దేవుడు లేకపోతే.....? - Raka Lokam

దేవుడు లేకపోతే.....?

Share This

"దేవుడు లేకపోతే......?"
ఇది పిల్లవాడి ప్రశ్న!
"కొబ్బరికాయలో నీళ్లెలా వస్తాయి?" అన్న ఎదురు ప్రశ్న వేస్తుంది తల్లి.....
గుడిగోపురం నుంచి వందలాది పక్షులు రెక్కలు పటపటలాడిస్తూ ఆకాశంలోకి ఎగురుతాయి....
ఈ మధ్య రేడియో తరచూ వినిపించే, టీవీల్లో తరచూ కనిపించే వ్యాపార ప్రకటన ఇది.....

"దేవుడు లేకపోతే..........?"
ఇదే ప్రశ్న బ్రహ్మసమేధ్యంలో వేస్తే.....
"అయ్యలూరి జగన్మోహన భైరవ స్వామి ఆ వూళ్లో ఎందుకుంటాడు?" అన్న ఎదురు ప్రశ్న వస్తుంది.
గాలికి కొబ్బరి చెట్ల ఆకులు గలగలలాడతాయి....

నిజం....
బ్రహ్మసమేధ్యంలో దేవుడున్నాడు .... అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి ఉన్నాడు...
దేవుడున్నాడు కాబట్టే అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి ఉన్నాడు.

తూరుపు సముద్రతీరం.... తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని చిట్టచివరి మత్స్యకార గ్రామం పల్లంకుర్రు .... !
దాటితే మడ అడవులు... బురద.... ఆ తరువాత నీలినీళ్ల సముద్రం ..... ఆ మధ్యలో ఒక చిన్న ద్వీపం.... అదే బ్రహ్మసమేధ్యం.
ద్వీపమంటే ఒక విశాలమైన ఇసుకతిన్నె....అంతే....
ఒక ఆరేడు కొబ్బరి చెట్లు....
ఒక రెండు గదుల ఇల్లు....
ఒక గుడి.....
ఆ ఊళ్లో ఇంకెవరూ లేరు... ఇంకెవరూ రారు.
ఆఇంట్లో అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి, ఆయన భార్య, పిల్లలు ఉంటారు.
ఆ గుడిలో బ్రహ్మేశ్వర స్వామి, భైరవస్వామి, ధనలక్ష్మి, దుర్గ అమ్మవారు కొలువుంటారు.
అయ్యలూరి జగన్మోహన భైరవస్వామి ఉదయం, సాయంత్రం గుడిలో దీపం వెలిగిస్తాడు. వండుకున్నది నైవేద్యం పెడతాడు. వచ్చిన నాలుగైదు మంత్రాలు చదువుతాడు. ఎండ, వాన, చలి, తుఫాను, సుడిగాలి... ఏది వచ్చినా ఈ క్రమం తప్పదు. బుద్ధి తెలిసినప్పట్నుంచీ ఆయన ఇదే చేస్తున్నాడు. ఆయన తండ్రీ ఇదే చేశాడు. రేపు జగన్మోహన భైరవస్వామి కొడుకూ ఇదే చేస్తాడు.
దాదాపు డెబ్భై ఏళ్ల క్రితం పశ్చిమగోదావరి భీమవరం దగ్గర్లోని బొందాడ నుంచి తండ్రి బ్రహ్మసమేధ్యానికి తరలివచ్చాడు. 1967 లో ఆయన చనిపోయాడు. అప్పట్నుంచీ జగన్మోహన భైరవస్వామే ఆ గుడికి పూజారిగా ఉంటూ వస్తున్నాడు.

బ్రహ్మసమేధ్యానికి ఆ పేరు ఎందుకొచ్చింది?
తెలియదు.
ఆ గుడి ఎప్పుడు, ఎవరు, ఎందుకు కట్టారు?
తెలియదు?
ఆ గుడి ప్రత్యేకత ఏమిటి?
తెలియదు.
ఎందుకంటే ఆ గుడి గురించి చెప్పగలిగిన ఒకే ఒక్కవ్యక్తికి కూడా ఆ గుడి గురించి ఏమీ తెలియదు.
బ్రహ్మేశ్వరుడు తెలుసు... ఆయనను పూజించాలని తెలుసు. అంతే....!!

