ఎలకజోస్యం - Raka Lokam

ఎలకజోస్యం

Share This



చిలక జోస్యం గురించి మీరు వినే ఉంటారు. మరి ఎలకజోస్యం గురించి ఎప్పుడైనా విన్నారా?

అవునండీ... ఎలకజోస్యం కూడా ఉంది.

ఎక్కడ? చిత్తూరు జిల్లా ఐరాల మండలం ముదిగోళం గ్రామంలో ....

మామూలుగా మ్యాప్ లో చూస్తే పేరు కూడా కనబడనంత చిన్న ఊరు ముదిగోళం. చిత్తూరుకి 14.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని వేలాది గ్రామాల్లో ఇదొకటి. కానీ ఆ ఊరి వారిని అడిగితే ముదిగోళం ఊరిలోని కొండలు, గుట్టల్లో ఒకప్పుడు మునులు తపస్సు చేసుకునేవారని, అందుకే ఆ ప్రాంతానికి మునిగోళం అనేవారని, కాలక్రమేణా అది ముదిగోళంగా మారిందని చెబుతారు.

ముదిగోళం ఊరి శివారులో ఒక గుట్ట ఉంది. ఆ గుట్టలో ఒక గుహ ఉంది. ఆ గుహ చేరాలంటే కొండ ఎక్కాలి. దారి సరిగ్గా ఉండదు. నర సంచారం అసలు ఉండదు. గుహ ద్వారం ముందు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి గుహ అని వ్రాసి ఉంటుంది. "సాహసం శాయరా ఢింబకా" అనుకుంటూ అందులోకి వెళ్లాలి. వంగివంగి నడవాలి. చీకటి దారి. ఆ గుహలో అలా పోతూ ఉంటే కాస్సేపటికి ఎర్రని దీపం వెలుతురు కనిపిస్తుంది. అలాగే నడుచుకుంటూ పోతే దీపం దగ్గరవుతుంది. కాంతి పెద్దదౌతుంది. గుహ గర్భంలో కొన్ని దేవుళ్ల విగ్రహాలు, పటాలు ఉంటాయి. అదే ముదిగోళం సిద్ధేశ్వరుని గుడి.

ఆ గుడికి ఒక చరిత్ర ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు బోరు వేయాలన్నా, అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి చేయాలన్నా, సంతతి కావాలన్నా, అనుకున్న పని అవుతుందా కాదా వంటి ప్రశ్నలు తెలుసుకోవాలంటే ఆ గుహలోకి రావాల్సిందే. అక్కడి పూజారి మార్కొండ మందడిని అడిగి తెలుసుకోవాల్సిందే. గుడిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. కొందరు సిద్ధుల విగ్రహాలూ ఉన్నాయి. వారి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.

ఆ గుహకి మార్కొండ మందడికి ఒక విచిత్రమైన అనుబంధం. శతాబ్దాల క్రితం మందడి పూర్వీకులు ఆ ప్రాంతం దొరల పశువుల్ని కాసేవారు. ఒక ఆవు పొదుగునిండా పాలున్నా పాలు ఇచ్చేది కాదుట. ఈ విడ్డూరం ఏమిటని వెతుకుతూ పోగా ఒక గుట్ట మీద ఆవు పాలను ఒక సిద్ధుడు పితుక్కోవడం చూశారట.ఊళ్లో వాళ్లందరూ వచ్చి ఆ సిద్ధుడిని పూజించడం మొదలుపెట్టారట. చివరికి సిద్ధుడు తాను మాయమైపోతానని, ఇక్కడ తన స్థానంలో ఎలకలను పూజించాలని, దానికి తనను చూసిన గొల్లవాళ్లే పూజారులుగా ఉండాలని చెప్పి చక్కా వెళ్లిపోయాడు. అలా ఆ గుహలో ఎలకల పూజ మొదలైంది. గొల్లలే పూజారులయ్యారు. ఆ గొల్ల పూజారుల్లో ఈ తరం వాడే మార్కొండ మందడి.

