బాణం ములుకులా ఆకాశంలోని సూటిగా దూసుకుపోయినట్టుండే కొండ....
చెట్లు చేమల పచ్చని తివాచీని మధ్యకెవరో చీల్చేసినట్టు బారుగా మెట్లు....
ఒకటి కాదు... రెండు కాదు.... ఆరువందల యాభై మెట్లు......మొత్తం 120 మీటర్ల ఎత్తు.....
పెడితే పాదం పట్టనంత చిన్న మెట్లు.....ఇరుకైన మెట్లు....
కిందకి చూస్తే కళ్లు తిరుగుతాయి... పైకి చూస్తే బ్యాలెన్స్ తప్పుతుంది....
మెట్టుమెట్టుకీ పిక్కలు పట్టేస్తాయి.... ఎత్తెక్కినకొద్దీ ఎగశ్వాస....
నరసింహస్వామంటే ఆషామాషీ కాదు... ఆ మాత్రం కష్టపడాలి....
కోరుకొండ అంటే కోరిన కోరికలు తీర్చే కొండ. కోరుకున్నవి పొందాలంటే కష్టించాలి, చెమటోడ్చాలి. గుండె గొంతుకలోకి వచ్చేలా పరిశ్రమించాలి. అప్పుడే కోరుకున్నవి దొరుకుతాయని చెబుతుందా అన్నట్టు ఉంటుంది కోరుకొండ.
మనం రొప్పుతూ ఆయాసపడిపోతూంటే బుడ్డోళ్లు కిలకిలా నవ్వుతూ బిరబిరా ఎక్కేస్తారు. వాళ్లకి కోరికలుండవు. ప్రయాణమే ఒక సరదా. నిజానికి బతుకు అలాగే సాగించాలేమో....
ఊపిరందక మనం ప్రయాసపడిపోతూంటే పూజారిగారు నైవేద్యాన్ని నెత్తినపెట్టుకుని విష్ణునామాన్ని స్మరిస్తూ అవలీలగా ఎక్కేస్తూ కనిపిస్తారు. నిజమేనేమో.... దేవుడినే స్మరించుకుంటే కష్టమే తెలియదేమో....
"బాబూ మెట్లు నిటారుగా సూటిగా ఎక్కకండి. మెట్టు ఒక కొననుంచి ఎక్కండి. అడుగులు వంకరగా వేయండి. కుడినుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఇలా జిగ్ జాగ్ పద్ధతిలో మెట్లెక్కండి. కష్టం తెలియదు." అని ఎవరో ఒకరు చెబితే అలాగే ఎక్కుతాం. పని కాస్త సులువౌతుంది. అవును .....వంకరగా ఎక్కితే మెట్టుపై పూర్తిపాదం పడుతుంది మరి... "తినగ తినగ వేము తియ్యనుండు... యోగః కర్మసుకౌశలం అంటే ఇదేనేమో" అనిపిస్తుంది.
నిజమే మరి...
అయితే పసిపిల్లాడి మనస్తత్వంతో ఆడుతూ పాడుతూ బతుకు కొండను ఎక్కాలి.
లేకపోతే పూజారిలా నిత్యం దేవుడిని స్మరిస్తూ కొండ కొనకు చేరాలి.
అదీ కాదంటే పనిచేసే పద్ధతిలో మెళకువలు తెలుకున్నా అలసట తగ్గుతుంది.
ఇంత కష్టపడి కొండ పైకి చేరుకునేసరికి ఆకాశంలో రెక్కలు రెపరెపలాడించకుండా అనాయాసంగా తేలిపోతూ యోగిలా స్వేచ్ఛగా విహరించే గరుడపక్షి కనిపిస్తుంది. ముముక్షు మార్గమే మోక్షమార్గమని చెబుతున్నట్టు అనిపిస్తుంది.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి మందిరం పైకి ఎక్కే లోపు ఈ భావాలన్నీ అనిపిస్తాయి.
