ఖిలాషాపూర్....వరంగల్ జిల్లా జనగామకు దగ్గర్లో ఉన్న ఓ చిన్న ఊరు....
అన్ని ఊళ్ళలాగానే అతి మామూలు ఊరు....
కానీ ఒకప్పుడు ఈ ఊరు ఓ స్వాతంత్ర్య వీరుడికి రాజధాని......1687 నుంచి 1724 వరకూ 37 ఏళ్ల పాటూ మొగల్ సేనలను, సర్కారును గడగడలాడించిన ఆ వీరుడు ఈ ఖిలాషాపూర్ కేంద్రంగానే యుధ్ధం కొనసాగించాడు.....
ఆ ఊళ్లోనే ఉంది ఒక కోట. ఆ కోట నుంచే ఆ ఊరికి ఖిలా షాపూర్ అన్న పేరు వచ్చింది. ఖిలా అంటే కోట.
సాధారణంగా కోటల్ని కట్టేది రాజులు....మహారాజులు....సామ్రాట్టులు....చక్రవర్తులు....
కానీ....ఇది ఎడ్లు తోలేవాడు....కల్లు గీసేవాడు కట్టిన కోట....అసామాన్యుడైన అతిసామాన్యుడు కట్టిన కోట.....సాధారణ వ్యక్తి కట్టిన అసాధారణమైన కోట ఇది..... అదే ఈ కోట ప్రత్యేకత.
ఖిలాషాపూర్ ని కట్టించిన ఆ అసామాన్యుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్......
ఎవరీ పాపన్న? పుట్టింది 1650లో ఒక కల్లుగీత కుటుంబంలో. మొగలుల అత్యాచారాలను, మత విద్వేషాన్ని చూసి యువ పాపన్న లావాలా కుతకుతలాడిపోయాడు. బడుగుల సేనకు ప్రాణం పోశాడు.....పన్నెండు మంది మిత్రులతో మొదలైన సేన మూడువేలకు పెరిగింది.....రెడ్లు, బ్రాహ్మణులు, వెలమలన్న తేడా లేకుండా అందరూ పాపన్న సేనలో చేరారు.
"అదిగో పాపడు వస్తావుంటే
కుందేళ్లు కూర్చుండబడెను
లేడిపిల్లలూ లేవలేవు
పసిబిడ్డలు పాలు తాగవు
నక్కలు సింహాలు తొక్కబడును" అదీ పాపడి శౌర్యం....
పాపన్న మొగలుల పన్ను వసూలును, దౌర్జన్యాన్ని సవాలు చేశాడు...నవాబులు జమీందార్లను దోచాడు....ఆ సొమ్ము పేదలకు పంచాడు.....కోటల్ని కొల్లగొట్టాడు....ఆ డబ్బు గ్రామాల్లో ఇచ్చేశాడు.....మందిరాలు, గోపురాలు కట్టాడు. మొగల్, నిజాం నిరంకుశుల పాదాల కింద నలుగుతున్న ప్రజాధర్మాన్ని పునరుద్ధరించాడు. నల్లగొండలో భువనగిరి, వరంగల్లులో తాటికొండ, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్ లలో కోటలు కట్టించాడు. 1675 లో సర్వాయిపేట గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక కోటను కట్టించాడు. అలాంటి వీరుడి రాజధాని ఖిలాషాపూర్. మనసులోనే ఒకసారి ఆ ధర్మరక్షకుడిని, ప్రజారక్షకుడిని తలచుకుని ముందుకు సాగండి.
ఖిలాషాపూర్ కోట ప్రధానంగా మట్టికోట....సున్నం, ఇటుకలు, గ్రానైట్ రాళ్లను కూడా విరివిగా ఉపయోగించారు. చుట్టూ ఉన్న కొండలు కోటకు తొలి రక్షణ కవచంలా నిలిచాయి....కోటలో నాలుగు పెద్ద బురుజులు, పలు ద్వారాలున్నాయి....అయితే ద్వారాలన్నీ ఏనుగుల్లాంటివి రావడానికి వీల్లేకుండా చిన్న చిన్నగా ఉన్నాయి....శత్రువుపై తుపాకులు గురిపెట్టేందుకు ఏర్పాట్లున్నాయి....దొంగ దెబ్బలు తీసేందుకు మలుపులు, ఇరుకు సందులు ఉన్నాయి...అవసరమైతే పారిపోయేందుకు మూడు సొరంగాలున్నాయి....ఒకటి తాటికొండ కోటకు, మరొకటి నాంచారి బావికి ఉన్నాయి. మూడో సొరంగం ఎక్కడికి వెళ్తుందన్నది ఎవరికీ తెలియదు...అది ఈ రాజకోట రహస్యం.....
ఈ కోట గోడలు, బురుజులు, ద్వారాలూ, లోపలి నిర్మాణాలు పాపన్న గౌడ్ వ్యూహ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు....ఈ కట్టడం అతని యుధ్ద తంత్రం ఎలాంటిదో తెలియచేస్తుంది....ఆ వీరుడి చెరగని ముద్ర ఈ కోటలో అడుగడుగునా....అణువణువునా కనిపిస్తుంది...
కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజుల స్వాతంత్ర్యపతాకాలు మురికిపట్టి, చిరిగిపోయి, తెలుగుగుండెపై "చాంద్ తారా" జెండా నాటుకుపోయిన చీకటి రోజుల్లో వెలుగు రేఖ సర్వాయి పాపన్న. హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి గుడి కట్టించాడు. ఆ గుడి నేటికీ పాపన్న పౌరుషాగ్నినే హోమాగ్నిగా చేసుకుని ధర్మకాంతులు వెదజల్లుతోంది. ఓరుగల్లు, నల్లగొండలు కలిసే చోట రైతుల పొలాలు ఎండిపోకుండా చెరువులు తవ్వించాడు. చెక్ డ్యామ్ లు కట్టించాడు. గ్రామీణుడికి బువ్వ దక్కాలన్న తాపత్రయం పాపన్న జీవితమంతా కనిపిస్తుంది.
పాపన్న నల్లగొండ, ఓరుగల్లు నడిపి నేలలో చిన్న పాలెగాడే కావచ్చు. కానీ తెలుగు, కన్నడ నేలలను విముక్తం చేయాలన్న కల ఆయన కళ్లలో సదా సర్వదా మెదలాడేది.
"కొడ్తే గోల్కొండ కొట్టాలె
నెల్లూరు బస్తీలు కొట్టాలే
బందరు బస్తీ కొట్టాలె
బచ్చీనపెట్టీలు కొట్టాలె
మైసూరు జిల్లాలు కొట్టాలె"
అన్నదే పాపన్న కల.
ధూల్మిట్ట గ్రామంలో ఉన్న వీరశిలమీద పాపన్న గురించిన శాసనంలో ఇలా వ్రాసి ఉంది.
"బండి పోతగౌడ
షాపుర్ ఖిలా పులిగౌడ
యేబదిరొడ్డి షర్పారాయుడ
సౌదరు పాపడు...."
ఆ శాసనంపై శత్రువును వలపన్ని బంధించే పాపడి వ్యూహానికి ప్రతీకగా సాలెపురుగు, పరాక్రమానికి ప్రతీకగా సింహం, రాజ్యమేలిన కారణంగా రాజలాంఛనంగా ఛత్రం, తురకలను చంపి వేటకుక్కలకు వేసినట్టుగా చెప్పేందుకు పంది, కుక్కల బొమ్మలు ఉంటాయి. పాపడి పరాక్రమ గాథనంతా నాలుగు బొమ్మల్లో చెబుతాయి.
చివరికి మొగల్ సుల్తాన్ బహదూర్‌షా మాయోపాయంతో ఖిలాషాపూర్ కోటపై దాడి చేస్తాడు......కానీ పాపన్న దాన్ని తిప్పికొట్టడమే కాదు అటు ఓరుగల్లు, ఇటు గోల్కొండ కోటలపై దాడి చేస్తాడు. మొగలుల్ని మట్టి కరిపించాడు. పలు రోజులు యుధ్ధం సాగింది....ఒకరు తరువాత మరొక మొగల్ సర్దారు వచ్చి యుద్ధం చేశాడు. అందరినీ దునుమాడాడు మన పాపన్న. చివరికి పోరాడుతూ పోరాడుతూనే యుద్ధభూమిలో శత్రువుకు చేజిక్కకుండా బాకుతో పొడుచుకుని పాపన్న ప్రాణం వదిలాడు.
ఖిలాషాపూర్ కోటను చూడండి. ఖిలాషాపూర్ లో పాపడి విగ్రహం ఉంది... కోట అంతా కలయతిరిగాక ఒక్క నిమిషం ఆ విగ్రహం ముందు నిలుచొండి...మన నేలను తిరిగిన మన శివాజీని, మనశివాజీ రాయగఢ్ ని తలచుకొండి. పాపడి ప్రతిజ్ఞను తలచుకొండి
"ఎంగిలి ముంతా ఎత్తాలేను
కొట్టుదును గోల్కొండపట్టణం
ఢిల్లీకీ మోజూరునవుదును
మూడు గడియల బందరు కొట్టుదును
మూలకోట కందనూర చూసి
బంగారు కడియాల పెట్టుదూను
మనకింత బంట్రోతుదనమేల" అదీ ఆయన ప్రతిజ్ఞ
Hi Sudhakar garu,
ReplyDeleteMeeru post chesthunna amshalu chala vignanam tho koodukunanvi.Memu vatini thiragagalamo ledho teliyadhu kani....mee varnanala dwara nijamgane aaa pradheshalalo vunnamanna,choosthunattunde bhavana kaluguthondhi.Inni vishayalanu panche meeku kruthagnathalu.
Dhanyavaadalu sir... mee protsaaham naaku tonic laantidi...
ReplyDelete