పడక సరిచేయాలి.
కొంచెం మురికి ఉన్నా మేజర్ గారికి నచ్చదు.
షూ పాలిష్ చేసి పడక పక్కనే ఉంచాలి.
షూలు నిగనిగ మెరవాలి. లేకపోతే మేజర్ గారికి కోపం వస్తుంది.
పళ్లెంలో నీట్ గా చపాతీలు, కూర అమర్చాలి. దాన్ని మంచం పక్కనే టేబిల్ పై ఉంచాలి.
ఎంగిలి కింద పడకూడదు. మేజర్ మండిపడతారు.
తెల్లవారు జామునే బెడ్ నీట్ గా సర్దేయాలి.
ఆలస్యాన్ని మేజర్ ఏమా త్రం సహించరు.
నెలనెలా ఒకటో తేదీనే మేజర్ గారి జీతం బ్యాంకు ఖాతాలో జమైపోతుంది. పద్ధతి ప్రకారం ఆయనకు ప్రమోషన్లు వచ్చేస్తాయి. ఈ మధ్యే ఆయనకు మేజర్ గా ప్రమోషన్ కూడా వచ్చింది.
ఏడాదికొక సారి మేజర్ గారికి యాన్యువల్ లీవు వస్తుంది. ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన పేరిట బెంగాల్ లోని న్యూ జల్ పాయ్ గుడి నుంచి టికెట్ రిజర్వు చేయించాలి. ఆయన బెడ్డింగ్ ఆయనకోసం రిజర్వయిన సీటు కింద ఉంచాలి. తోడుగా ఒక అటెండెంట్ పక్క సీటులో ఉంటారు. పంజాబ్ లోని బట్టేభైనీ గ్రామంలో మేజర్ గారి ఇంటి దగ్గర బ్యాగేజ్ దింపాలి. ఇంటికి చేర్చాలి. నెల రోజుల సెలవు పూర్తికాగానే వాటిని మళ్లీ రైలు ఎక్కించి, అటెండర్ జాగ్రత్తగా తీసుకురావాలి.
ఇందులో ఏ మాత్రం తేడా రాకూడదు. ఇది మేజర్ గారి పని.
ఇంతకీ మేజర్ గారు ఏరి?
వెతుక్కోకండి.
మేజర్ గారు చనిపోయి చాలా కాలమైంది. 1968 అక్టోబర్ 4వ తేదీనే ఆయన చనిపోయారు. మేజర్ గారు చనిపోయి నలభై నాలుగేళ్లయింది.
నలభై నాలుగేళ్ల కింద చనిపోయిన ఆ సైనికుడు సైనికుల కలలోకి వస్తాడు. ఆదేశాలు జారీ చేస్తాడు. సిక్కిం హిమాలయ పర్వతసానువుల్లో రాబోయే మంచుతుఫాన్ల గురించి ముందే హెచ్చరిస్తాడు.
అంతెందుకు.... సరిహద్దుకి ఆవల వైపున ఉన్న చైనా సైనికులు పొరబాటున సరిహద్దు దాటి వస్తే "ఖబర్దార్... ఆగే మత్ బఢో...." అన్న అరుపు వినిపిస్తుంది. చూస్తే ఎవరూ కనిపించరు. కానీ గొంతులోని అధికారం చూసి అది ఒక సైనికుడి గొంతు అని చెప్పొచ్చు. చైనావాళ్లు ఆయన గొంతు చాలా సార్లు విన్నారు. చిమ్మ చీకట్లో తెల్ల గుర్రంపై ఎవరో వెళ్లడం కూడా అప్పుడప్పుడూ చూశారు.
కానీ ఆయన నలభై ఏడేళ్ల కిందే చనిపోయాడు.
నలభై ఏడేళ్లుగా ఆయనకు జీతం వస్తోంది. సెలవు వస్తోంది. ప్రమోషన్ వస్తోంది. ఆయన గదిలో పడక దగర్నుంచి, పళ్లెం దాకా అన్నీ యథావిధిగా అమరుతూనే ఉన్నాయి.
ఇదేం విడ్డూరం అనుకోకండి. సిక్కింలో పనిచేసే సైనికుల ముందు ఈ మాట అస్సలు అనకండి. ఎందుకంటే వారి దృష్టిలో ఆ మేజర్ బతికే ఉన్నాడు. సిక్కింలోని నాథులా ప్రాంతంలోని కుపుప్ లోయలో ఆయనకు ఒక గుడి ఉంది. 'సిక్కిం రాజధాని గాంగ్ టాక్ కి అరవై కి.మీ దూరంలో ఉన్న ఆ గుడిలో ఆయన వస్తువులున్నాయి. ఆ గదిలోనే ఆయనకు ప్రతిరోజూ సైనిక సేవలు అందుతూంటాయి.
