బండలు పగలేసినం.....చెట్లను కొట్టేసినం..... - Raka Lokam

బండలు పగలేసినం.....చెట్లను కొట్టేసినం.....

Share This



అక్కడ చాలా మంది రాళ్లు పగలగొడుతున్నారు.

బాటసారి అక్కడ ఆగిపోయాడు.

ఒక రాళ్లుకొట్టే వాడిని ఆపి "ఇక్కడేం జరుగుతోంది?" అని అడిగాడు.

"కనబడటం లేదా... బండలు పగలేస్తున్నాం" అన్నాడతను విసుగ్గా.

"ఎందుకు పగలేస్తున్నారు?"

"ఏమో... ఎందుకైతే నాకేం. నా కూలి డబ్బులు నాకొస్తున్నాయి." అన్నాడతను మరింత విసుగ్గా.


బాటసారి కాస్త ముందుకు నడిచాడు. ఇంకొక పనివాడిని ఆపి ఇదే ప్రశ్న వేశాడు.

"ఇక్కడేదో కడుతున్నారట. చాలా పెద్ద కట్టడం ఇది" అన్నాడు వాడు.


బాటసారి మరింత ముందుకు నడిచాడు.

అక్కడ ఇంకో కూలీ అదే పనిలో ఉన్నాడు.

అతడిని ఆపి అదే ప్రశ్న వేశాడు.

" ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక భవ్య మందిరం. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వేలాది మంది ఇక్కడ పూజలు చేస్తారు. ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు."

అతని కళ్లలో ఒక మెరుపు కనిపించింది బాటసారికి.

ఇంత గొప్ప పనిలో నేనూ పాలుపంచుకుంటున్నాను అన్నట్టున్నాయి అతని కళ్లు.


* * *
ముగ్గురూ కూలీలే ....

డబ్బుకోసం పనిచేసేవారే....

ముగ్గురు చేస్తున్న పని కూడా ఒక్కటే.....

తేడా పనిలో లేదు.

తేడా పనిచేసేవారి దృక్పథంలో ఉంది.



చెట్లను కొట్టేసినం.....


రామయ్య ఉద్యోగం కోసం వెంకయ్య దగ్గరికి వచ్చాడు.

"నా పెరట్లో ఉన్న చెట్లు కొట్టే పని ఉంది చేస్తావా?"

బేరం కుదిరింది.

పని ఒప్పుకున్నాడు రామయ్య.

మొదటి రోజే ఏకబిగిన పనిచేసి ఆరు చెట్లను కొట్టేశాడు. యజమాని మెచ్చుకుని అదనంగా డబ్బులిచ్చాడు.

ఆ తరువాత నాలుగైదు రోజుల పాటు రోజుకి ఆరేసి చెట్లు కొట్టేశాడు.

ఆ తరువాత రోజు అయిదు చెట్లే కొట్టాడు.

రామయ్యలో పట్టుదల పెరిగింది. మరుసటి రోజు మామూలుకన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. అన్నం తినే టైమును తగ్గించుకున్నాడు. సాయంత్రం ఒక గంట ఎక్కువ పనిచేశాడు.

ఇంత చేసినా ఆ రోజు రెండే చెట్లు కొట్టగలిగాడు.

ఆ మరుసటి రోజు మరింత పట్టుదలతో పూనకం వచ్చినట్టు పనిచేశాడు.

ఆ రోజు ఒక్క చెట్టు కూడా పూర్తిగా కొట్టలేకపోయాడు.

వెంకయ్య దగ్గరకి వెళ్లాడు...

"నన్ను క్షమించండి. నా బలం, నా సామర్ధ్యం తగ్గిపోతున్నాయి. రోజంతా పని చేసినా ఒక్క చెట్టూ కొట్టలేకపోయాను. కారణం ఏమిటో తెలియడం లేదు" అన్నాడు.

"రామయ్యా... నువ్వు గొడ్డలిని పదును పెట్టావా?"

"ఎక్కడ పదును పెట్టడం... సమయమంతా చెట్టు నరకడానికే సరిపోయింది మరి" అన్నాడు రామయ్య...

* * *

చాలా సార్లు ఇంతే జరుగుతుంది.

పని చేస్తూనేపోతూంటాం... గుడ్డెద్దు చేలో పడ్డట్టు...

మన నైపుణ్యాలకు పదునుపెట్టుకోవడం మరిచిపోతూంటాం....

1 comment:

  1. i think it is applicable to our television journalists.. raaka ji, ur sharp writing style is excellent

    ReplyDelete

Pages