ఒక గుడి చూస్తే ఇంకొక గుడి ఫ్రీ.... - Raka Lokam

ఒక గుడి చూస్తే ఇంకొక గుడి ఫ్రీ....

Share This

శివుడూ... విష్ణువూ ఒక్కటే....
కానీ ఆయన భక్తులు మాత్రం అభిమానసంఘాలైపోయి మరీ కొట్టుకుంటారు.
ఆ గుడి మాత్రం అలా ఘర్షించుకోనీయదు.
చెన్న కేశవుడి గుడి పూజారి "నా గుడి చూస్తే మీ యాత్ర సగమే పూర్తయినట్టు. ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివుడి గుడి చూస్తేనే మీ యాత్ర పూర్తయినట్టు" అని చెబుతాడు.
అంతే..... గంగాపురంలో మీసాల చెన్నకేశవుడి వైభవాన్ని చూసిన తరువాత మళ్లీ నీలాంబరం వెళ్లి దుందుభి వాగు పక్కనున్న దిగంబరుడిని దర్శించుకోవాల్సిందే.



నాలాంటి, మీలాంటి సామాన్య భక్తులే కాదు... ప్రత్యక్షనారాయణుడైన సూర్యనారాయణుడు కూడా ఏడాదికొక్కసారి ఇదే పని చేస్తాడు. ఉదయారుణ కిరణాలతో చెన్నకేశవుడి పాదాలను కడిగిన తరువాత సాయంసంధ్య వేళ శివలింగాన్ని తన కాంతిపుంజంతో అభిషేకిస్తాడు.
ప్రతి ఏటా ధనుస్సంక్రమణ సమయంలో సూర్యుడు ఉదయమే గుడి ధ్వజస్తంభాన్ని, ఇరుకు ద్వారాన్ని, గోడలు, గోపురాలు, మంటపాలను దాటుకుని చెన్నకేశవుడి పాదాలను స్పృశిస్తాడు. అదే సాయంత్రానికి అదే సూర్యుడు చింతతోపులు, దుందుభి వాగు గట్లు, రెండు మూడు ఊళ్లూ దాటి నీలాంబరం శివుడిని స్పృశిస్తాడు.



సూర్యుడి గతిని, గమనాన్ని, కిరణాల వాలుని, వెలుగు దారిని శతాబ్దాల కింద టెలిస్కోపులూ, ట్రిగోనామెట్రీలూ లేని రోజుల్లో ఖచ్చితంగా లెక్కవేసి.... సరిగ్గా ఇక్కడ ఈ దిశలో చెన్నకేశవుడుండాలి.... అక్కడ ఆ ఎత్తున నీలాంబరుడుండాలని నిర్దేశించిన అజ్ఞాత ఆర్కిటెక్టుని......
అన్నేసి అడ్డంకులను కూడా దాటి సూర్యకిరణాలు లోపలికి వచ్చేలా చేసిన అజ్ఞాత శిల్పిని.......
అసలు శివకేశవ అభేదాన్ని చెప్పక చెప్పిన ఆ అజ్ఞాత చాళుక్యరాజుని.......
ఆయనకు ప్రేరణనిచ్చిన అజ్ఞాత గురువుని.........
తెలియకుండానే ఒక్కసారి స్మరించుకుంటాం.....
అదీ గంగాపురం - నీలాంబరాల మహత్మ్యం!



మహబూబ్ నగర్ జడ్చర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాక గంగాపురం వస్తుంది. గంగాపురంలోపలికి ఒకే ఒక్క దారి. ఆ దారి మట్టిదారి...
ఆ దారిలో ఊరి లోపలకి వెళ్తూంటే ధూళి ఒంటిని తాకుతుంది.
అది పట్టణాల వాహనాలు వెనుకనుంచి విరజిమ్మే కార్బన్ దుమ్ము కాదు. ఆవుల గిట్టలు మట్టిని మట్టగించి మట్టగించి వెదజల్లే ధూళి... గో ధూళి.....!
మనసు ఒక అరవై డెబ్భై ఏళ్ల వెనక్కి వెళ్లిపోతుంది.
దారికి ఇరువైపులా పెంకుటిళ్లు, మట్టి గోడలు.... పటేల్ పట్వారీల మేడలు... గవాక్షాలు .... కనిపిస్తాయి.
అవి గుప్పెడు నీడను కూడా పంచలేని తాటిచెట్ల లాంటి హైదరాబాద్ ఆకాశహర్మ్యాల నుంచి .... తమ నీడలతో చలువ పందిళ్లు కట్టేసే పల్లెటూరి గుబురు పొదలలోకి మనల్ని తీసుకెళ్తాయి.
మనసు మరో వందేళ్లు వెనక్కివెళ్లిపోతుంది.

