వంద రూపాయల నోటు - Raka Lokam

వంద రూపాయల నోటు

Share This



గురువుగారు శిష్యులందరినీ కూర్చోబెట్టారు.

జేబులోనుంచి ఒక వంద రూపాయల నోటు బయటకి తీశారు.

"ఇది ఎవరికి కావాలో చెయ్యి ఎత్తండి" అని అడిగారు.

అందరూ చేతులెత్తారు.

ఆ తరువాత ఆయన ఆ నోటును ఒక ఉండగా చేసి, నలిపివేశారు. ఆ ఉండను పైకెత్తి చూపుతూ "ఇది ఎవరికి కావాలి" అని అడిగారు.

"నాకు.... నాకు ..." అంటూ అందరూ మళ్లీ చేతులెత్తారు.

ఆప్పుడు ఆ గురువు గారు ఆ ఉండను కింద పారేసి కాలుతో తొక్కి "ఇప్పుడు చెప్పండి" అన్నాడు.

అందరూ మళ్లీ చేతులెత్తారు.

అప్పుడు ఆ గురువుగారు ఇలా అన్నారు.

"చూశారా నాయనలారా.... నలిపినా, తొక్కినా వందరూపాయల నోటు వందరూపాయల నోటే. దాని విలువ తగ్గదు. పరిస్థితులు ఒక్కోసారి మనలను నలిపివేయవచ్చు. ఇంకో సారి తొక్కేయవచ్చు. కానీ మన విలువల్లో మార్పు రాకూడదు. అదీ ఈ వంద రూపాయల నోటు చెప్పే గుణపాఠం."


చేసుకున్నోడికి చేసుకున్నంత

ఒక కాంట్రాక్టర్ బోలెడు ధనాన్ని సంపాదించాడు. ఇక సంపాదన చాలనుకున్నాడు. తనను నమ్మి ముప్ఫై ఏళ్లుగా తన వద్దే పనిచేసే సూపర్ వైజర్ కి ఈ విషయం చెప్పాడు.

"నేను ఒక ఏడాది పాటు తీర్థయాత్రలకు వెళ్తాను. నువ్వు నాకు ఒక చక్కని మేడ కట్టించి సిద్ధంగా ఉంచు"

యజమాని ఉండడు కాబట్టి దొరికినంత దండుకోవడానికి ఇదే మెండైన అవకాశం అనుకున్నాడు సూపర్ వైజర్. మొత్తం నాసిరకం, చవకబారు వస్తువులను వాడి ఇల్లు కట్టించాడు. ఏడాదిలో కుప్పకూలేంత నాసిగా తయారైంది ఇల్లు. చాలా డబ్బు మిగుల్చుకున్నాడు.

ఏడాది తరువాత యజమాని తిరిగివచ్చాడు.

సూపర్ వైజర్ ని పిలిచి "ఇల్లెలా ఉంది" అని అడిగాడు.

"అయ్యా .... చాలా బాగుంది. ఇంతకన్నా నాణ్యమైన ఇల్లు ఇంకొకటి లేదు"

"మంచిది... ఇన్నాళ్లూ నువ్వు నా వెంట ఉన్నందుకు కృతజ్ఞతగా ఆ ఇల్లు నీకే బహుమతిగా ఇస్తున్నాను" అన్నాడు.

కళ్లు తిరిగిపోయాయి సూపర్ వైజర్ కి.

చేసుకున్న వాడికి చేసుకున్నంత మరి!!

No comments:

Post a Comment

Pages