మారే హరి రఖే కోన్ .... రఖే హరి మారే కోన్ - Raka Lokam

మారే హరి రఖే కోన్ .... రఖే హరి మారే కోన్

Share This

ఒకాయన ఇక బతకడం వేస్టనుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.

ఉరేసుకోవాలా?

తుపాకీతో కణత మీద కాల్చుకోవాలా?

విషం తాగాలా?

సముద్రంలో దూకేయాలా?

"ఒకటేమిటి? నాలుగూ ఒకేసారి చేస్తాను. ఖచ్చితంగా చస్తాను. ఒకటి ఫెయిలయినా ఇంకొకటి పనిచేస్తుంది" అనుకుంటూ సముద్రం ఒడ్డుకి వెళ్లాడు.

ఒక పెద్ద చెట్టును చూసుకున్నాడు. బలమైన కొమ్మ పైకి ఎక్కి దానికి తాడు కట్టి, ఇంకో కొసతో మెడకి ఉరి బిగించుకున్నాడు. తుపాకీలో తూటా పెట్టుకున్నాడు. విషం సీసా మూత తెరిచి గడగడా తాగేశాడు. ఒక్కసారి కొమ్మ మీద నుంచి కిందకి దూకేశాడు. గొంతుకు ఉరి బిగుస్తున్న సమయంలోనే తుపాకీతో కాల్చుకున్నాడు.

కానీ ....

ఊగిసలాటలో తూటా గురితప్పింది. కణతకి తగలాల్సిన తూటా ఉరితాడుకి తగిలింది.

జారి కిందపడ్డాడు.

ఉరి పట్టు సడలింది.

పట్టు విడవకుండా సముద్రంలోకి పరుగెత్తాడు.

విషం పనిచేసి మూర్ఛపోయాడు.

ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు.

కళ్లు తెరిచే సరికి దేవకన్యలూ, హంసతూలికా తల్పాలూ కనిపించలేదు.

మెత్తటి ఇసుకపై బోర్లా పడున్నాడు. చుట్టూ చేరిన జాలరులు "వీడు బతికే ఉన్నాడురోయ్" అనుకుంటున్నారు.

ఇంతకీ ఏం జరిగింది?

కడుపులోకి వెళ్లిన సముద్రపు ఉప్పు నీరు తన పని తాను చేసేసింది. విషాన్ని భళ్లున కక్కించేసింది.


* * *

ఇంకొకాయన చావొద్దనుకున్నాడు.

కానీ తోటలోకి వెళ్లే సరికి మృత్యువు ఎదురొచ్చింది.

చూడగానే గజగజ వణుకూ, ఒళ్లంతా చెమటలూ ఒకేసారి వచ్చాయి..

"నువ్విక్కడేం చేస్తున్నావు" అంది మృత్యువు ఆశ్చర్యంగా...

మనవాడు బతుకు జీవుడా అని పరిగెత్తుకు వెళ్లిపోయాడు.

మిత్రుడి దగ్గరకు బిరబిరా వచ్చి, విలవిలా ఏడ్చి, నేనీ "ఊళ్లో ఉండను.... ఇక్కడ నాకు మృత్యువు కనిపించింది. నీ దగ్గర ఉన్న మంచి గుర్రాన్ని ఇవ్వు. మగధకి పారిపోతాను." అని వేడుకున్నాడు.

మిత్రుడు మంచి మేలుజాతి గుర్రాన్ని ఇచ్చి మిత్రుడిని మగధకి పంపించేశాడు.

"సాయంత్రానికల్లా మగధ చేరుకుంటాను. అక్కడ నేను సేఫ్ గా ఉంటాను" అన్నాడు.

మృత్యువు సంగతేమిటో తేలుద్దామని మిత్రుడు దాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు.

పురుగుల్నీ, పాముల్నీ తింటూ మృత్యువు కనిపించింది. "నా మిత్రుడిని ఎందుకు భయపెట్టావు?" అని నిలదీశాడు.

మృత్యువు "ఊరుకోవయ్యా బాబూ... నా లిస్టు ప్రకారం మీ వాడి చావు ఈ సాయంత్రం మగధలో ఉంది. గుర్రం నుంచి కిందపడి చావాలని వ్రాసి ఉంది. అలాంటిది వాడు ఇక్కడ కనిపించేసరికి యముడి లెక్క ఎలా తప్పిందా అని ఆశ్చర్యపోయాను ... అంతే" అంది.

ఆ సమయానికి మనవాడు మృత్యువునెక్కి, మృత్యువును చేరేందుకు మగధకి పరుగుపరుగున వెళ్తున్నాడు.

* * *

అస్సామియా భాషలో ఒక సామెత ఉంది.


మారే హరి రఖే కోన్
రఖే హరి మారే కోన్


(హరి చంపదలచుకుంటే కాపాడేవారెవరు. హరి రక్షించదలచుకుంటే చంపేదెవరు?)

No comments:

Post a Comment

Pages