అప్పటి నుంచీ స్థానికులు దేవుడికి దణ్ణం పెట్టుకుని నైవేద్యం పెడతారు. అయిదు నిమిషాల్లో ఎలక వచ్చి ప్రసాదం ముట్టుకుంటే అనుకున్న పని అవుతుంది. ఒక ఎలక వస్తే పని నిదానంగా అవుతుంది. రెండెలుకలు వస్తే కాస్త వేగంగా అవుతుంది బోలెడన్ని ఎలుకలు వస్తే ఇక సక్సెస్ మీ వంతు. అలాగే పెళ్లి విషయంలోనూ .... ఒక ఎలక వస్తే వధూవరులకు పొత్తు పొసగదు. పెళ్లవుతుంది కానీ సుఖం ఉండదు. రెండెలుకలు వస్తే ఓకే. ఎలకలు నైవేద్యం కోసం కాట్లాడుకుంటే అంతే సంగతులు. బోరు వేయాలనుకొండి. ఎలుకలు ఎన్ని వస్తే అన్ని మీటర్ల లోతున నీరు పడుతుందన్న మాట.

ఈ ఆచారం వేల ఏళ్ల నుంచి నడుస్తోంది. ప్రజలు నమ్మకంగా వస్తున్నారు. అనుకున్నది అవుతోంది. పూజారికి వస్తే గిస్తే రూపాయో రెండు రూపాయలో వస్తుంది. కానీ నమ్మి వచ్చిన వాళ్లకి తృప్తి, నిర్ధారణ దొరుకుతున్నాయి.

ఎలకలు జోస్యం చెబుతాయా? వీటికి జ్యోతిష్యానికి ఏమిటి సంబంధం? ఈ ఎలకల వెనుక మతతత్వ వాదుల కుట్ర ఏదైనా ఉందా? గోచి పాత రాయుడైన మార్కొండ మందడి దక్షిణలు దండుకునేందుకే ఇదంతా చేస్తున్నాడా? జనవిజ్ఞాన సమితి దీన్ని ఇప్పటి వరకూ ఖండించిందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నిటినీ పక్కన బెట్టేయండి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు తెలియని ప్రజలను తరతరాలుగా ఒక నమ్మకం నడిపిస్తోంది. కష్టకాలంలో కౌన్సెలింగ్ చేస్తోంది. గడ్డు రోజులను దాటించేస్తోంది. ఆ నమ్మకానికి నమస్కరించండి.





పి.ఎస్ - చైనా జ్యోతిష్యం లెక్కల ప్రకారం 2011 ఎలక నామ సంవత్సరం. చైనా కమ్యూనిస్టు సర్కారు ఎలక నామ సంవత్సరాన్ని ఎంతో వైభవంగా పండగ చేయించింది. జన విజ్ఞాన వేదిక వారి దృష్టిలో మన ముదిగోళం మనుషులు మూఢాచారపరులు. చైనా వాళ్లు మాత్రం హేతువాదులు! చైనా, జపాన్లలో ఎలకలు భూకంపాలు వస్తున్నాయని ముందస్తు సూచనలు కూడా ఇస్తాయట. అమెరికాలో ఎలకల ప్రవర్తనను బట్టి షేర్ మార్కెట్ లో హెడ్జ్ ఫండ్ లాభ నష్టాలు అంచనా వేయడంపై పరిశోధనలు జరుగుతున్నాయట. అన్నట్టు రాజస్థాన్ లోని నాగూర్ జిల్లాలోని దేశ్ నోక్ గ్రామంలో ఉన్న కరణీమాత మందిరంలో ఎలకలను పూజిస్తారు. మన శాస్త్రాల్లో మూషికారాధన కూడా ఏమైనా ఉందా అన్నది మాత్రం తెలియదు.

No comments:

Post a Comment

Pages