, గోల్కొండ నవాబులు ....ఇలా వేర్వేరు పాలకుల అధీనంలో ఒక వెలుగు వెలిగిందీ కోట....
మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట .......ఒక్కో మెట్టూ ఎక్కూతూ పైకెళ్లిన కొద్దీ మన ముందు చరిత్ర పేజీలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి.....
దక్షిణాపథంపై ఖిల్జీలు తుగ్లక్కుల చీకటి నీడలు పడుతున్న వేళ కాకతీయ సామ్రాట్టు రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది....ఈ కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రుదుర్భేద్యంగా మార్చేసింది. ఎత్తైన కొండ, చుట్టూ నలభై కిలోమీటర్ల వరకూ ఎలాంటి కదలికలున్నా పసిగట్టేందుకు బురుజులు, కోటకు ఎక్కడానికి వీల్లేనంత ఎత్తైన గోడలు, మలుపులు, మెలికలు తిరిగే కొండదారి.... కోటలో వారికి శత్రువు కనిపిస్తాడు కానీ శత్రువుకు కోటలో ఏముందో, ఎక్కడ సలసలకాగే నూనె నిండిన డేగిశా కుమ్మరించేందుకు ఎవరు పొంచి ఉన్నారో, ఏ బురుజు రంధ్రాల్లోంచి ఎవరు విషం పూసిన బాణాలను ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి.
కోటలో 17 వ శతాబ్దం నాటి 3.2 మీటర్ల పొడవైన ఫిరంగి ఉంది. దానిపై త్రిశూలం ముద్ర అలనాటి హైందవ రాజుల రాజ్యరక్షణా కాంక్షకు అద్దం పడుతోంది.
1296లో ఈ కోట నిర్మాణం మొదలైంది. కోటలో కనిపించే సింహద్వారాలు, గజద్వారాలు కాకతీయుల నాటివే....అప్పట్లో కాకతీయులు ఏడు ద్వారాలు నిర్మించారు. వాటిలో రెండు మాత్రం ఇప్పుడున్నాయి. మొదటిది సింహద్వారం. రెండు గర్జిస్తున్న సింహాల శిల్పాలు ద్వారానికి ఇరువైపులా ఉంటాయి. లోపలికి వెళ్తే గజద్వారం వస్తుంది. ద్వారానికి ఇరు వైపులా రెండు ఏనుగుల శిల్పాలుంటాయి. కోట ద్వారాలపై రెండు తలల గండభేరుండం శిల్పం కాకతీయుల రాజవైభవానికి చెక్కుచెదరని సాక్షిగా నిలుచుంటుంది.
కోటలో పలు దిగుడు బావులు, జలాశయాలు, సొరంగ మార్గాలు కూడా నిర్మించారు. అంతేకాదు తాగు నీటి సరఫరాకోసం కుండ పెంకులతో పైప్‌లైన్లు కూడా ఉండేవట...కానీ అవి ఇప్పుడు కనుమరుగైపోయాయి.
అయితే 1203 నుంచే ఢిల్లీ సుల్తాన్ల దాడులూ దండయాత్రలూ ఆరంభమయ్యాయి..... కాకతీయుల తరువాత ఢిల్లీ సుల్తాన్లు, వారి తరువాత బహుమనీలు ఇలా మెదక్ కోట ఒక్కక్క రాజవంశం చేతులు మారుతూ వచ్చింది. 18వ శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చింది. సుల్తాన్ల ఏలుబడిలోనే ఈ కోటలో ఇస్లామిక్ శైలి కట్టడాల నిర్మాణం జరిగింది.
ఇప్పుడు అన్ని కోటల్లాగానే మెదక్ కోట కూడా కళ తప్పింది....దీనికి ఆలనా పాలనా కరువైంది...ఇప్పుడీ కోట పోలీస్ కమ్యూనికేషన్ కేంద్రంగా ఉన్నా పట్టించుకునే వారు లేరు. అమూల్యమైన ఈ చరిత్ర అవహేళనకు గురవుతోంది
ఈ కోటను పర్యాటక కేంద్రంగా అభివృధ్ధి చేసేదిశగా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా చర్యలు చేపడుతున్నారు. అవి ఫలితం దాలుస్తాయని, ఫలం దక్కుతుందని, మెతుకు సీమ రక్షణ కోసం మన పూర్వీకులు నిర్మించిన కోట మళ్లీ మనకు ప్రేరణనిస్తుందని ఆశిద్దాం.
ఏడుపాయల జాతరకు వెళ్లినప్పుడో, మెదక్ చర్చిని చూసి వచ్చేటప్పుడో ఒక్కసారి కోట ఎక్కండి... కాకతీయ వైభవాన్ని కళ్లముందు సాక్షాత్కరింపచేసుకొండి.
No comments:
Post a Comment