పైకి వెళ్లాక ఒక్క క్షణం మనల్ని మనం మైమరచిపోతాం. ఎందుకంటే ఆ కొండ ఎత్తులనుంచి అంతా నున్నన్ని పచ్చని తివాచీ లాగానే కనిపిస్తుంది. దారులు సరళ రేఖల్లా కనిపిస్తాయి. అప్పుడెప్పుడో కాకతీయులు కట్టించిన గొలుసు చెరువుల రహస్యాలన్నీ కనిపిస్తాయి. ఒక చెరువు అలుగు నీరు ఇంకో చెరువుకి మోసుకెళ్లే కాలువల జాలం కనిపిస్తుంది. అసలు మనం నరసింహుడి దర్శనం కోసం వచ్చామన్న విషయాన్నే మనం మరిచిపోతాం...వాటి నుంచి ఎలాగోలా దృష్టి మళ్లించినా, గుడిగోడలపై అపురూప శిల్పసంపద చూసి మైమరిచిపోవడం ఖాయం.
అవును... మనిషి జీవితంలో చాలా సార్లు జరిగేది ఇదే. కష్టాలు మనల్ని ఎలా దారిమళ్లిస్తాయో, కనువిందులు కూడా మనల్ని అంతే అవలీలగా పథభ్రష్టుల్ని చేస్తాయి. కష్టాలు విశ్వాసాన్ని వీగిపోయేలా చేస్తే, సుఖాలు విశ్వాసాన్నే మరిచిపోయేలా చేస్తాయి.
అయితే దేవుడు కూడా తెలివైన వాడు. అందుకే కోరుకొండ దేవుడి గుడి పొద్దున ఎనిమిదింటి నుంచి 11 గంటల వరకే తెరిచి ఉంటుంది. అందుకే ప్రకృతి అందాల మోహపాశాన్ని తెంచుకుని గర్భగుడిలోకి వెళ్లక తప్పదు. అప్పుడు దర్శనమిస్తాడు లక్ష్మీ నరసింహుడు. ఇంతా చేస్తే తొమ్మిదంగుళాల దేవుడు. కానీ ఆ ఒంటరి గుడిలో ఉన్న నరసింహుడిని చూడగానే ఒళ్లు గగుర్పొడుస్తుంది. "ఇక్కడున్నావా తండ్రీ" అనిపిస్తుంది. తల్లి లక్ష్మమ్మ తోడుగా ఉంటుంది. లక్ష్మీదేవి తోడున్నందుకే ఆయన ఉగ్రనరసింహుడు, వ్యాఘ్రనరసింహుడూ కాక శాంత నరసింహుడిగా కొలువుంటాడు. అందుకేనేమో మనసును తెలియని ప్రశాంతి ఆవరిస్తుంది.
అహోబిలం (కర్నూలు), ఆగిరిపల్లి (కృష్ణా జిల్లా), మంగళగిరి (గుంటూరు) ల్లో లాగానే కోరుకొండలోనూ కొండ కింద ఒక గుడి, పైన ఒక గుడి ఉంటాయి. కింద గుడిలో పూజాదికాలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతాయి. పై గుడి పదకొండు గంటల వరకే తెరిచి ఉంటుంది. పైన ఉన్న నరసింహుడు స్వయంభువైతే, కింద ఉన్న వాడు ప్రతిష్ఠిత మూర్తి. పైన నైవేద్యం పెట్టి, గంట కొడితే తప్ప కింద నైవేద్యం పెట్టడం జరగదు.
రాజమండ్రి నుంచి రంపచోడవరం వెళ్లే దారిలో ఇరవై కిలోమీటర్ల వద్ద కోరుకొండ ఉంది. ఊరంతటినీ కాపాడేందుకు నిలుచున్నాడా అన్నట్టు కొండపై దేవుడు కొలువుంటాడు. ఆ ఊళ్లో ఎటు వైపు నుంచి చూసినా గుడి కనిపిస్తుంది. దేవుడి కొండ అనే కాండానికి కొమ్మల్లా వీధులు, ఆకుల్లా ఇళ్లూ విస్తరించినట్టు అనిపిస్తుంది.