గుడికి దారేది అని అడగక్కర్లేదు...
దారే గుడికి వెళ్తుంది.
గుడి దగ్గరకి తీసుకెళ్లాక దొరకు దండం పెట్టి సవినయంగా వంగి పక్కకి వెళ్లిపోయే పరిచారకుడిలా దారి పక్కకి మలుపు తిరుగుతుంది.
ఎదురుగా చెన్నకేశవుడి రాజగోపురం, మహాద్వారం, మెట్లు...
కాళ్లను శతాబ్దాల వెనక్కి,
మనసును మహావైకుంఠానికి తీసుకెళ్తాయి.
లోపలకి వెళ్తే శతాబ్దాలు చెన్నకేశవుడు జలకాలాడిన భక్తితత్వమంత లోతైన రాతి మెట్ల కోనేరు, కోట్లాది భక్తుల పాదముద్రలు పడిన మంటపాలు, మందిరం గోడలు దర్శనమిస్తాయి. గుడిచుట్టూ ప్రదక్షిణం చేస్తూంటే అలనాటి ప్రాకారాలు, మట్టిబురుజులు, ఉప మందిరాలు, వాటిపైని అత్యద్భుత శిల్పసంపద కనిపిస్తాయి. పన్నెండో శతాబ్దంలో చాళుక్య రాజులు మహారాజులు అతిసామాన్యులై చేతులు జోడించి ప్రదక్షిణలు చేసిన దారిలోనే మన పాదాలూ కదులుతాయి. చరిత్ర, ఇతిహాసం, పరంపర, సాంప్రదాయం పిల్లతెమ్మెరలై మనసును తాకుతాయి.
గుడిలోపలికి వెళ్లగానే పూలమాలల అలంకరణ వెనుక గుంభనంగా నవ్వుతున్న మీసాల చెన్నకేశవుడు దర్శనమిస్తాడు. శతాబ్దాల లెక్కనుంచి కాలం లెక్కలకందని ఏదో చోటుకి, ఏదేదో సమయానికి వెళ్లిపోతాం....
చెన్నకేశవుడి పాదపద్మాలను చూసి ...
ఇదే సూర్యుడు తాకే పాదం...
బ్రహ్మకడిగే పాదం...
బ్రహ్మమూ తానే అయిన పాదం అని తెలియకుండానే అనుకుంటాం.



గంగాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది నీలాంబరం. ఊరికి దూరంగా మట్టిదారి చివరన, దుందుభి వాగు చేరువన, చింతతోపుల నట్టనడుమ పరశువేదీశ్వరుడి రూపంలో శివుడు కొలువై ఉంటాడు. భక్తుల కోసం రాతిగదులు, మెట్లదారులు, రాతి డాబాలు, ప్రదక్షిణమార్గాలు గుడి పాతదనానికి పిన్ కోడ్ నంబర్లలా ఉంటాయి. శివుడు... ఆయన వాహనం నంది ఒంటరిగా కొలువై ఉంటారు.



ఆ దేవుడికున్న వైభవమేదీ ఈ దేవుడికి కనిపించదు.
పూజారి... అబ్సెంట్ సర్...
పల్లకీబోయీలు ... ఆబ్సెంట్ సర్....
సేవలుచేసే వారు... ఆబ్సెంట్ సర్ .....
భక్తులు .... ఆబ్సెంట్ సర్...
కానీ శివుడిని చూస్తే ఒంటరితనం ఒక్క ఉదుటున వెళ్లిపోతుంది.
వచ్చేస్తూంటే దూరాన దుందుభి వాగులో ఇసుక దొంగలు ట్రక్కుల కొద్దీ బొక్కుతూ కనిపిస్తారు. వాళ్ల ఆకలికి దేవుడి గుడి దిగుడు బావి సైతం సగమైపోయింది. నీరు భయపడి పారిపోయింది.



మళ్లీ తారురోడ్డుమీదకి వచ్చినా కంటి స్క్రీన్ పై నుంచి శివలింగం బొమ్మ డిజాల్వు కాదు. డిలీట్ చేస్తే ఒకసారి చెన్నకేశవుడిలా... ఒక సారి పరశువేదీశ్వరుడిలా పదేపదే దర్శనమిస్తూ ఉంటుంది.
ఇంకా ఇంకా ట్రై చేస్తే బొమ్మలు మరింత వేగంగా కదిలి కదిలి సగం చెన్నకేశవుడిలా, సగం పరశువేదీశ్వరుడిలా అగుపిస్తుంది.
ఇంకాస్సేపటికి........
చెన్నకేశవుడూ, పరశువేదీశ్వరుడూ వేర్వేరుగా కాక........
ఒక్కటిగానే కనిపిస్తారు.

3 comments:

  1. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది:
    http://wikimapia.org/#lat=16.773593&lon=78.1890803&z=18&l=0&m=b
    ఎవరో తప్పుగా గుర్తు పెట్టారు వేరేచోట. దక్షిణాన తెల్లగా కనిపించేది ఏమిటో?
    వాగు కనిపించిందికాని, నీలాంబరం ఎక్కడో తెలీలేదు.

    ReplyDelete
  2. నమస్కారం సుధాకర్ గారు !! మీ వ్యాసం చాలా బాగుంది !! అయితే ఒక చిన్న సవరణ - నీలాంబరం కాదటండీ, అది మీనాంబరం అని జడ్చెర్ల వాసి అయిన ఒక మితృలు చెప్పారు !! సరి అనిపిసే మీ వ్యాసంలో సవరించగలరు!!
    - శశికుమార్

    ReplyDelete

Pages