బ్రహ్మసమేధ్యం వెళ్లాలంటే పల్లంకుర్రు నుంచి పడవే గతి. అదీ నాలుగు కిలోమీటర్ల పాటు మడ అడవుల మధ్య నుంచి వెళ్లాలి. (మడ అడవులంటే సముద్రం, నది కలిసే చోట బురద, ఉప్పునీటిలో పెరిగే చెట్ల అడవులన్నమాట. ఈ చెట్లకి శ్వాసించే వేళ్లు ఉంటాయి. ఈ అడవులను ఇంగ్లీషులో మేంగ్రూవ్స్ అంటారు). పల్లంకుర్రు కాకుండా ఇంకో ఊరు వెళ్లాలంటే చిరయానాంకి వెళ్లాలి. అక్కడికి దాదాపు నలభై నిమిషాల పడవ ప్రయాణం.

అయ్యలూరి జగన్మోహన భైరవ స్వామి అంటే మన పూజారి గారు వారాని ఒక సారి పడవలో పల్లంకుర్రు వచ్చి, ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కుని వెళ్తాడు. బయటి ప్రపంచంతో అతని సంబంధం అదొక్కటే. మత్స్యకారులు ఇచ్చే వస్తువులు, నలభై కిలోల బియ్యం, నెలకి వెయ్యి రూపాయల జీతంతోనే ఆయన బతుకు గడుస్తుంది.
మొదట్లో మూడొందల కొబ్బరిచెట్లు ఉండేవి. కాయ దింపుకుని, అమ్ముకుంటే ఏడాది గడిచిపోయేది. 1996 తుఫానులో చెట్లన్నీ పడిపోయాయి. ఆరు చెట్లు మాత్రం మిగిలాయి. అప్పట్నుంచీ మత్సకారుల ఆర్ధిక సాయంతోనే బతుకుతున్నారు పూజారిగారు.
1996 తుఫానులో ఉన్న ఇల్లు నేలమట్టమైపోయింది. తండ్రిగారి ఏకైక ఫోటోని సముద్రుడు తీసేసుకున్నాడు. అంతే కాదు.... పెద్దబ్బాయి అబ్బులును కూడా తన దగ్గరే ఉంచేసుకున్నాడు. తుపాను మహాబీభత్సంగా ఉండటంతో కుటుంబసమేతంగా మొత్తం బ్రహ్మేశ్వరుడి గర్భగుడిలోకి వచ్చి, తలుపులు మూసుకుని శివలింగాన్ని వాటేసుకుని రెండు రాత్రులు గడిపారు. అబ్బులు రావడం కాస్త ఆలస్యమైంది. సముద్రుడికి నైవేద్యమైపోయాడు.
తుపాను సాయం అందలేదు. కొడుకుపోయినందుకు సర్కారీ నష్టపరిహారం అందలేదు.

అయినా బ్రహ్మేశ్వరుడిని వదల్లేదు మన జగన్మోహన భైరవస్వామి.
ఎవరూ లేని, ఎవరూ రాని ఊళ్లో ఒంటరిగానే పూజ, అర్చన, నైవేద్యం, ధూపదీపాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.

బ్రహ్మసమేధ్యంలో ఏడాదికొక్కసారి చొల్లంగి అమావాస్య సమయంలో జాతర జరుగుతుంది. అదీ రాత్రిపూట. అప్పుడు అక్కడ జనమే జనం....
ఆ మరుసటి రోజు నుంచీ మళ్లీ బ్రహ్మేశ్వరుడు, ఆయనతో జగన్మోహన భైరవస్వామి ఒంటరిగానే ఉంటారు.

పాత హిందీ భజన ఒకటుంది.

మందిర్ సూనా ఎక దేవ బినా....
దేవ సూనా ఎక భక్త బినా....


(దేవుడు లేని మందిరం శూన్యం... భక్తుడు లేకపోతే దేవుడే శూన్యం.....).

బ్రహ్మసమేధ్యం వెళ్తే ఈ మాట అక్షరసత్యం అనిపిస్తుంది.

బ్రహ్మసమేధ్యం వెళ్లడం కష్టం... అయినా ఒకసారి వెళ్లండి.
బ్రహ్మేశ్వరుడిని చూసేందుకు కాదు.... ఆయన ఇంకేదో పేరుతో ఎక్కడంటే అక్కడ దొరుకుతాడు....
బ్రహ్మసమేధ్యం వెళ్లాల్సింది నమ్మకం ఎలా ఉంటుందో చూసేందుకు....
అక్కడ నమ్మకం అయ్యలూరి జగన్మోహన భైరవస్వామిలా ఉంటుంది......!!!

2 comments:

  1. Hi Sir....I want to meet that Swamy Sir....will definitely try to go AEAP.....Thank You for such a touching info.....

    ReplyDelete
  2. Make a documentary on the pujari .... Jyothi....Thanks for reading ... and commenting.

    ReplyDelete

Pages