మోసం పనిచేయదు! - Raka Lokam

మోసం పనిచేయదు!

Share This

అతనికి తన తెలివితేటల మీద అపారమైన నమ్మకం. తిమ్మిని బమ్మి చేసేయొచ్చున్న ధీమా ఉండేది.
ఒక సారి మృత్యుదేవత అతడికి ఎదురుపడింది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉంది.
అదేమిటి అని అడిగాడు.
"ఇందులో చంపాల్సిన వాళ్ల జాబితా ఉంది" అన్నది ఆమె.
ఆమెతో చాలా దోస్తీగా మాట్లాడి ఎలాగోలా పుస్తకం లోని జాబితాను చూశాడు. జాబితా చాలా పొడవుగా ఉంది. ఎన్నెన్నో పేర్లున్నాయి. ఆ పేర్లను చదువుతూ పోయాడు. హఠాత్తుగా ఒక చోట అతని కళ్లు ఆగిపోయాయి.
అక్కడ ఉన్నది తన పేరే. తనకు ఈ భూమి మీద నూకలు ఉన్నది ఇంకొన్ని గంటలే....
ముచ్చెమటలు పట్టాయి.
అయితే తెలివి కలవాడు కదా... ఏదైనా చేసేసే సామర్థ్యం ఉన్నవాడు కదా....
తన కంగారును బయటపడనీయలేదు.
"మృత్యుదేవతా... మృత్యుదేవతా.... అలుపూ సొలుపూ లేకుండా అలా తిరుగుతూనే ఉంటావు కదా... ఈ ఒక్క పూటకీ నా ఆతిథ్యం స్వీకరించు." అని బ్రతిమిలాడాడు.
ఏ కళనుందో మృత్యుదేవత ఒప్పేసుకుంది.
మనోడు రాచమర్యాదలు చేశాడు. మంచి, తియ్యనైన పాయసాన్ని చేశాడు. అందులో మత్తుమందు కలిపాడు. మృత్యుదేవత ముందుంచాడు. మృత్యుదేవత దాన్ని గటగటా తాగేసింది. ఇంకేముంది? మత్తు ఆవరించింది. కూర్చున్న చోటే కూలబడిపోయింది. గాఢనిద్రలోకి జారుకుంది.



మనోడు తక్షణమే ఆ పుస్తకం తీసుకుని తన పేరు చెరిపేసేందుకు ప్రయత్నించాడు. కానీ దానిలో "డెలీట్"ఆప్షన్ లేదు. "కట్ అండ్ పేస్ట్" ఆప్షన్ మాత్రం ఉంది.దాంతో తన పేరును జాబితాలో చివరాఖరుకి చేర్చేశాడు.
"అమ్మయ్య.... ఇప్పట్లో చావం. కనీసం ఇంకో యాభై ఏళ్లు పడుతుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం" అనుకుని నిట్టూర్చాడు.
కొన్ని గంటల తరువాత మృత్యుదేవత మేల్కొంది. హాయిగా ఒళ్లు విరుచుకుంది.
"అబ్బాయీ... నువ్వు నాకు నచ్చావోయ్... నీ ఆతిథ్యం నచ్చింది. నీ పాయసం భలే రుచిగా ఉంది. నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. లెక్క ప్రకారం చావాల్సినవాళ్ల జాబితాలో నెక్స్ట్ నీ పేరే ఉంది. కానీ నాకు ఇంత చేసిన నిన్ను ఇప్పుడే చంపడానికి చేతులు రావడం లేదోయ్."
మనోడు చాలా తెలివిగా అమాయకంగా ... ఏమీ తెలియనట్టుగా మొఖం పెట్టుకుని చేతులు జోడించి నిలబడ్డాడు.
"అందుకే ... నీకు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చేస్తున్నాను ఫో.... జాబితాను పైనుంచి కిందకి కంటిన్యూ చేయకుండా... నువ్వు ఇంకాస్త ఎక్కువ కాలం బతికేందుకు వీలుగా జాబితా లాస్టు నుంచి .... అంటే కింద నుంచి పైకి నరుక్కుంటూ వస్తాను లే..."
మనోడు ...... ఢాం... ...
అప్పుడే ...
అక్కడికక్కడే

No comments:

Post a Comment

Pages