రెండు కప్పలు పొరబాటున బావిలో జారిపడ్డాయి....
మళ్లీ ఆ బావి నుంచి పైకి రావాలని, తమ మిత్రులతో కలిసి మళ్లీ ఆనందంగా బెకబెకలాడాలని అనుకున్నాయి.
ఆ బావికి దిగుడు మెట్లు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా ఎక్కితే పైకి రావచ్చు. అందుకే బలం పెట్టి, ఊపిరి బిగబట్టి పైకి ఎగరసాగాయి.
ఎంత ఎక్కినా మెట్టు చేరుకోలేకపోతున్నాయి.
పైనున్న మిగతా కప్పలన్నీ బావి గట్టు అంచున చేరి.... "మీరిక పైకి రాలేరు. మెట్లు చాలా ఎత్తున ఉన్నాయి. ఇక అక్కడే సుఖంగా ఉండండి.... " అని కన్నీరు పెట్టుకున్నాయి.
ఇంకొన్ని "అప్పుడప్పుడూ వచ్చి పలకరిస్తూ ఉంటాం... అక్కడే ఉండండి....ఇక చేయగలిగేదేముంది" అన్నాయి.
ఇదంతా చూసిన ఒక కప్పకి ఎక్కడలేని నిరాశ వచ్చింది. నీరసం వచ్చేసింది. ఎగరడం మానేసింది.
"ఇక నా బతుకు ఇంతే... "అనుకుంది. తనలో తాను కుమిలిపోసాగింది.
రెండో కప్పకి కాస్త చెవుడు. దానికి ఇవేవీ వినిపించలేదు. అది పట్టు విడవలేదు. ఎగురుతూనే ఉంది. చివరికి ప్రయత్నించగా ... ప్రయత్నించగా ఎలాగోలా ఒక మెట్టు ఎక్కేసింది.
కాస్త ఉత్సాహం వచ్చింది.
మరింత ప్రయత్నించింది. రెండో మెట్టు ఎక్కేసింది.
ఉత్సాహం మరింత పెరిగింది....
అలాగే మూడు... నాలుగు... అయిదో మెట్టు... మిగతా మెట్లు ఎక్కింది.
"ఇంకొన్ని మెట్లే. అవి ఎక్కేస్తే చాలు" అనుకుంది....
కిందనున్న కప్ప పొగిలిపొగిలి పెడబొబ్బలు పెడుతూనే ఉంది.
పైనున్న కప్పలు... "ప్రాణాల మీదకి తెచ్చుకోకు... పడిపోతావ్... ఎముకల్లోకి సున్నం మిగలదు...." అంటూ వద్దు వద్దంటూ చేతులు ఊపుతూనే ఉన్నాయి.
ఈ కప్ప మాత్రం చూస్తూ చూస్తూ ఉండగానే పైకి ఎక్కేసింది.
"మేమింత అరుస్తూనే ఉన్నా ఎలా ఎక్కేశావు? ఎంత ఎత్తు ఎక్కావో తెలుసా....? నీకు భయం వేయలేదా?" మిగతా కప్పలు అడిగాయి.
"అయ్యో ...... మీరు అరుస్తున్నారా...... నాకేం వినపడలేదు..... నేను మీరంతా నన్ను ఉత్సాహపరుస్తూ చెయ్యూపుతున్నారనుకున్నాను. ఇక భయం సంగతంటారా... కిందకి చూస్తే కదా భయం వేయడానికి. నా చూపంతా పైనే ఉంది ...."అంది ఆ కప్ప.
No comments:
Post a Comment