చనిపోయిన నలభై నాలుగేళ్ల తరువాత కూడా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆ అమర జవాను పేరు బాబా హర్ భజన్ సింగ్.
హర్ భజన్ 1966 లో సైన్యంలో చేరాడు. ఆయనకు సిక్కింలో పోస్టింగ్ వచ్చింది. 1968 లో సిక్కిం, ఉత్తర బెంగాల్ లలో భారీ వరదలు, మంచు తుఫాన్లు వచ్చాయి. అక్టోబర్ 4, 1968 లో గుర్రాలపై కొందరు ప్రజలను తరలించే పనిని హర్భజన్ కు అప్పగించారు. ఆ విధి నిర్వహణలో ఆయన కొండ లోయలోకి జారి పడి చనిపోయాడు. హర్భజన్ భౌతికకాయం కోసం నాలుగైదు రోజుల పాటు వెతికారు. చివరికి ఆశ వదులుకున్నారు.
కొన్నాళ్ల తరువాత హర్భజన్ మిత్రుడు ప్రీతం సింగ్ కి హర్భజన్ కలలో కనిపించి, తాను ఎక్కడ ఉన్నాడో చెప్పి, తన భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు చేయమని, తనకు సమాధి కట్టించమని అడిగాడు. మొదట్లో ప్రీతమ్ సింగ్ పట్టించుకోలేదు. కానీ కొన్నాళ్ల తరువాత తనకు కలలో చెప్పిన చోటే హర్భజన్ భౌతిక కాయం దొరికింది. అప్పుడు ప్రీతమ్ తన కల గురించి అధికారులకు చెప్పాడు. వారు హర్భజన్ కి సమాధి కట్టించారు. ఆ తరువాత నుంచీ తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు హర్భజన్ సైనికులను ముందుగానే హెచ్చరించినట్టు కలలు వచ్చేవి. సరిగ్గా ఆయన చెప్పిన చోట, చెప్పిన సమయానికే తుఫాన్లు వచ్చేవి. దీంతో సైనికులకు ఆయన పట్ల నమ్మకం పెరిగింది.
సైనికులు, వారి కుటుంబాలు, ఇతర భక్తులు బాబాకు చెప్పులు, టూత్ బ్రష్ వంటివి సమర్పించుకుంటారు. చెప్పులు సమర్పిస్తే కాళ్ల నొప్పులు తగ్గుతాయట. టూత్ బ్రష్ లు ఇస్తే పంటి నొప్పి పోతుందిట. అంత దూరం రాలేని వారు బాబాకి లేఖలు వ్రాసి తమ బాధలు చెప్పుకుంటారు. వెంటనే పరిష్కారం దొరుకుతుందట.
బాబా బతికే ఉన్నాడని ఆయన ఎకౌంట్ లో జీతాన్ని జమ చేస్తారు. ఆయనకు ప్రమోషన్లు ఇస్తారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 15 వరకూ ఆయనకు సెలవులు ఇస్తారు. 2009 దాకా సైన్యం ఆయనకు జీతాన్ని ఇచ్చేది. ఒక హేతువాది కేసు వేయడంతో సైన్యం జీతాన్నివ్వడం ఆపేసింది. సైనికులే చందాలు పోగు చేసి బాబాకు జీతాన్నిస్తున్నారు.
హేతువాదులిదంతా ఉత్త ట్రాష్ అంటారు. కానీ సరిహద్దుల్లో పొంచి ఉన్న మంచు మృత్యువుతో అనుక్షణం పోరాడే జవాన్లకు మాత్రం హర్భజన్ దన్నుగా ఉన్నాడన్న నమ్మకం ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. సరిహద్దుల్లో ఉన్న తమ వారిని హర్భజన్ కాపాడతాడన్న ధీమాతో కుటుంబసభ్యులు నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నారు.
బాబా సెలవుల్లో వెళ్లినప్పుడు మిగతా సైనికులందరి సెలవులూ రద్దయిపోతాయి. సైనికులు మామూలు కన్నా మరింత అప్రమత్తంగా ఉండి గస్తీలు నిర్వహిస్తారు. ఎందుకంటే ముందస్తుగా హెచ్చరించేందుకు బాబా ఉండరు మరి!
Sudhakar garu, you are picking up issues that were buried in history. digging history to inspire others. a good thing continue it.
ReplyDelete