అమ్మకానికో అబ్బాయి - Raka Lokam

అమ్మకానికో అబ్బాయి

Share This



తల్లీ, తండ్రీ కోరుకోని బిద్ద అతను. అతను పుట్టీ పుట్టగానే కానుపు చేసిన డాక్టర్ కే 26 డాలర్లకి అమ్మేసేందుకు తల్లి సిద్ధమైంది.

పేదరికం అతనికి అన్న. ఆకలి అతనికి తమ్ముడు.

తిండిపెట్టలేని తల్లి ఏడేళ్ల వయసులో అతడిని ఎకాడమీ ఆఫ్ చైనీస్ ఒపేరా లో చేర్పించింది. అప్పట్లో అదొక భయంకర కూపం. హింసకి, శిక్షలకీ, క్రౌర్యానికి అది మారుపేరు.

ఆ అబ్బాయి అక్కడ పదేళ్లు సంగీతం, నృత్యం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. దెబ్బలు, అర్ధాకలితో పోరాడుతూనే వచ్చాడు.

ఎకాడమీలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ పనులు చేయించేవాళ్లు. ఆ కుర్రాడు అన్నిటినీ సహించి బతికాడు.

పదిహేనేళ్ల వయసులో సినిమాల్లో స్టంట్ మాస్టర్ అయ్యాడు. గాయాలు, ప్రమాదాలతో సహజీవనం కొనసాగుతూనే వచ్చింది.

కష్టం చాలా ఎక్కువ

ఆదాయం చాలా తక్కువ

ఈ పరంపర ఇలా కొనసాగుతూ ఉండగానే సుప్రసిద్ధ కుంగ్ ఫు యోధుడు, ఎంటర్ ది డ్రాగన్ హీరో అయిన బ్రూస్ లీ హఠాత్తుగా చనిపోయాడు. దానితో చైనా సినీ ప్రొడ్యూసర్లు కొత్త మార్షల్ ఆర్ట్స్ హీరోల కోసం స్క్రీన్ టెస్టులు చేశారు.

అందులో ఈ కుర్రాడు ఎంపికయ్యాడు.

1978 లో స్నేక్ ఇన్ ఈగిల్స్ షాడో అన్న సినిమాలో నటించాడు. పూర్తిగా బ్రూస్ లీ నే అనుకరించాడు. ఆ సినిమా విడుదలయ్యాక ఆ కుర్రాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.

ఇకపై తాను బ్రూస్ లీ లా నటించకూడదు.

తను తనలాగానే ఉండాలి.

తానే ఒక కొత్త శైలికి శ్రీకారం చుట్టాలి.

అచిరకాలంలోనే అతని నటనా శైలి, మార్షల్ ఆర్ట్స్ నేపుణ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అతని నటనకు ప్రపంచం దాసోహం అంది. చైనా సినిమాల నుంచి హాలీవుడ్ దాకా ఎదిగాడు.

ఈ రోజు అతను ఏడాదికి యాభై మిలియన్ డాలర్లు సంపాదిస్తాడు.

ఒక రోజున 26 డాలర్లకు అమ్మకానికి నిలుచున్న ఆ వ్యక్తి ఈ రోజు అయిదు వేల మిలియన్ల డాలర్ల ఆస్తికి యజమాని.

ఆ నటుడే ....

జాకీ చాన్ .....

1 comment:

Pages