కుక్క బతుకు నాకొద్దు..... - Raka Lokam

కుక్క బతుకు నాకొద్దు.....

Share This


ఊరకుక్క ఊరు వదిలి పట్నానికి వచ్చింది. ఆకాశాన్నంటేంత పెద్ద భవంతిని చూసి అబ్బురపడిపోయింది.

పెద్దపెద్ద గేట్లు.... ఎత్తైన కంపౌండ్ వాల్ చూసింది. నోరెళ్లబెట్టింది.

అంతలో దానికి తన జాతికి చెందిన ఒక శునకరాజం కనిపించింది.

అది బలంగా, ఒళ్లంతా నునుపుగా, ఎంతో అందంగా ఉంది.

తాను బక్కచిక్కి, డొక్క పీక్కుపోయి ఉంది.

భవనంలోని కుక్కకి అందమైన రూమ్ ఉంది. కూర్చునేందుకు సోఫా ఉంది. ఎత్తైన టైబుల్ ఉంది. టేబుల్ పై గిన్నె ఉంది....

"నాకు రోజు చిక్కటి పాలు, మంచి గోధుమ రొట్టెలు, సాయంత్రాలు మాంసం ముక్కలు తినేందుకు దొరుకుతాయి తెలుసా" అంది ఆ కుక్క....

ఊరకుక్కకి నోరూరింది. "ఒక్క ముక్క పెట్టవా" అని బతిమిలాడింది.

ఆ కుక్క దయతలచి ఒక ముక్క పెట్టింది. భలే రుచిగా ఉంది...

ఊరకుక్కకి తన బతుకు వ్యర్థం అనిపించింది.

"నన్ను ఇంట్లో అందరూ ఎంతో ముద్దు చేస్తారు. ఒళ్లో కూచోబెట్టుకుంటారు. అప్పుడప్పుడూ కారులో షికారు చేయిస్తారు తెలుసా"

ఊరకుక్కకి అసూయ, ఈర్ష్య, అక్కసు ఒక్కసారిగా తన్నుకొచ్చాయి.

"ఇంతకీ నువ్వు చేసే పనేమిటి?" ఉండబట్టలేక అడిగింది.

"ఏముంది.... రాత్రిపూట ఇంటికి కాపలా కాయడం.... దొంగలు వస్తే మొరగడం..."

ఊరకుక్క రోజూ చేసేది కూడా అదే పని. అయినా ఈ కుక్కకి ఇంత వైభోగం..... తనకి ఇంత దరిద్రం ఎందుకు?

"ఈ పని నేను కూడా అవలీలగా చేసేస్తాను" అంది....

అంతలో దాని దృష్టి సిటీ కుక్క మెడలో ఉన్న వస్తువుపై పడింది.

"ఇందాకటినుంచి అడుగుదామని అనుకుంటున్నాను. నీ మెడ చుట్టూ ఉన్నదేమిటి?"

"అదా.... అది తోలుబెల్టు...దీనికి గొలుసులు బిగించి నన్ను కట్టేసి ఉంచుతారు."

"ఎందుకు?"

"నేను ఎటూ పారిపోకుండా ఉండేందుకే ఈ గొలుసులు..."

ఊరకుక్కకి చిక్కటిపాలు, గోధుమరొట్టెలు, మాంసం ముక్కలు, కారులో షికారు ....చాలా అసహ్యంగా కనిపించాయి.

"ఛీ ....ఛీ.... వీటి కోసం నేను నా స్వేచ్ఛని వదులుకోలేను. నా బతుకే నయం... నా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగొచ్చు. ఎంత మంచి భోజనం దొరికితే మాత్రం స్వేచ్ఛని వదులుకుంటానా? ఈ కుక్క బతుకు నాకొద్దు" అనుకుంటూ గర్వంగా భౌ భౌ భౌ అనుకుంటూ తన సార్వ"భౌ"మత్వాన్ని ప్రకటించుకుంటూ వెళ్లిపోయింది.

* * *

వాసః కాంచన పంజరే నృపకరాంభోజైస్తనూమార్జనం
భక్ష్యం స్వాదు రసాల దాడిమి ఫలం పేయం సుధాంభపయః
పాఠః సంసది రామనామ సతతం ధీరస్య కీరస్య మై
హా హా మంత తథాపి జన్మవిటపిక్రోడం మనో ధావతి....


పంజరం బంగారంతో చేసింది.....

దానిమ్మ గింజలు పళ్లెంలో పెట్టారు....

రాజులు, రాణులు వొళ్లు నిమురుతారు....

కానీ చిలకకి సంతోషం లేదు... ఆనందం లేదు... అన్నం తినదు....

రోజురోజుకీ చిక్కిపోతుంది...

ఎందుకు బక్కచిక్కిపోతోంది?

కుక్కకి, చిలకకి తెలిసిన సత్యం పెద్ద, చిన్న మెదడులు ఉన్న మనిషికి ఎందుకు తెలియదో కదా!!

1 comment:

  1. చాలా చాలా బాగుంది సార్

    ReplyDelete

Pages