మోక్ష ..... - Raka Lokam

మోక్ష .....

Share This


"స్వామీ నాకు మోక్షమార్గాన్ని తెలపండి" అని అడిగాడు ఒక యువకుడు.
"గంగానదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుంది" అన్నాడు గురువుగారు .
"గంగానదికి దారి చెప్పండి గురువుగారూ"
"ఇలా... ఇదిగో ఉత్తరం వైపు నడుస్తూ వెళ్లు... వెళ్లగా వెళ్లగా ..... ఒక పెద్ద నది వస్తుంది. అదే గంగా నది" అన్నాడు గురువు.

సరేనని శిష్యుడు అప్పటికప్పుడు గంగమ్మతల్లిని తలచుకుంటూ ఉత్తరం దిశగా వడివడిగా కదిలాడు.
అడవులు, కొండలు దాటుతూ పోయాడు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి.
చివరికి ఒక నది వచ్చింది. ఆ నదిని చూడగానే యువకుడు పులకరించిపోయాడు. దాని ఒడ్డునే చిన్న పూరిగుడిసె వేసుకుని అక్కడే ఉంటూ రోజూ స్నానం చేయసాగాడు.

కొన్నాళ్లకు ఒక యోగి ఆ దారిన వెళ్తూ యువకుడి నిష్ఠను చూసి సంతోషించాడు.
"ఏం చేస్తున్నావు నాయనా...?" అని అడిగాడు.
యువకుడు తాను చేస్తున్నది చెప్పాడు.
"పొరబడ్డావు నాయనా... ఇది గంగా నది కాదు... గంగ ఉత్తరం దిశగా ఇంకా చాలా ముందుకు వెళ్లాలి" అన్నాడు.

యువకుడు మళ్లీ బయలుదేరాడు.
పగలూ, రేయనకుండా ప్రయాణం సాగించాడు.
వానల్నీ, వరదల్నీ లెక్కచేయలేదు.
చివరికి ఒక పెద్ద నది కనిపించింది.
ఆనందంతో పొంగిపోతూ దానిలో మునకలేశాడు. ఆడి పాడి స్నానాలు చేశాడు. దాని ఒడ్డునే ఉంటూ రోజూ నదీస్నానాలు చేశాడు.

కొన్నాళ్లకు కొందరు బాటసారులు వచ్చారు.
వారు యువకుడిని "ఇక్కడెందుకున్నావు?" అని అడిగారు.
"గంగమ్మ ఒడిలో రోజూ స్నానాలాడేందుకు ఇక్కడున్నాను" అన్నాడు యువకుడు.
"భలేవాడివే... గంగమ్మ ఇంకా చాలా దూరం... మా తో పాటు రా... తీసుకెళ్తాం" అన్నారు.

యువకుడు వాళ్ల వెంట బయలుదేరాడు.
చలీ, ఎండా, చెమటా, దుమ్మూ దేన్నీ పట్టించుకోలేదు.
నడుస్తూనే పోయాడు.
నెమ్మదినెమ్మదిగా ఆరోగ్యం క్షీణించసాగింది.
మనిషి బక్కచిక్కిపోయాడు. పదేపదే జ్వరం రావడం మొదలైంది. ఒళ్లు భయంకరంగా కాలిపోతోంది. తనువంతా వణికిపోతోంది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. తల తిరుగుతోంది. ఊపిరి పీల్చుకోవడమే భారమైంది.
అయినా అలాగే పాకుతూ, దేకుతూ వారితో వెళ్లాడు.

చివరికి సువిశాలమైన గంగానది రానే వచ్చింది.
అందరూ "హరహర గంగే" అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేస్తున్నారు. గంగమ్మ తల్లి ఒడిలో తానమాడుతున్నారు. దూరం నుంచే ఆ దృశ్యాన్ని చూశాడు ఆ యువకుడు.
అంత జ్వరంలోనూ అతని ఒళ్లంతా పులకరించిపోయింది. పరవళ్లు తొక్కుతూ నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న గంగమ్మను చూడగానే అమితానందంతో రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు.

అంతే....
ఆ క్షణం లోనే అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది..




* * *

యమభటులు ఆ యువకుడిని నరకానికి తీసుకువెళ్లారు.
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ...
"ఈ యువకుడిని నరకం తీసుకువచ్చారేమిటి... ఇతని కోసం మోక్షద్వారాలు తెరుచుకుని ఉన్నాయి. సగౌరవంగా పంపించండి." అన్నాడు. చిత్రగుప్తుడి చిట్టాలో ఈ యువకుడు నిత్యం గంగాస్నానాలు చేసి చేసి ఎనలేని పుణ్యాన్ని గడించాడని, ఇతనికి మోక్షం లభిస్తుందని వ్రాసి ఉంది.

ఇంతకీ ఒక్క సారి కూడా గంగలో మునగకుండానే గంగలో మునిగిన పుణ్యం ఎలా వచ్చింది?
తాను స్నానం చేసిన ప్రతి నదినీ అతను గంగ గానే భావించాడు. అతనికి ఆ నీరు గంగగానే తోచింది. ఆ భావనతో, ఆ పులకరింపుతోనే స్నానం చేశాడు.
ఇలాంటి వారిని చూసే "మన్ చంగా తో కఠౌతీ మే గంగా" అన్న నానుడి వచ్చిందేమో....

గమ్యమే కాదు.. ప్రయాణం ఎలా చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం....

1 comment:

  1. sir, mee pravaaham konasaagutune vundi. ippati taraaniki ilaantivi atyaavasyakam.

    ReplyDelete

Pages