జెండా ఎగరని రోజు... జెండా ఎగరేయని రాజు.... - Raka Lokam

జెండా ఎగరని రోజు... జెండా ఎగరేయని రాజు....

Share This



మనలో చాలా మందికి మువ్వన్నెల జెండా పెద్దగా పట్టదు.
క్రికెట్ మ్యాచ్ లో మనోళ్లు గెలిస్తే తప్ప ....
కానీ మన దేశంలోనే ఉండి.... మన జెండా మనమే ఎగరేయలేని పరిస్థితి వస్తే.....
నమ్మండి.... నిజంగానే ఊపిరాడదు. గుండెల మీద ఏదో ఏనుగెక్కి తొక్కినట్టుంటుంది. అవమానభారంతో తల దించేసుకోవాలనిపిస్తుంది.
దీనికి పెద్దగా దేశభక్తుడు కానవసరం లేదు.

అవి నేను అసొంలో ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేస్తున్న రోజులు....
జనవరి 26, 1994.
అసొంలో ఉల్ఫా ఉగ్రవాదులు జనవరి 26 ను బహిష్కరించమని పిలుపునిచ్చారు. అప్పట్లో ఉల్ఫా అంటే దడ. అంతెందుకు యమహా బండిలో హెల్మట్లు పెట్టుకుని ఇద్దరు కుర్రాళ్లు నడుపుకుంటూ వెళ్తే చాలు ఊళ్లకు ఊళ్లు హడలెత్తిపోయేవి. ఒకానొక దశలో అసొంలో హెల్మెట్లను నిషేధించారు కూడా.
జనవరి 26 న డిబ్రూగఢ్ నగరంలో ఒక్క జెండా కూడా ఎగరలేదు. ఆఖరికి పోలీసు లైన్లలోనూ జెండా ఎగరలేదు. కలెక్టర్ (అక్కడ డిస్ట్రిక్ట్ కమిషనర్ అంటారు) కార్యాలయంలో కూడా హడావిడిగా పహరా మధ్య జెండా ఎగరేసి, హుటాహుటిన దింపేశారు. మధ్యాహ్నానికి ప్రధానఅధికారులు పత్తా లేకుండా పోయారు.
నగరం నగరమంతా బంద్... దుకాణాలు, స్కూళ్లు, ఆఫీసులు అన్నీ బంద్. ఒక్క జెండా కూడా ఎగరలేదు.
చిరుగాలులు వీస్తున్నా ఊపిరాడటం లేదు...
జనవరి చలిలో చెమటలు పట్టేశాయి.
మన దేశంలో....మనం జెండా ఎగరేసుకోలేమా?
ఏదో తెలియని ఉన్మాదం ఆవరించింది. తోటి కుర్రాళ్లు ఇద్దరిని పోగేసి, నా కార్యాలయం ముందు అప్పటికప్పుడు మూడు రంగుల జెండాను ఎగరేశాను.

