పాపం సదాశివ్ ..... - Raka Lokam

పాపం సదాశివ్ .....

Share This


"రేయ్.... ఉదయ్ ఊళ్లోకి వచ్చాడు... కలుద్దాం రారా...."
సదాశివ్ కి ఫోన్ వచ్చింది.
ఉదయ్ .... బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెండ్ ....ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.
సదాశివ్ విజయ్ ఎలక్ట్రికల్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

మిత్రులు కలిశారు...
మాటలు చెప్పుకున్నారు....
"చలో .... చాట్ తిందాం ....." అనుకున్నారు....
అదే సదాశివ్ చేసిన తప్పు.....

అది 2007
* * *

మహ్మద్ సిరాజుద్దీన్ తన షాప్ లో పని చేసుకుంటున్నాడు.
నమాజుకు వెళ్తున్నాడు.
మిత్రులతో కలుస్తూనే ఉన్నాడు.
ఆ రోజు కొందరు కొత్త మిత్రులను కలుసుకున్నాడు...

"ఖైరియత్... ఖైరియత్" అనుకున్నారు....
"చలో ..... మస్జిద్ జాయేంగే" అనుకున్నారు....
అదే సిరాజుద్దీన్ చేసిన తప్పు.

అదీ 2007 లోనే......

* * *

ఆ ఒక్క తప్పుకి సదాశివ్ శరీరం కుడి భాగమంతా చచ్చుబడిపోయింది. ఎడమ కాలు పని చేయకుండా పోయింది. మాట కూడా పడిపోయింది.
బతుకంతా మారిపోయింది. మంచానికి అతుక్కుపోయాడు సదాశివ్....
మందులు ..... మాకులు ........ చికిత్సలు .......ఫిజియోథెరపీలు .... ఇదే బతుకైపోయింది సదాశివ్ కి.

గత అయిదేళ్లుగా....

* * *

తన ఒక్క తప్పుకి సిరాజుద్దీన్ జైలులో ఉండిపోయాడు. వ్యాపారం దెబ్బతిన్నది. చాలా రోజులపాటు కేసులు నడిచాయి.
బతుకంతా మారిపోయింది. జైలుకే పరిమితమైపోయాడు సిరాజుద్దీన్.
అవమానాలు ... విచారణలు.... కోర్టులు.... దర్యాప్తులు....ఇదే బతుకైపోయింది సిరాజుద్దీన్ కి.

గత అయిదేళ్లుగా....

* * *

న్యాయస్థానం సిరాజుద్దీన్ ఏ తప్పూ చేయలేదని, అతను నిర్దోషి అని ప్రకటించింది.
సదాశివ్ పైన కేసూ లేదు. విచారణా లేదు. అతను నిర్దోషి అని ఒకరు ప్రకటించాల్సిన అవసరం లేనేలేదు.

* * *

తప్పుడు కేసులో అరెస్టు చేసినందుకు సిరాజుద్దీన్ కి సర్కారు క్షమాపణ చెప్పింది. మూడు లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చింది. అతని నడవడిక మంచిదేనని సర్కారే ధృవీకరణ పత్రం ఇచ్చింది. అదీ మంత్రి గారి చేతుల మీదుగా..... భారతరత్నలకు కూడా దొరకని అత్యంత అరుదైన క్యారక్టర్ సర్టిఫికేట్ అతనికి దొరికింది.

సదాశివ్ ఏ తప్పూ చేయకపోయినా అతని "గృహనిర్బంధం" కొనసాగుతూనే ఉంది. ఫిజియోథెరపీకి నెలకి ఇరవై వేలు ఖర్చవుతున్నాయి. "మేమున్నన్నాళ్లూ ఎలాగోలా చూసుకుంటాం. ఆ తరువాత సంగతేమి"టని అమ్మానాన్నా కన్నీరు మున్నీరవుతున్నారు. సదాశివ్ ను చూసేందుకు ఎవరూ రారు. మంత్రుల మాట సరేసరి.

సిరాజుద్దీన్ తప్పు చేయలేదు.
సదాశివ కూడా తప్పు చేయలేదు.
సిరాజుద్దీన్ నిర్దోషి.
సదాశివ్ కూడా నిర్దోషే.

* * *





సిరాజుద్దీన్ మే 2007 మక్కా మస్జిద్ పేలుళ్ల కేసులో ఇరుక్కున్నాడు.
సదాశివరెడ్డి ఆగస్టు 2007 గోకుల్ చాట్ పేలుడులో గాయపడ్డాడు.
సిరాజుద్దీన్ కు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి అహ్మదుల్లాలు బాసటగా నిలిచారు.
సదాశివరెడ్డికి అమ్మానాన్నా తప్ప ప్రపంచంలో మరే తోడూనీడా లేదు.

చేయని తప్పుకు సిరాజుద్దీన్ శిక్ష పూర్తయింది..
సదాశివ్ శిక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

No comments:

Post a Comment

Pages