ముచ్చటగా మూడు కథలు!!! - Raka Lokam

ముచ్చటగా మూడు కథలు!!!

Share This



1
కాకి చెట్టు చిటారు కొమ్మన కూర్చుని పనీపాటా లేకుండా కావుకావు మంటోంది.

నిత్యం పరుగులు తీసే కుందేలుకి తనకీ కాకిలా కాలుమీద కాలేసుకుని బ్రతకాలనిపించింది. "కాకి బావా... కాకి బావా ... నాకు నీలా ఉండాలనుంది" అంది

"దానికేం భాగ్యం... అలాగే ఉండు" అంది కాకి.

కుందేలు చెట్టు కింద కాలుమీద కాలేసుకుని కూర్చుంది. పైగా ఆనందంతో అరుపులూ,కేకలూ వేసింది.

అటుగా వెళ్తున్న తోడేలుకి కుందేలు కనిపించింది. హాయిగా ఆదమరచి ఉన్న కుందేలుపైకి ఒక్క ఉదుటున దూకింది.

ఆ రోజు భోజనం అప్పణంగా దొరికింది తోడేలుకి.....

నీతి - ఎవర్నో చూసి గుడ్డిగా అనుకరించకు
కాకిని అనుకరించిన కుందేలులా కుదేలైపోతావు.





2

ఒక కుందేలుకి ఎగిరి చెట్టు చిటారుకొమ్మ చేరాలనిపించింది. ఓ రాబందును బతిమలాడుకుంది.

రాబందుకి దయ కలిగింది. తన ముక్కుతో దాన్ని కరుచుకుని చిటారుకొమ్మపైన కూర్చోబెట్టింది.

చల్లగాలి తగిలేసరికి కుందేలుకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. గట్టిగా కేకలేసింది.

ఓ వేటగాడు దీన్ని చూశాడు.

తుపాకీ గురిచూసి కాల్చాడు. పిట్టలా ఉండాలనుకున్న కుందేలు పిట్టలా రాలిపోయింది.

నీతి- పరుల బలం నీ బలం కాదు.
అది ప్రమాదానికి దారి తీస్తుంది.





3

అది చలికాలం

ఓ పక్షి చలికి గడ్డకట్టినట్టై రెక్కలు విదల్చలేకపోయింది.

పిట్టలా రాలి శవంలా కింద పడిపోయింది.

కొద్దిసేపటికి అదే దారిలో వెళ్తున్న ఆవు దానిపై పేడ వేసింది. ఆ పేడ వేడికి బిగుసుకుపోయిన పక్షి శరీరానికి జవసత్వాలు తిరిగి వచ్చాయి. అది కండరాల్ని కదిలించింది. రెక్కల్ని విదిలించింది.

"కూ .... కూ " అని కూత కూసింది.

ఓ నక్క ఈ పేడలో ఉన్న పక్షిని పీక పట్టి బైటకి లాగింది.

పక్షి "థాంక్స్ .... నక్కబావా" అంది.

ఆ మరుక్షణం నక్క దాన్ని చంపి తినేసింది.

నీతి - నీమీద పేడ జల్లే వాడు నీ శత్రువు కాదు.
పేడలోనుంచి బయటక తీసేవాడు నీ మిత్రుడూ కాడు.
అన్నిటికన్నా ముఖ్యం పేడలో కూరుకుపోయినప్పుడు కూతలు కూయొద్దు... కోతలు కోయొద్దు....

No comments:

Post a Comment

Pages