అంతలో దారికి అటువైపు నుంచి ఒక ముసలాయన భారంగా అడుగులు వేస్తూ, మరో మాటలో చెప్పాలంటే కాళ్లు ఈడుస్తూ వస్తున్నాడు.
ఎంతైనా ఉల్ఫా ఉగ్రవాదుల భయం కదా వచ్చీపోయే వాళ్లను గమనిస్తూనే ఉన్నాను. ఆయననీ చూస్తూనే ఉన్నాను.
హఠాత్తుగా ఆయన మా కేసి చూశాడు.
మాకు భయం పెరిగింది......
ఆయన నడక వేగం పెరిగింది.....
నా తో ఉన్న కుర్రాళ్లు నా వెనక్కి నక్కినంత పనిచేశారు.
ఊగిపోతున్నట్టు మా దగ్గరకి వచ్చేశాడు ఆయన...
ఆయన కళ్లనుంచి ధారగా కారుతున్నాయి కన్నీళ్లు....
"రోజు రోజంతా ఈ జెండా కోసం పిచ్చాడిలా తిరుగుతున్నాను.... డిబ్రూగఢ్ లో ఈ రోజు ఒక్క జెండా కూడా ఎగరలేదు....నేనెవరో తెలుసా? బ్రిటిషర్లు వందేమాతరం నినాదాన్ని నిషేధిస్తే త్రివర్ణపతాకాన్ని చేత పుచ్చుకుని లాఠీదెబ్బలు తిన్న వాణ్ణి. జైల్లో ఉన్నవాణ్ణి....అది బ్రిటిషర్ల కాలం. ఇప్పుడు మనోళ్ల కాలంలోనే మన జెండా ఎగరడం లేదు. జెండా ఎగరని ఈ ఊళ్లో ఉండటం కన్నా బ్రహ్మపుత్రలో మునగడం మేలని నది వైపు వెళ్తూండగా నాకీ జెండా కనిపించింది. నా ప్రాణం లేచొచ్చింది." గడగడా చెబుతున్నాడాయన. ఆవేదన ఎగశ్వాసలా తన్నుకొస్తోంది. ఆయన చొక్కాకి ఉన్న చిన్న త్రివర్ణ పతాకం బ్యాడ్జి ఎగసెగసి పడుతోంది. ఆయన ఒళ్లంతా కంపిస్తోంది. ఆయన కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి.
"రండి... లోపలకి రండి... మీ కోసం నేను టీ తయారు చేస్తాను" అన్నాను.
"తప్పకుండా టీ తాగుతాను... కానీ లోపలికి రాను... ఒక కుర్చీ ఇవ్వు... ఇక్కడే కూచుంటాను."
"ఎందుకు?"
"ఏ టెర్రరిస్టో వస్తే వాడి తూటాకి నా ఛాతీ ఎదురుపెట్టాలి....జెండా కోసం చనిపోయిన వాడిలా చిరంజీవిలా బతకాలి. ఈ ముసలి బతుకుకి ఇంతకన్నా ఇంకేం కావాలి? అందుకే ఇక్కడే కూచుంటాను."
ఆయన గర్వంగా జెండా కిందే కూర్చున్నారు.

గాలి బలంగా వీచింది....
జెండా రెపరెపలాడింది.

జెండా పండుగ రోజు జెండా ఎగరేయని వాళ్లను చూస్తూంటే వాళ్లంతా ఒక్కసారి జెండా ఎగరేయలేని వాళ్లని చూస్తే ఎంతో బాగుండు అనిపిస్తుంది. ఇప్పటికీ జనవరి 26 వస్తే ఆ ముసలాయన, మ్లానమైన ఆయన ముఖం, కళ్లనిండా కన్నీరు, దుఃఖంతో ఎగసిపడుతున్న ఆయన ఛాతీ, ఆ ఛాతీపై మువ్వన్నెల బ్యాడ్జి గుర్తుకొస్తాయి.



జెండా ఎగరేయని రాజు....





రిపబ్లిక్ డే నాడు గవర్నర్ జెండా ఎగరేయాలి. అది ఆనవాయితీ...
మన హైదరాబాద్ 1948 సెప్టెంబర్ 17 న నిజాం ఏలుబడి నుంచి విముక్తమైంది. 1950, జనవరి 26 న మనకు రిపబ్లిక్ హోదా వచ్చింది. రాజ్యాంగం వచ్చింది.
హైదరాబాద్ లో అదే రోజు నిజాంని భారతప్రభుత్వం రాజ్ ప్రముఖ్ గా నియమించింది. చాలా సంస్థానాల్లో మాజీ రాజులనే రాజప్రముఖ్ లు గా నియమించడం జరిగింది. ఎంత నిరంకుశ నియంత అయినా, ఎంత మతోన్మాది అయినా నిజాం కూడా రాజ్ ప్రముఖ్ అయ్యారు.
ఆయన ఆ పదవిలో ఆరేళ్లు ఉన్నారు.
ఈ ఆరేళ్లలో ఆయన ఒక్కసారైనా మన జాతీయ పతాకాన్ని ఎగరేశారా?
ఒక్కసారైనా త్రివర్ణ పతాకానికి జైహింద్ అని సెల్యూట్ చేశారా?
ఆయన జెండా ఎగరేసిన దాఖలాలు లేవు. దాని గురించి చరిత్రకారులు పూర్తిగా మౌనం పాటించారు. హైదరాబాద్ చరిత్ర గురించి పుంఖానుపుంఖంగా వ్రాసిన వారెవరూ నిజాం జెండా ఎగరేసినట్టు వ్రాయలేదు.
అంటే త్రివర్ణపతాకం ఎగరేయకుండానే ఆయన రాజప్రముఖ్ గా మనందరి గౌరవాన్ని పొందారా?
తెలిసిన వారెవరైనా నా సందేహాన్ని నివృత్తి చేస్తే సంతోషిస్తాను.

4 comments:

Pages