ఒకాయనకి ఇద్దరు పిల్లలు...
పెద్దవాడికి స్టార్టింగ్ ట్రబుల్.... ఏం మాట్లాడాలో తెలియదు.....
రెండో వాడికి బ్రేక్ ఫెయిల్యూర్... ఎక్కడ ఆపాలో తెలియదు....
పొరుగింట్లో వయసొచ్చిన కుర్రాడు చనిపోయాడు. పరామర్శించాలి. తండ్రి పొరుగూళ్లో ఉన్నాడు. ఫోన్ చేసి పెద్దవాడిని వెళ్లి పరామర్శించి రమ్మన్నాడు.
"నాన్నా ... నీకు తెలుసుకదా... నాది స్టార్టింగ్ ట్రబుల్.... ఏం మాట్లాడాలి?"
"కంగారు పడకు. దారిలో చనిపోయిన వాడి గురించి అంతా ఏమనుకుంటున్నారో విను. అదే చెప్పు... సరిపోతుంది," అన్నాడు తండ్రి.
సరేనని వెళ్లాడు పెద్దబ్బాయి.... దారిలో వాళ్లవీళ్ల మాటలు విన్నాడు. పుత్రశోకంతో రోదిస్తున్న తల్లిదండ్రులకు అదే చెప్పాడు.
"మీరేం బాధపడకండి. మీవాడు చావడంతో పీడ విరగడైంది. వాడు మహాపాపి... అమ్మాయిలను ఏడిపించేవాడు. పచ్చి తాగుబోతు... పరమ తిరుగుబోతు..." అన్నాడు.
దాంతో కొడుకుపోయిన దుఃఖంతో ఉన్న వాళ్లు మనోడిని చావచితకబాదారు. వాడు భోరుమంటూ ఇంటికొచ్చేశాడు.
తమ్ముడు ఇది చూశాడు...
"అయ్యో... నాన్నగారెంత పనిచేశారు..... నిన్ను పంపించారు.... అన్నయ్యా కంగారుపడకు... నేనంతా సర్దిచెప్పి, చక్కదిద్ది వస్తానులే" అని బయలుదేరాడు.
పొరుగింటికి వెళ్లాడు.... విషాదంగా ముఖం పెట్టాడు....
"మీకు ఎంత కష్టం వచ్చిపడింది.... చెట్టంత కొడుకు పోయాడు.. ఎంత దుఃఖం.... ఎంత కష్టం"
కాస్సేపాగి...
"అయినా మా అన్నయ్యకి బుద్ధిలేదు... ఈ విషాద సమయంలో మాట్లాడాల్సిన మాటలేనా అవి.... వాడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఏమీ అనుకోకండి." అన్నాడు.
అక్కడిదాకా బాగానే ఉంది.
ఆ తరువాతే బ్రేకులు ఫెయిల్ ....
"మా అన్నయ్య సంగతి మీకు తెలుసు కదా... ఏం మాట్లాడాలో తెలియదు. మేం వాడికి ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం లెండి...."
అక్కడ ఆగినా బాగుండేది. కానీ బ్రేకులు ఫెయిల్ కదా....
"మీరేం బాధపడకండి... మీ రెండో అబ్బాయి ఉన్నాడు కదా... వాడూ ఎప్పుడో ఒకప్పుడు చావక మానడు కదా.. అప్పుడు సరైన రీతిలో సానుభూతి తెలుపుతాం లెండి." అనేశాడు.
బ్రేక్ ఫెయిలైన బండి చెట్టుకు గుద్దుకుంటే ఏమవుతుందో మనోడిదీ సరిగ్గా అదే పరిస్థితి.
మాట కారు లాంటిది.
దానికి స్టార్టింగ్ ట్రబుల్ ఉండకూడదు.
బ్రేక్ ఫెయిల్యూర్ అస్సలు ఉండకూడదు......
(ఈ కథలో ఇంకొక్క మాట ఎక్కువ వ్రాసినా...
నా బ్రేకు ఫెయిలయినట్టే)
No comments:
Post a Comment