ఆవగింజ - Raka Lokam

ఆవగింజ

Share This

ఆవిడకి ఊసుపోక కబుర్లంటే ఇష్టం.
ఆ అలవాటే నెమ్మదిగా గాలి కబుర్లంటే పడిచచ్చేలా చేసింది.
కొన్నాళ్లకి అది పుకార్లు ప్రచారం చేసే వ్యాధిగా మారింది.
నిజం కాలికి చెప్పులు తొడుక్కునే లోపల ఈమెగారి అబద్ధాలు ప్రపంచమంతా చుట్టొచ్చేసేవి.
ఆమె నాటిన గాలి కబుర్ల విత్తనాలు అబద్ధాల ముళ్లకంపలుగా మారేవి.

ఒక సారి ఆమె ఒక గురువు గారిని కలిసింది.
గురువు గారు ఆమె స్వభావాన్ని క్షణాల్లో పసిగట్టేశారు.
ఒక గుప్పెడు ఆవాలు ఆమె చేతికి ఇచ్చి...."మైదానమంతా తిరిగిరా. ... ఒక్కో అడుగుకీ ఒక్కో గింజ చొప్పున విసిరేసి రా...." అన్నారు.
ఆమె ఉత్సాహంగా అదే పనిచేసి... గంటన్నర తరువాత గురువు గారి దగ్గరకి వచ్చేసింది.
"అయిపోయిందా?"
"అవును గురువు గారూ... ఇంకా ఆవాలు విసిరి రావాలా చెప్పండి" అంది ఆమె ఉత్సాహంగా.
"అక్కర్లేదు... నువ్వు విసిరేసిన ఒక్కో గింజా మళ్లీ ఏరుకుని తీసుకురా...." అన్నాడు ఆయన.
ఆవిడ బిక్కమొహం వేసింది.
విసరమంటే చాలా ఈజీ... ఏరమంటే కష్టం. అందునా ఆవగింజ ఏరడమా.....? కళ్లు పత్తిగింజలైపోవూ....?

"చూడమ్మా... నువ్వు ప్రచారం చేసే గాలికబుర్లు, పుకార్లు, వదంతులు... నువ్వు విసిరేసిన ఆవగింజల్లాంటివి. మళ్లీ వెతికి వెనక్కి తీసుకురాలేవు... అందుకే పుకార్లు ప్రచారం చేయకు.... ఆవగింజంత అబద్ధం వల్ల తాటికాయంత అనర్థం.... " అన్నారు స్వామీజీ.

ఆమెలో ఆవగింజంత జ్ఞానం ఎక్కడో మిగిలే ఉంది.
అందుకే గురువు గారి పాదాల ముందు మోకరిల్లింది.....

No comments:

Post a Comment

Pages