ఇప్పుడైతే కోరుకొండ ఒక మండల కేంద్రం. కానీ ఒకప్పుడు గోదావరి తీరప్రాంతమే స్థావరంగా ముస్లిం ఆక్రమణదారులపై పోరు సల్పి, ఆంధ్రదేశాన్ని విముక్తం చేసిన నాయకరాజుల రాజధాని రేకపల్లికి కోరుకొండకి దగ్గరి సంబంధాలుండేవి. ముమ్మడి నాయకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ దేవాలయానికి భూములు, తోటలు, గ్రామాలు మాన్యంగా ఇచ్చినట్టు చెప్పే శాసనాలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ తాలుకా లక్ష్మణేశ్వర దేవాలయంలో ఉన్న 1443 నాటి శిలాశాసనాల్లోనూ వ్రాసి ఉన్నాయి. హైందవ రాజుల లోని విభేదాలను తొలగించడంలో కీలకపాత్ర వహించిన శ్రీనాథ కవిసార్వభౌముడు (ఆయనలోని ఈ కోణం గురించి పెద్దగా వ్రాయడం జరగలేదు) ఈ గుడిలో పూజించాడని తెలిపే శాసనాలున్నాయి. ఆయన ఈ కొండను వేదాద్రి అన్నాడు. నాయకులు, రెడ్లు, అంతకు ముందు తూర్పు చాళుక్యుల, మధ్యలో కొన్నాళ్లు కాకతీయుల పాలనను చూసిన గుడి కోరుకొండ. ఈ గుడికి అల్లంత దూరంలోనే ఉన్న బౌద్ధ విహారం తాలూకు భగ్నావశేషాలు, గుడిలో అక్కడక్కడా పడి ఉన్న భగ్న శివలింగాల పానపట్టాలు ఈ ప్రాంతంలో ఒకప్పటి మతావేశాల తాలూకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. కానీ ఎనిమిది వందల ఏళ్లుగా పరాశర భట్టర్ అనే తమిళ బ్రాహ్మణుల కుటుంబమే నారసింహునికి ఆర్చకత్వం చేస్తోంది. కాబట్టి కనీసం అన్నేళ్లుగా ఇది విష్ణ్వాలయమే.
కోరుకొండ తీర్థం నిజంగా కన్నుల పండగే. తీర్థంలో ఇక్కడ దొరికే జీళ్లని తినడం ఒక అనుభూతి అయితే కేవలం బెల్లంతో చేసే జీళ్ల తయారీని చూడటం ఇంకో అనుభూతి. మహామహా రాజకీయనేతలు, కోటీశ్వరులు బళ్లను ఆపి మరీ చిన్నపిల్లాళ్లలా జీళ్లనుకొనుక్కుని
పదవులు, బిజినెస్సులను పక్కనబెట్టి దారి దారంతా చూయింగ్ గమ్ లకు తాతల్లాంటి జీళ్ల టేస్టుకి ఏకగ్రీవంగా ఓటేసుకుని బాల్యం లోకి జారిపోవడం చూస్తే విచిత్రంగా ఉంటుంది.
ఊరు దాటేసి వచ్చినా చాలా దూరం వరకూ వెనక్కి తిరిగి చూస్తే ... అన్నీ గమనిస్తున్నట్టు నరసింహుడి కోరుకొండ కనిపిస్తూనే ఉంటుంది.
ఒక్క సారి గుడి చూసి రండి...
మీరు కాళ్ల నొప్పల గురించి మాట్లాడరు...
కోరుకొండ లక్ష్మీనరసింహుడి వైభవం గురించే మాట్లాడుకుంటారు...
No comments:
Post a Comment